దివ్యాంగుల రుణాలకు దరఖాస్తుల స్వీకరణ

 


*దివ్యాంగుల రుణాలకు దరఖాస్తుల స్వీకరణ*


పార్వతీపురం, సెప్టెంబర్ 9 : దివ్యాంగులకు రుణాలు మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు యం.కిరణ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన జాతీయ దివ్యాంగుల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ (NHFDC) 2022 - 23 సంవత్సరానికి దివ్యాంగులకు రుణాలు మంజూరుకు నిర్ణయించిందన్నారు. జిల్లాకు కోటి రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వంద మందికి రుణాలు మంజూరు చేయుటకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. రుణాలు పొందుటకు ఈ నెల 12వ తేదీ లోగా అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా విభిన్న ప్రతిభావంతుల జిల్లా కార్యాలయంలో  సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. చిన్న వ్యాపారాలు చేయుటకు, ఉన్న వ్యాపారం అభివృద్ధి చేయుటకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మంజూరు అయిన రుణము మొత్తం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని,  ఎటువంటి సబ్సిడి ఉండదని ఆయన స్పష్టం చేశారు. రూ.10 వేల నుండి 50 వేల వరకు 5 శాతం వడ్డీతో, రూ.50 వేల నుండి 5 లక్షల వరకు 6 శాతం వడ్డీతో రుణం మంజూరు జరుగుతుందని ఆయన వివరించారు. రుణాలు పొందుటకు దివ్యాంగులు 40 శాతం అంగవైకల్యం కలిగి ఉండాలని, 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని చెప్పారు. మానసిక దివ్యాంగులు అయితే 14 సంవత్సరాలకు అర్హత కలిగి ఉంటారని ఆయన అన్నారు. ధరఖాస్తుతో పాటు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, విద్యా, శిక్షణా దృవీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం కాపీ, అంగవైకల్యం కనిపించేలా 2 పాస్ పోర్టు సైజు ఫోటోలు, లక్ష రూపాయలు పైబడిన రుణానికి సంబంధిత పరిశ్రమల శాఖ నుండి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలని ఆయన చెప్పారు. 


లక్ష రూపాయల రుణానికి కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగి ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి శ్యూరిటి ఉండాలని, రెండు లక్ష రూపాయలు దాటిన రుణానికి కనీసం 10 సంవత్సరాల సర్వీసు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగి శ్యూరిటి ఉండాలని, బ్యాంకు గ్యారెంటీ లేదా ఆస్తి తాలుకా ఒరిజనల్ దస్తావేజులు శ్యురిటిగా పెట్ట వచ్చుని ఆయన చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బిసి, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని సహాయ సంచాలకులు తెలిపారు. దివ్యాంగులైన మహిళలకు వడ్డీలో ఒక శాతం రిబేట్ ఇవ్వడం జరుగుతుందని, లక్ష రూపాయల వరకు రుణాలను తిరిగి చెల్లించుటకు మూడు సంవత్సరాల కాల పరిమితి, 5 లక్ష రూపాయల వరకు రుణానికి 5 సంవత్సరాల కాల పరిమితి నిర్ణయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 


జాయింట్ కలెక్టరు లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, జిల్లా మేనేజరు జూయింట్ బ్యాంకు అకౌంట్ కు ఇసిఎస్ చేయాలని,  లబ్ధిదారుడు సంతకము చేసిన మూడు చెక్కులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తులు పరిశీలన, ఎంపిక, రుణ  మంజూరు కార్యక్రమం జాయింట్ కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుందని ఆయన చెప్పారు. ఇతర వివరాలకు కార్యాలయపు ఫోన్ నెం. 08942 240519 కు సంప్రదించ వచ్చని చెప్పారు.

Comments