చంద్రబాబు మోసాలపై బహిరంగ చర్చకు సిద్ధం

 చంద్రబాబు మోసాలపై బహిరంగ చర్చకు సిద్ధం


నక్కా ఆనందబాబు వి స్థాయికి మించిన మాటలు

సీఎం ను విమర్శించే నైతిక హక్కు నక్కా కు లేదు

మంత్రి మేరుగు నాగార్జున

అమరావతి, సెప్టెంబర్ 16 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని దళితులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను గురించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున సవాల్ విసిరారు. దళితులకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు పంచన దళిత నాయకులు ఎందుకు ఉంటున్నారని ఆయన నిలదీసారు. నక్కా ఆనందబాబుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.

సచివాలయం మీడియా పాయింట్ లో శుక్రవారం నాగార్జున మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాలించే అర్హత లేదని, సిగ్గు ఉందా? అని, రాజీనామా చేయాలని మాట్లాడటం ఆయన స్థాయికి మించిన మాటలని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేయడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని అయితే ‘ఉడుత ఊపులకు చింతకాయలు రాలవని’ నాగార్జున ఎద్దేవా చేసారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నప్పుడు కేసీ ఆర్ తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారని, అలాగే ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలు తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామాలు చేసారని గుర్తు చేసారు. పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు తమను ఆశీర్వదించి అధికారాన్ని అందించారని చెప్పారు. అదే విధంగా టీడీపీ నేతలకు గెలుస్తామనే నమ్మకం ఉంటే, దమ్ముంటే తమ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని నాగార్జున పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు అంటున్నారని చెప్పారు. అయితే ఒక్క రాజధాని కావాలని కోరుకుంటున్న టీడీపీ నేతలు తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు రాజధానిని నిర్మించలేకపోయారని నిలదీసారు. ప్రస్తుతం అమరావతి రైతుల పేరుతో వేమూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. బెంగుళూరు, చెన్నయ్, దుబాయ్, అమెరికాల నుంచి వచ్చిన వారు పాదయాత్ర పేరుతో నడుస్తున్నారని విమర్శించారు. వారు కోరుతున్న రాజధాని ప్రాంతం ఎక్కడ ఉంది, వారు ఎక్కడికి పాదయాత్ర చేస్తున్నారు, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, దీనికి ముగింపు ఎక్కడ అని నాగార్జున ప్రశ్నించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వారి ప్రతాపం చూపించి, రాష్ట్రంలో అలజడిని సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన అని, దళితులకు ద్రోహం చేసిన చంద్రబాబు దగ్గర దళిత నాయకులు ఇంకా ఎందుకు ఉన్నారో, ఆయన దగ్గర చప్రాసీ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు, దళితులు శుభ్రంగా ఉండరని ఆదినారాయణ రెడ్డి, నా కొడకల్లారా, మీకు రాజకీయం ఎందుకని చింతమనేని ప్రభాకర్ అన్నప్పుడే నిజమైన రాజకీయ నాయకులైతే టీడీపీని తృణప్రాయంగా వదిలేసి బయటికి వచ్చేవారని అభిప్రాయపడ్డారు. దళితులకు నిలవనీడ లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అంబేద్కర్ విగ్రహం పెడతామని కూడా ఆయన మోసం చేసారని నాగార్జున ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులకు చంద్రబాబు చేస్తున్న మోసాలను గురించి అంబేద్కర్ పాదాల దగ్గర కూర్చొని బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధమని, టీడీపీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని నాగార్జున సవాల్ చేసారు.

Comments