అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.



*వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాన్ని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన సీఎం.* 


*ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల, పేద అమ్మాయిల వివాహాలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు.* 

*ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైయస్సార్‌ షాదీ తోఫా.*


*అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.


*


అమరావతి (ప్రజా అమరావతి);


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్ ఏమన్నారంటే...:*

దేవుడి దయ వల్ల మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాలను నిరోధించేందుకు వేస్తున్న విప్లవాత్మక అడుగు. 

ఇప్పటి వరకూ ప్రభుత్వం, పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. పిల్లలంతా కచ్చితంగా చదువుకోవాలని రకరకాల అడుగులు వేస్తున్నాం. మూడేళ్లుగా విద్యారంగంమీద అత్యధిక శ్రద్ధ పెట్టాం.

విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చాం.  పిల్లలకు చదవులన్నవి ఒక ఆస్తి. పేదరికం నుంచి పిల్లలు బయటపడే ఏకైక అస్త్రం చదువు మాత్రమే.  దాన్ని వారు పొందాలని మనసా, వాచా, కర్మేణా అడుగులు వేస్తున్నాం. 


పిల్లలను బడికి పంపిస్తున్న తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్‌తో ఒప్పందం తీసుకొచ్చాం. నాడు – నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం, వాటి నిర్వాహణకోసం టీఎంఎఫ్, ఎస్‌ఎంఫ్‌ నిధులు ఏర్పాటు చేశాం. 


పెద్ద పిల్లల చదువులకోసం విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు చేపట్టాం. కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్‌లైన్‌ వర్టికల్స్, జాబ్‌ ఓరియెంటెడ్‌గా పాఠ్యప్రణాలికలు తీసుకు వచ్చాం. 

అలాంటి మరొక గొప్ప అడుగే ఇవాళ మనం ప్రారంభిస్తున్న వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకం.  

పిల్లలను ప్రోత్సహిస్తూ.. వారు చదువుకునేట్టుగా తల్లిదండ్రులు, ఆ పిల్లలను ఆ దిశగా అడుగులు వేయించాలనే తపన, తాపత్రయంతో ఈ రెండు పథకాలు ప్రారంభిస్తున్నాం. 

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీతోఫాలు... పెళ్లి చేసుకుంటున్న ఇద్దరు పిల్లలు కూడా కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకు వస్తున్నాం. దీనివల్ల కచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పదోతరగతి చదివించే కార్యక్రమం జరుగుతుంది. 


పెళ్లినాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇది రెండో నిబంధన. 

దీనివల్ల పిల్లలంతా చదువుకునే పరిస్థితి వస్తుంది. టెన్త్‌ పాసైతే... ఆతర్వాత 18 ఏళ్ల వరకూ పెళ్లిచేసుకోలేరు కాబట్టి,  ఇంటర్మీడియట్‌కూడా చదువుకునే అవకాశం వస్తుంది. ఈ రకంగా మార్పులు తీసుకుని రావడంతో పిల్లలు చదివే పరిస్ధితి వస్తుంది. దాంతో గొప్ప మార్పు ఏర్పడుతుంది. 


ఈ జనరేషన్‌ కోసమే కాదు, తలిదండ్రులు కూడా చదువుకుని ఉంటే.. వారికి పుట్టే పిల్లలకూ చదువుల విలువ చెప్పే పరిస్థితి ఉంటుంది. దూరదృష్టితో, ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణకార్మికులకు మంచి జరిగే పరిస్థితి అవకాశం ఉంటుంది. 

వైయస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా మంచి జరుగుతుంది. ముస్లింమైనార్టీలకు వైయస్సార్‌షాదీ తోఫా ద్వారా మంచి జరిగే పరిస్థితి ఉంటుంది.


*గత ప్రభుత్వానికీ- ఇప్పటికీ తేడా...*

గత ప్రభుత్వంలో కూడా వారు పెళ్లికానుక అని పథకాన్ని ప్రకటించారు. 2018లో దాన్ని ఆపేశారు. అప్పట్లో ఎవ్వరూ కూడా పిల్లలు చదవాలని తాపత్రయపడి పెట్టిన పథకం కాదు. 

