విజయవాడ (ప్రజా అమరావతి);
ప్రధాన దేవాలయాల్లో సెప్టెంబర్ 20 నుంచి ఆన్ లైన్ సేవలు..
• దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు
• దసరా ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
• వీఐపీల దర్శనాల కోసం 5 ప్రత్యేక స్లాట్స్.. వికలాంగులు, వృద్ధుల కోసం 2 స్లాట్స్
• సాధారణ భక్తులకు 20 గంటలూ దర్శనం..
• భవానీ భక్తులకు టీటీడీ కళ్యాణ మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు.
• వివరాలను వెల్లడించిన డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
దేవాదాయ, ధర్మాదాయ శాఖలో సేవలను పారదర్శకంగా అమలుచేయడానికి వీలుగా కొత్త సాప్ట్ వేర్ ను రూపొందించామని, సెప్టెంబర్ 20 నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దేవాలయంతో సహా రాష్ట్రంలోని 9 ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా వీఐపీల దర్శనాల కోసం ప్రత్యేకంగా 5 స్లాట్స్ అమలు చేయనున్నట్లు, సాధారణ భక్తులకు ఎటువంటి స్లాట్స్ అమలు చేయడంలేదని ఉధయం 3గంటల నుంచి అర్థరాత్రి 11 గంటల వరకూ ఎప్పుడైనా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ జమ్మిచెట్టు సెంటర్ లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం వివరాలను మంగళవారం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలైన కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ దేవాలయం, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, ద్వారకాతిరుమల, సింహాచలం, కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ సౌకర్యాలు ప్రారంభిస్తామన్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉండే మరో 10 దేవాలయాలలో కూడా ఆన్ లైన్ సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నామని తెలిపారు. పదోన్నతులపై కసరత్తు జరుగుతుందని, ఇప్పటికే ముగ్గురికి డీసీ లుగా పదోన్నతులు కల్పించామన్నారు. అక్టోబర్ 10న ధార్మిక పరిషత్ తొలి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే ట్రిబ్యునల్ లో పెండింగ్ లో కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటికే చైర్మన్ ఉన్నారని, తాజాగా రిటైర్డ్ ఐఎఎస్ డా. ఎం. పద్మని మెంబర్ గా నియమించామని, మిగతా మెంబర్స్ ని కూడా త్వరలోనే నియమిస్తామని తెలిపారు. అలాగే 9 స్టాండింగ్ కౌన్సిల్ లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రతీ మంగళవారం దేవాదాయ శాఖపై సమీక్షిస్తున్నామని, దసరా ఉత్సవాలపై కూడా అదికారులతో మరోసారి సమీక్షించామని చెప్పారు. వీవీఐపీల ప్రివిలేజ్ లను సంరంక్షిచేలా.. ముఖ్యమంత్రి, గవర్నర్, చీఫ్ జస్టిస్ లకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని, వీలైనంత ఎక్కువ మంది సాధారణ భక్తులకు దర్శనానికి ఇబ్బంది లేకుండా చేయడంకోసమే ఈ ప్రణాలికలు చేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకి ఇబ్బంధి కలగకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్ ని కేటాయిస్తున్నామని తెలిపారు. టైం స్లాట్ దర్శనం ఏర్పాటుకు ప్రత్యేక సాప్ట్ వేర్ రూపొందించామన్నారు. వీఐపీల కోసం ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకూ, 6 నుండి 8 వరకూ, 10 నుండి 12 వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకూ, రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ మొత్తం 5 స్లాట్స్ కేటాయించామని తెలిపారు. రెండు గంటల స్లాట్ లో 2 వేల చొప్పున విఐపి టిక్కెట్లు ఇవ్వనున్నామని, 500 రూపాయిల నిర్ణీత రుసుము ఉంటుందని తెలిపారు. వీటిలో 600 టిక్కెట్లు వీఐపీల కోసం, మిగిలిన 1400 టిక్కెట్లు భక్తులందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకూ ప్రత్యేక స్లాట్స్ ఏర్పాటు చేశామన్నారు. సామాన్య భక్తులు తెల్లవారుఝామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులకి సిఫారసు లేఖకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిఫారసు లేఖ ద్వారా ఆరుగురికి మాత్రమే 500 రూపాయిల టిక్కెట్ దర్శనం అవకాశం ఉంటుందన్నారు. దసరా ఉత్సవాల్లో రోజుకి 70 వేల మంది భక్తులు వస్తారని భావిస్తున్నామని, మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది భక్తులు రావచ్చని అంచనావేస్తున్నట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజున ఎటువంటి సిపారసు లేఖలు, దర్శనం కోసం టైం స్లాట్ లు పనిచేయవన్నారు. ఈవో అనుమతితో నిర్ణీత సమయంలో వాలంటీర్లు సేవలందిస్తారని, సేవలు అందించడానికి వాలంటీర్లకు క్యూ ఆర్ కోడ్ తో ఒక సమయాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే భవానీ మాల ధారణ భక్తులకు టీటీడీ కళ్యాణ మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.. స్నానాల కోసం కేశనఖండన శాల వద్ద గతంలో 300 షవర్ లు ఉంటే వాటిని 700కి పెంచామని తెలిపారు. పబ్లిక్ టాయిలెట్లు 150 నుంచి 300కి పెంచామన్నారు. సీసీ కెమెరాలు గతంలో ఉన్న 220 నుంచి 300లకి పెంచుతున్నామని తెలిపారు. ప్రసాదం కౌంటర్లు రెట్టింపు చేశామన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ, ఈవో, ఇతర ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదిక అందించారని, సామాన్య భక్తులకు ఒక గంటలోపే దర్సనం పూర్తి అవుతుందని ట్రైల్ రన్ లో గుర్తించామని మంత్రి తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం కలిగిలే అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
addComments
Post a Comment