నెల్లూరు, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి) : గిరిజనుల సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గం చూపడమే లక్ష్యంగా గిరిజన కాలనీల్లో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు పేర్కొన్నారు.
మూడు రోజుల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు, సభ్యులు శ్రీ వడిత్యా శంకర్ నాయక్, మురళీ, లిల్లీ, రామలక్ష్మి శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దొరతోపు, కొండాయపాలెం సమీపంలోని ఎరుకల కాలనీల్లో పర్యటించి గిరిజనులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దొరతోపు కాలనీలోని గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని, కనీసం పూరి గుడిసెలకు విద్యుత్ మీటర్లు ఇవ్వమని దరఖాస్తులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని, పాములతో సహజీవనం చేస్తున్నామని గిరిజనులు తమ గోడును చైర్మన్ కు వివరించారు. అలాగే కొండాయపాలెం ఎరుకల కాలనీ లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు పునాదుల్లోనే ఆగిపోయాయని, వెంటనే ఇళ్లు నిర్మించాలని కమిషన్ సభ్యులకు గిరిజనులు విన్నవించారు. దీంతో స్పందించిన చైర్మన్ దొరతోపు గిరిజన కాలనీలో మౌలిక వసతులు కల్పించి, ఇంటి పట్టాలు, విద్యుత్ మీటర్లు ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం బివి నగర్ లోని గిరిజన సంక్షేమ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమగ్రంగా, సంతృప్తికరంగా గిరిజన ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఎస్టి కమిషన్ ను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేశారని, ఆ మేరకు ఆదివాసీలు, గిరిజనుల ఆర్థికాభివృద్ధే ప్రధానంగా కమిటీ పనిచేస్తోందన్నారు. ఐటీడీఏలను ఏర్పాటు చేసి గిరిజనుల బలోపేతానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మూడు రోజుల పర్యటనలో గిరిజన సంఘాల ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ పర్యటనలో ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, మురళి, లిల్లీ, రామలక్ష్మి, ఐటీడీఏ పీవో శ్రీమతి మందా రాణి, డివో శ్రీనివాసులు, ఆర్డిఓ శ్రీ మలోల, హౌసింగ్ డీఈ హరగోపాల్, గిరిజన సంఘ నాయకులు శ్రీ కె.సి పెంచలయ్య, కుడుముల రామచంద్రయ్య, రాపూరు కృష్ణయ్య, చంద్రమౌళి, దశయ్య, బ్రహ్మానాయక్, ప్రభాకర్, ఇండ్ల రవి, ఏకుల లక్ష్మి, బండి యశోధర తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment