బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలి

 *బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలి


*


*: అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం సక్రమంగా ఉండాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 17 (ప్రజా అమరావతి):


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న వివిధ రకాల పథకాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు త్వరితగతిన చేరుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు, పంపిణీని బ్యాంకర్లు వేగవంతంగా చేపట్టాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు వెంటనే పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం ముద్ర యోజన కింద రుణాలు, వీవర్స్ కు, పశుసంవర్ధక మరియు మత్స్య రైతులకు రుణాలు అందించడంలో మరింత పురోగతి చూపించాలన్నారు. జగనన్న తోడు పథకం కింద డిఆర్డిఏ, మెప్మా పరిధిలో చిరు వ్యాపారులకు అందించే రుణాల లక్ష్యం చేరుకోలేదని, వెంటనే అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి పంపిణీ చేసేలా చూడాలన్నారు. జగనన్న తోడు, టిడ్కో, హౌసింగ్ కి సంబంధించి రుణాల మంజూరు చాలా పెండింగ్ ఉందని, వెంటనే కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం సక్రమంగా ఉండాలన్నారు. రుణాల మంజూరులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేలా కృషి చేయాలని, కేటాయించిన లక్ష్యాలను పూర్తిగా 100 శాతం చేరుకోవాలన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మరిన్ని రుణాలు అందించి జిల్లాకు మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. పరిశ్రమలలో ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉందని, అందుకు తగిన విధంగా నైపుణ్యం పెరిగేలా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.


2022 - 23 కు సంబంధించి 8,133.70 కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వార్షిక ప్రణాళికను జిల్లా కలెక్టర్, ఎల్డిఎం లు, తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాడిమర్రి వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి సహాయార్థం బ్యాంకర్ల తరఫున ఒక లక్ష రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరిగింది.


ఈ సమావేశంలో పుట్టపర్తి ఎల్డిఎం సాయినాథ్ రెడ్డి, అనంతపురం ఎల్డిఎం నాగరాజా రెడ్డి, ఆర్.బి ఏజిఎం అనిల్ కుమార్, కెనరా బ్యాంక్ ఆర్.ఎం.లారెన్స్, ఎపిజిపి ఆర్ఎం రవీంద్రనాథ్ రెడ్డి, యుబిఐ ఆర్ఎం అశ్వత్థ నాయక్, ఏడిసిసి బ్యాంక్ జిఎం సురేఖ రాణి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ గోపికృష్ణ నాయక్, వ్యవసాయ శాఖ జేడి సుబ్బారావు, డిఆర్డిఏ పిడి నర్సయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, సెరికల్చర్ జేడీ పదమ్మ, డీఐసీ జనరల్ మేనేజర్ చంద్రబాబు, హౌసింగ్ పీడీ నాగరాజు, డిహెచ్టిఓ రమేష్, వికలాంగుల శాఖ ఏ.డి. అబ్దుల్ రసూల్, డిఐసిసిఐ కెవి రమణ, వివిధ శాఖ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments