నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి

 


నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి


భూ సేకరణ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాలి

రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజయనగరం, సెప్టెంబర్ 09 (ప్రజా అమరావతి):

               భోగాపురం విమానాశ్రయ నిర్వాసితులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని, అధికారుల‌ను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన నవంబర్ నాటికి పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, ట్రైబల్ యూనివర్సిటీ, సాగరమాల, భోగాపురం విమానాశ్రయ భూ సేకరణ పై, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను, కోర్టు వివాదాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మంత్రికి వివ‌రించారు.


              ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, విమానాశ్రయానికి సంబంధించి మొత్తం భూసేక‌ర‌ణ‌ను వీలైనంత త్వ‌రగా పూర్తి చేసి, శంకుస్థాప‌న‌కు సిద్దం చేయాల‌ని ఆదేశించారు. నిర్వాసితుల పున‌రావాస కాల‌నీల‌ను న‌వంబ‌రు నాటికి పూర్తిచేయాల‌ని సూచించారు. వారికి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్‌, కాలువ‌లు త‌దిత‌ర‌ అన్ని మౌలిక వ‌స‌తుల‌తోపాటు, అవ‌స‌ర‌మైన చోట పాఠ‌శాల‌ల ఏర్పాట‌కు స‌ర్వే చేయాల‌ని సూచించారు. అలాగే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పంచాయితీరాజ్‌ రోడ్ల నిర్మాణ ప‌నుల‌ను కూడా త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యానికి చేప‌ట్టిన‌ భూసేక‌ర‌ణ ప్ర‌క్ర‌య‌పై ఆరా తీశారు. ఇప్ప‌టికే దాదాపు భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని, దీనిలో వెంట‌నే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. తార‌క‌రామ‌తీర్ధ సాగ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంపై స‌మీక్షిస్తూ, సారిప‌ల్లి గ్రామ‌ స‌మ‌స్య‌పై చ‌ర్చించారు. సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి, గ్రామ‌స్తుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.


             ఈ స‌మావేశంలో జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంఎల్ఏ బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, ఆర్‌డిఓ సూర్య‌క‌ళ‌, పంచాయితీరాజ్‌, ఆర్ అండ్ బి, ఆర్ డ‌బ్ల్యూఎస్ సూప‌రింటిండెంట్ ఇంజ‌నీర్లు, ఇత‌ర అధికారులు, తాశీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


Comments