అక్టోబర్ 1న రాజమండ్రిలో మహిళా పండుగ - 'మహిళా సాధికారత ఉత్సవం' పోస్టర్ ఆవిష్కరణలో 'వాసిరెడ్డి పద్మ'

 అక్టోబర్ 1న రాజమండ్రిలో మహిళా పండుగ - 'మహిళా సాధికారత ఉత్సవం' పోస్టర్ ఆవిష్కరణలో 'వాసిరెడ్డి పద్మ' 


రాజమండ్రి (ప్రజా అమరావతి): అక్టోబర్ 1వ తేదీన రాజమండ్రిలో మహిళల పండుగగా 'దసరా మహిళా సాధికారత ఉత్సవం' జరుపుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. శనివారం రాజమండ్రి ఆర్అండ్ బీ అతిథిగృహంలో ఆమె స్థానిక ప్రముఖులు, న్యాయవాదులు, సైకాలిజిస్టులు, పలు ఎన్జీవోలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దసరా మహిళా సాధికారత ఉత్సవం పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఆయా సమూహాలతో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా కమిషన్ ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమ వివరాలు వివరించారు.  రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఆరోజు మధ్యాహ్నం నుంచి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవు తాయన్నారు. మహిళల బైక్ ర్యాలీ, నారీశక్తిని చాటే కళాప్రదర్శనలు, సాధికారత నృత్యరూపకాలు, వేషధారణలు, వీధినాటికలు, స్టేజీ షోలతో పాటు మహిళల కబడ్డీ, కర్రసాము, కరాటే, కోలాటం, గరగనృత్యం తదితర ప్రదర్శనలు, స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. అదేవిధంగా "సబల" రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనతో పాటు, సినీ, కళారంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి ఎంపిక చేసిన షార్ట్ ఫిల్మ్స్ పోటీల విజేతలకు రూ. 5లక్షల బహుమతులు ప్రదానం, స్ఫూర్తిదాయక మహిళలకు సన్మానం జరుగుతుందని ఆమె వివరించారు. దదాపు మూడు వేల మందితో ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. పోస్టర్ ఆవిష్కరణ సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ పిల్లి నిర్మల, సైకాలిజిస్ట్ అసోసియేషన్ జాతీయ మహిళా విభాగ అధ్యక్షులు డాక్టర్ పద్మ కమలాకర్, సైకాలిజిస్టుల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్. మహాలక్ష్మి కుమార్, స్థానిక ప్రముఖ న్యాయవాదులు కెటివీఆర్ స్వర్ణలత, జి.రాధిక, వైవీఎస్ శ్యామల, ఏఎస్ ప్రియ, మౌలాలి మహ్మద్, సైకాలిజిస్టులు డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్, డాక్టర్ పి.రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Comments