*సాలూరు దాహార్తికి శాశ్వత పరిష్కారం
*
పార్వతీపురం/ సాలూరు, సెప్టెంబర్ 10 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఏఐఐబి నిధులు రూ.68.98 కోట్లతో భారీ నీటి ప్రాజెక్టుకు ప్రతిపాదించారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ నుండి 33.16 కిలో మీటర్ల పైపు లైన్ వేసి సాలూరు పట్టణానికి నీటిని తీసుకురావడం జరుగుతుంది. 2047 నాటికి పట్టణ జనాభా 75 వేలు ఉంటుందని అంచనా వేస్తూ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. తలసరి 135 లీటర్ల నీటి సరఫరా చేయుటకు, ప్రాజెక్టులో భాగంగా కొత్తగా 8,500 కొళాయిలు వేయుటకు చర్యలు చేపట్టారు. పట్టణంలో ప్రస్తుతం 3,372 కొళాయిలు ఉన్నాయి. గాంధీ పార్కు వద్ద 8 లక్షల నీటి సామర్థ్యం, కాపు బిడ్డ వలస వద్ద 5 లక్షల నీటి సామర్థ్యం గల రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేయుటకు ప్రాజెక్టులో నిర్ణయించారు. ప్రజా ఆరోగ్య ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం జరిగింది. సమగ్ర తాగు నీటి సరఫరా పథకం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర శని వారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాలూరు పట్టణంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రానున్న వంద సంవత్సరాల వరకు సామర్థ్యాన్ని వినియోగించు కోవచ్చని పేర్కొన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు మంజూరు అయ్యాయని, వివిధ కారణాల వలన జాప్యం జరిగిందని ఆయన వివరించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మరల ప్రారంభం కావడం జరిగిందని ఆయన పేర్కొంటూ ముఖ్య మంత్రి ప్రాజెక్టు మంజూరుకు సానుకూలంగా స్పందిస్తూ తిరిగి మంజూరు చేసారని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేనవిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి అడుగు ప్రగతి పథంలో పడుతోందని రాజన్న దొర అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామ సచివాలయం పరిధిలో మౌళిక సదుపాయాలు కల్పించుటకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు జరిగిందని ఆయన చెప్పారు. ఈ నిధులతో అనేక సమస్యలు పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు.
ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కె.రాజారావు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి రాజన్న చొరవతో ప్రాజెక్ట్ మంజూరు అయిందన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రజా ఆరోగ్య శాఖ ఇంజినీరింగ్ అధికారి కె.జి.ఎన్.నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకర రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment