*నేతల తీరు మారాల్సిందే
*
*నాయకుల మధ్య సమన్వయం లోపించడంపై సీరియస్*
*కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్*
* చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో సరిగా పోరాటం చేయలేదని అసహనం*
*కృష్ణా జిల్లా వ్యవహారాలను స్వయంగా సమీక్షిస్తా*
*టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు*
గుంటూరు (ప్రజా అమరావతి) : కృష్ణా జిల్లా టీడీపీ నేతల పనితీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కృష్ణా జిల్లా నేతల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నటీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఆ ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. గృహ నిర్బంధాల విషయంలో కొందరు నేతల తీరుపై ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశంలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నేతలను ఉద్దేశించే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న ప్రాంతంలో చిత్తశుద్ధితో పని చేయకుండా షో మాత్రమే చేస్తున్నారని నేతల తీరుపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం విషయంలోనూ నేతల పోరాటం సరిగ్గా లేదనే విమర్శలు వెలువెత్తాయి. గుడివాడలో తెలుగు మహిళల పోరాటం చూసైనా ఇన్చార్జులు తీరు మార్చుకోవాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ, మచిలీపట్నం రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నాయకత్వ పనితీరుపైనా చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖకు చెందిన నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన దరిమిలా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కీలక భేటీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులు గైర్హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న కారణంగా కేశినేని నాని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా దేవినేని ఉమ, బొండా ఉమలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. భేటీలో భాగంగా కృష్ణా జిల్లా నేతల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన కీలక నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే ఆయన సొంత జిల్లాకు చెందిన నేతలే స్పందించకపోవడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి ఉందన్న చంద్రబాబు పరిస్థితిలో మార్పు రాకపోతే సహించేది లేదని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో నేతలంతా ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై దాడి జరిగినా పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు ఎందుకు స్పందిచలేదనని ఆయన ప్రశ్నించారు. సంఘటన జరిగితే అక్కడకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇదేనా మీరు చేసేదని మండిపడ్డారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే నేతల నుంచి ఎందుకు స్పందన లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల మధ్య సమన్వయం లోపించడంపై సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలా ఉంటే ఊరుకోబోనని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగితే కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఈ నెల 12 లేదా 13 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ సమావేశాల్లో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని నియోజకవర్గాలకు నేతలంతా కలిసి వెళ్లాలని, ఇక ముందు కృష్ణా జిల్లా వ్యవహారాలను స్వయంగా సమీక్షిస్తానని నేతలకు చంద్రబాబు చెప్పారు.
addComments
Post a Comment