17న జిల్లా వ్యాప్తంగా మోగా ర‌క్త‌దాన శిబిరాలు

 


*17న జిల్లా వ్యాప్తంగా మోగా ర‌క్త‌దాన శిబిరాలు


*


*ఒక్కరోజే ల‌క్ష యూనిట్ల ర‌క్త సేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

*ర‌క్త‌దాన డ్రైవ్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన అద‌న‌పు డీఎం&హెచ్‌వో డా. రాణీ సంయుక్త‌


విజ‌య‌నగ‌రం, సెప్టెంబ‌ర్ 15 (ప్రజా అమరావతి) ః "ర‌క్త‌దానం చేయ‌టం - సంఘీభావం చాట‌డం, చేయి చేయి క‌లుపుదాం- ప్రాణాల‌ను కాపాడుదాం" అనే నినాదాల‌తో ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అద‌న‌పు డీఎం &హెచ్‌వో డా. రాణీ సంయుక్త పేర్కొన్నారు. తొమ్మిది ర‌క్తనిధి కేంద్రాల స‌హాయంతో జిల్లా వ్యాప్తంగా 40 ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు గురువారం త‌న కార్యాల‌యంలో విలేక‌రుల‌ స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వివరించారు. జిల్లాలోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హకారంతో ఆ ఒక్క‌రోజే లక్ష యూనిట్ల రక్తాన్ని సేక‌రించేందుకు ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నామ‌ని, ప్ర‌తి శిబిరం నుంచి క‌నీసం 2వేల యూనిట్లు సేక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. జాతీయ ర‌క్తదాన దినోత్స‌వం అన‌గా అక్టోబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు ఈ శిబిరాలు కొన‌సాగుతాయ‌ని ఆమె వివ‌రించారు.


ఈ మెగా కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌క్త‌దాత‌లు https://www.eraktkosh.in పేరుతో ఉన్న యాప్‌లో త‌మ పేర్ల‌ను, వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు సంస్థ‌లు, స‌చివాల‌య సిబ్బంది, జిల్లాలోని యువ‌త‌, సామాజిక సంస్థల ప్ర‌తినిధులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని డా. రాణీ సంయుక్త ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం ఏపీఆర్వో డి. నారాయ‌ణ‌రావు, ఎయిడ్స్ నియంత్ర‌ణ‌ విభాగ అధికారులు ఎం. సాక్షి గోపాల‌రావు, పి. శ్రీ‌నివాస‌రావుల‌తో క‌లిసి ఆమె మెగా బ్ల‌డ్ డొనేష‌న్ డ్రైవ్‌కు సంబంధించిన‌ పోస్ట‌ర్ను ఆవిష్క‌రించారు.Comments