- ఎపి కాలుష్య నియంత్రణ మండలిపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం
- రాష్ట్రంలో మూడు టాస్క్ ఫోర్స్ ల ఏర్పాటుకు ఆదేశం
- కాలుష్య కారక సంస్థలపై నిరంతర పర్యవేక్షణ
- ఎపి పిసిబి పునర్ వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు
- మెరుగైన పనితీరుకు జోన్ ల విస్తరణ
- ఖాళీ పోస్ట్ ల భర్తీకి చర్యలు
: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలిని పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల పునర్వ వ్యస్థీకరణ నేపథ్యంలో ఎపి కాలుష్య నియంత్రణ మండలి కార్యకలాపాలను కూడా అందుకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించాలని సూచించారు. పదమూడు జిల్లాల పరిధిలో ఉన్న రీజనల్ కార్యాలయాలను పెరిగిన జిల్లాలకు అనుగుణంగా పెంచుకోవాలని కోరారు. అలాగే విశాఖ, విజయవాడ, కర్నూల్ లో ఉన్న జోనల్ కార్యాలయాలపై కూడా పెరిగిన జిల్లాల పనిభారం పడకుండా అవసరమైన మేరకు కొత్త జోన్ ల ఏర్పాటును పరిశీలించాలని అన్నారు.
కాలుష్య కారకాలుగా ఉన్న సంస్థలను కేటగిరిలుగా వర్గీకరించి ఎప్పటికప్పుడు వాటిపై తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఇటీవల పరిశ్రమల్లో ఏర్పడుతున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మూడు టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలు నిరంతరం పరిశ్రమలు, కాలుష్య కారక సంస్థలను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్రంలో రెడ్ కేటగిరిలో మొత్తం 4281 సంస్థలు, ఆరెంజ్ కేటగిరిలో 4158 సంస్థలు, హెచ్ సిఎఫ్ లు 12,358 ఉన్నాయని, వాటిలో భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు ఎపి పిసిబిలో ఖాళీ పోస్ట్ లను భర్తీ చేయాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేయడం ద్వారా పిబిసి ని మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎకె ఫరిడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఎపి కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్ కుమార్, పిసిబి సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాద్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment