ఎస్.టి.కంపొనెంట్ నిధులను సకాలంలో వెచ్చించి గిరిజనులకు లబ్దిచేకూర్చాలి.

 *ఎస్.టి.కంపొనెంట్ నిధులను సకాలంలో వెచ్చించి గిరిజనులకు లబ్దిచేకూర్చాలి


*

*ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర*

                                                                                                                                                                                   అమరావతి, సెప్టెంబరు 8 (ప్రజా అమరావతి): గిరిజనుల సంక్షేమాన్ని, అభివృద్దిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.6,144.90 కోట్ల ఎస్.టి.కంపొనెంట్ నిధులను సకాలంలో వెచ్చించి గిరిజనులకు పెద్ద ఎత్తున లబ్దిచేకూర్చాలని ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అధికారులను ఆదేశించారు. ఎస్.టి.కంపొనెంట్ నోడల్ ఏజన్సీ 26 వ సమావేశం ఆయన అద్యక్షతన గురువారం సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో జరిగింది.  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి  కాంతీలాల్ దండే, సంచాలకులు ఎం.జాహ్నవి తో పాటు దాదాపు 40 లైన్ డిపార్టుమెంట్స్ అధికారులు, ఐ.టి.డి.ఏ. పి.ఓ.లు పాల్గొన్న ఈ సమావేశంలో ఎస్.టి.కంపొనెంట్ నిధుల వెచ్చింపు, వాటితో చేపట్టిన పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. ప్రాంతాల వారీగా ప్రాధాన్యత క్రమంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై సంబందిత శాఖల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. 

                                                                                                                                                                                              ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గిరిజనుల సంక్షేమానికి, అభివృద్దికి మరియు గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,144.90 కోట్ల మేర ఎస్.టి.కంపొనెంట్ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో రూ.6,044.90 కోట్ల మేర నిధులను దాదాపు 40 లైన్ డిపార్టుమెంట్స్ కు పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకై కేటాయించగా, మిగిలిన  రూ.100 కోట్లను గిరిజనుల జీవనోపాధి ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరతన్నాల అమలుకు  ప్రాధాన్యత నిస్తూ పలు పనుల నిర్వహణకై మరియు గిరిజనులకు జీవనోపాధి, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకై  ఇప్పటికే  పలు అనుమతులను ఇవ్వడం జరిగిందన్నారు. అయితే చాలా శాఖలు వాటికి కేటాయించిన నిధుల వెచ్చింపులోనూ, పనుల ప్రగతిలోనూ చాలా వెనుకబడి ఉన్నాయని, సంబందిత శాఖల అధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో నూతన వైద్య కళాశాలలు మరియు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని సంబందిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. హరిత భారత జాతీయ మిషన్ అమల్లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణాన్ని మెరుగు పర్చే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని గిరిజన, అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. గిరిజన గృహాలకు  200  యూనిట్ల వరకూ విద్యుత్ చార్జీల రీయింబర్స్ మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు పర్చాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. 

                                                                                                                                                                                    రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ  కార్యదర్శి  కాంతీలాల్ దండే,  సంచాలకులు ఎం.జాహ్నవి, ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్  ఇ.రవీంద్రబాబు తదితరులతో పాటు పలు శాఖల ఉన్నత అధికారులు, ఐ.టి.డి.ఎ.ల పి.ఓ.లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

                                                                                                                                                                                                                

Comments