*తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు*
తిరుమల పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసి, వాహనసేవలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కొవిడ్ తగ్గడంతో బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య ఆలయ నాలుగుమాడవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతోపాటు భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వివిధ రకాల సౌకర్యాలను సమకూర్చడానికి ఇప్పటికే ఉన్నతాధికారులు, పోలీసు, విజిలెన్స్ అధికారులు సమావేశమైన విషయం తెలిసిందే. ఉత్సవాలు సమీపిస్తుండటంతో తిరుమలలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఆధునికీకరణ, సుందరీకరణ, అలంకరణ, మరమ్మతులు ఊపందుకున్నాయి. ఆలయ మహద్వారం గోపురానికి రంగులు వేయడం పూర్తికావడంతో ప్రస్తుతం ప్రాకారానికి కూడా రంగులు వేస్తున్నారు. వాహనాల ఊరేగింపు సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా గ్యాలరీలు, బారికేడ్లు, ఇనుపగేట్లను అమర్చుతున్నారు. ఇప్పటికే అమర్చిన గ్యాలరీలకు పెయింటింగ్ చేస్తున్నారు. భక్తులు వేచిఉండే గ్యాలరీల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. మాడవీధుల్లోని డ్రైనేజ్‌ను కూడా శుభ్రపరుస్తున్నారు. ఆలయానికి సమీపంలో ఉన్న భవనాలను పెయింటింగ్ పనులు ఊపందుకున్నాయి. మహద్వారానికి ఇరువైపులా ఉన్న వర్టికల్ గార్డెన్‌ను పూర్తిగా తొలగించి కొత్త మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రాకారానికి శోభాయమానంగా విద్యుద్దీపాలంకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. గోడలకు సున్నం, వాహన మండపం ఆకట్టుకునేలా రంగులు, చలువ పందిరి ఏర్పాటుకు సిద్ధమయ్యారు. 20రోజుల్లో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు.
addComments
Post a Comment