ఎన్నికలకు ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో పెట్టారు.

తర్వాత పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 17,709 మంది లబ్ధిదారులకు  రూ. 68.68కోట్లు వివాహ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 


అందుకు భిన్నంగా ఇప్పుడు మనందరి ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా ఈ పథకం వర్తించేలా అన్ని చర్యలూ చర్యలు తీసుకుంది.  వివక్షకు, లంచాలకు తావులేకుండా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈపథకం అమల్లో కీలక పాత్ర పోషిస్తుంది.


గత ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా.. ఇప్పుడు దాదాపుగా రెట్టింపు ప్రొత్సాహకం ఈ పథకం ద్వారా అందబోతోంది. గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలకు రూ50వేలు ఇస్తామని ప్రకటిస్తే.. ఇప్పుడు మనం రూ.1 లక్ష  ఇవ్వనున్నాం.

ఎస్సీ, ఎస్టీల్లో కులాంత వివాహాలకు గత ప్రభుత్వంలో రూ.75వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు మనం రూ.1.20 లక్షలు ఇవ్వనున్నాం. 

గతంలో బీసీలకు రూ.30వేలు ఇస్తామని ప్రకటిస్తే. ఇప్పుడు మనం రూ.50వేలు ఇవ్వనున్నాం. బీసీల కులాంతర వివాహాలకు రూ.50వేలు వాళ్లు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.75వేలు ఇవ్వనున్నాం. 

మైనార్టీలకు గత ప్రభుత్వం రూ. 50వేలు ప్రకటిస్తే.. మనం రూ.1లక్ష ఇవ్వనున్నాం. 

విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం రూ.1 లక్ష ఇస్తే, ఇప్పుడు రూ.1,50,000లు ఇవ్వనున్నాం. 

భవన, ఇతర నిర్మాణకార్మికులకు రూ.20వేలు గత ప్రభుత్వం ప్రకటిస్తే..  ఇప్పుడు రూ.40వేలు ఇవ్వనున్నాం.  ఇది గొప్ప ప్రోత్సాహకం, గొప్ప మార్పు. 


ఇవన్నీకూడా చదువులతో కనెక్ట్‌ అయిన పథకాలు.  ఎందుకు ఇలా చేస్తున్నామంటే... అమ్మ ఒడిద్వారా చదువుల బాట పట్టే పిల్లలు ఎక్కడా కూడా డ్రాప్‌ అవుట్స్‌గా మిగిలిపోకూడదని అమలు చేస్తున్నాం. వారు పదోతరగతి పాస్‌ అయ్యే విధంగా అడుగులు వేయించాలనే తపన, తాపత్రయంతో ప్రోత్సహాకాలు ఈ స్ధాయిలో ఇస్తున్నాం. 


*అక్టోబరు 1 నుంచి అమలు...*

ఈ పథకం  అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది.

పెళ్లైన 60 రోజుల్లో వారి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.  


అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నాం. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు జనవరిలో ఇవ్వబడుతుంది.

జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉన్న లబ్ధిదారులకు  ఏప్రిల్‌లోనూ, ఏప్రిల్, మే, జూన్‌లో ఉన్నవారికి జులైలో ఇవ్వడం జరుతుంది.

జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో లబ్ధిదారులకు అక్టోబరులో పథకాలను అందిస్తాం. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి అర్హులకు వెరిఫికేషన్‌ పూర్తి చేసి వారికి ప్రోత్సాహకాలు అందిస్తాం.

దేవుడి దయతో ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను కూడా సచివాలయాల్లో జారీచేసేలా చేయాలని చెబుతూ... సీఎం ప్రసంగం ముగించారు. 



ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్‌ అజయ్ జైన్‌, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ ఎస్ ఎస్‌ ‌మోహన్‌  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments