నెల్లూరు, సెప్టెంబర్ 7 (ప్రజా అమరావతి): గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని
ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు పేర్కొన్నారు.
గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మూడు రోజుల జిల్లా పర్యటనకు బుధవారం ఉదయం విచ్చేసిన ఎస్టి కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, మురళీకి కావలిలో గిరిజన సంఘాల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కావలి మండలం మన్నంగిదిన్నె గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాల లబ్ధిని సమగ్రంగా గిరిజనులకు అందించేందుకు అధికారులు మానవతా దృక్పథం కలిగి, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గిరిజన కాలనీల్లో పర్యటించి ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రాలు లేనివారిని గుర్తించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు మంజూరు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమగ్రంగా అందించాలన్నారు. గిరిజనుల భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో గిరిజనులకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఈ సందర్భంగా కావలి ఆర్డిఓ శ్రీ శీనా నాయక్ మాట్లాడుతూ ఇంటి స్థలం లేని గిరిజనులు సమీప సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డు లేని వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందిస్తున్నట్లు కమిషన్ సభ్యులకు వివరించారు.
తొలుత మన్నంగిదిన్నె గ్రామంలో గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఐటీడీఏ పీవో శ్రీమతి మందా రాణి కమిషన్ సభ్యులకు వివరించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చైర్మన్ కు గిరిజనులు వినతిపత్రాలు అందించారు.
మన్నంగిదిన్నె గిరిజనుల భూ సమస్య పరిష్కారానికి కృషి
................................................ కావలి మండలం మన్నంగిదిన్నె గ్రామంలో గిరిజనులకు గతంలో పట్టాలు ఇచ్చిన 92 ఎకరాల అటవీ భూముల్లోకి గిరిజనులను రానివ్వకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ కుంభా రవిబాబు గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ భూములకు సంబంధించిన వివరాలను జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ మహబూబ్ బాషా కమిషన్ సభ్యులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మందా రాణి, డిఎఫ్ఓ శ్రీ మహబూబ్ బాషా, ఐటిడిఎ డిఓ శ్రీనివాసులు, ఐసీడీఎస్ పీడీ ఉమామహేశ్వరి, కావలి ఆర్డిఓ శీనానాయక్, హౌసింగ్ ఈఈ శ్రీ పి వి ఎస్ శర్మ, సబ్ డిఎఫ్ఓ శ్రీ రాజశేఖర్ బాబు, సర్పంచ్ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ ధనలక్ష్మి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీ కె.సి పెంచలయ్య, గిరిజన సంఘం నాయకులు కుడుముల రామచంద్రయ్య, రాపూరు కృష్ణయ్య, చెంబేటి ఉష, ఇండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment