*మహిళల ఆర్థిక వికాసమే లక్ష్యం*
పార్వతీపురం/పాచిపెంట, సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో మహిళల ఆర్థిక వికాసమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత కార్యక్రమం క్రింద ఆర్థిక సహాయం పంపిణీ పాచిపెంటలో శని వారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.యస్.ఆర్ చేయూత క్రింద జిల్లాలో 75,290 మందికి రూ.140.07 కోట్లు ఆర్ధిక సహాయం అందించడం జరిగిందన్నారు. మహిళల సమగ్ర అభివృద్ధి ఎజెండా, ఆర్థిక సాధికారతలో భాగంగా నవరత్నాలలో "వై.యస్.ఆర్ చేయూత" పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల బి.సి, యస్.సి, యస్.టి, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు నాలుగు దఫాలలో రూ.75000/- ఆర్థిక సహాయం అందించే సంక్షేమ కార్యక్రమమే “వై.యస్.ఆర్ చేయూత” అన్నారు. వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద ప్రభుత్వం రిటైల్, వస్త్ర వ్యాపారంలో గుర్తించిన లబ్ధిదారులకు అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటిసి లిమిటెడ్, ప్రాక్టర్ అండ్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన వివరించారు. పాడి రైతులకు పశువుల పెంపకం, పాల సేకరణ, ఆరోగ్య సేవలు, కిరాణా షాపులు, బట్టల షాపులు ఏర్పాటు, పండ్లు, కూరగాయలు, చిన్న జీవాలు కొనుగోలు కొరకు ఒప్పందాలు, ఆర్ధిక సహాయం చేయడం ద్వారా చిన్న మద్య తరహ వ్యాపారాలు నడుపుకోవడానికి లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోనేందుకు అవకాశం కల్పించటం జరుగుతుందని ఆయన చెప్పారు. వై.యస్.ఆర్ చేయూత క్రింద ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.376.16 కోట్లు ఆర్ధిక సహాయం జిల్లాలో అందిందని ఆయన చెప్పారు. వై.ఎస్.ఆర్ ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాల క్రింద అందించే మొత్తాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలను ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు వేయించాలని పిలుపు నిచ్చారు. ముఖ్య మంత్రి మహిళలు, పేదల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అనధికారికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment