పరస్పర పొగడ్తలతోనే ముగిసిన కౌన్సిల్ సమావేశం

 ___ పరస్పర పొగడ్తలతోనే ముగిసిన కౌన్సిల్ సమావేశం


___ పలు అంశాలు ఆమోదం 

___ గడువు ముగిసిన 2017- 22  పాలకవర్గం

  కాకినాడ, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి): కాకినాడ నగరపాలక సంస్థ సమావేశం పరస్పర పొగడ్తలతోనూ చలోక్తులతోనూ ముగిసింది. సుమారు 32 అంశాలను అతి తక్కువ చర్చతో ఆమోదింప చేశారు. అలాగే ఈ సమావేశం పూర్తి పరస్పర పొగడ్తలతోను జరిగింది. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా వ్యవహరిస్తున్న మీసాల ఉదయకుమార్, చోడిపల్లి ప్రసాదులు కొంతసేపు పాలకవర్గ సమావేశానికి అధ్యక్ష స్థానంలో వ్యవహరించారు. వారికి కూడా మేయర్ అయ్యాననే ఆనందాన్ని వెలుబుచ్చుకున్నారు. అనంతరం నగర మేయర్ సుంకర శివ ప్రసన్న తాను అనుకోని కారణాల వల్ల సమావేశానికి రావడం ఆలస్యం అయిందని సభను నిర్వహించిన ఉదయకుమార్, ప్రసాదులకు ధన్యవాదాలు చెబుతూ సభను కొనసాగించారు.

   కాకినాడ నగరపాలక సంస్థ సమావేశం శుక్రవారం సినిమా రోడ్లో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన గతాన్ని వదులుకొని ప్రజాస్వామ్యంలో నిమగ్నమవ్వాలని కార్పొరేటర్లకు సూచించారు. ఇకనుండి పదవీకాలం ముగిసిందని కార్పోరేటర్లు బాధపడాల్సిన అవసరం లేదని ఆయా డివిజన్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అందరూ ఇక నుండి సోదర భావంతోనే కలిసి మెలగాలని వారు సూచించారు. ఈ ఐదేళ్ల కాలంలో కాకినాడ నగరానికి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయని వాటిని పదిలంగా ఉంచుకోవాలని వారు సూచించారు. అనంతరం నగర మేయర్ శివ ప్రసన్నను ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి శాలువతో సన్మానించారు. చివరి 11 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అలాగే సాటి కార్పొరేట్లకు ఎంతో గౌరవం విలువ అందించినట్లు మేయర్ సుంకర శివప్రసన్న తెలిపారు. అలాగే కాకినాడ నగర అభివృద్ధిని అన్ని డివిజన్లకు చెందిన కార్పొరేటర్లతో కలిసి అభివృద్ధి పథంలో నడిపించిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు. తనకు సహచర కార్పొరేటర్ల్తో పాటు నగరపాలక అధికారులు ఎంతగానో సహకరించారని అందుకనే చివరి 11 నెలల కాలం పనిచేసినా తనకు ఎంతో సంతృప్తినిచ్చినట్లుగా మేయర్ తెలిపారు. 

   ఈ సమావేశంలో కార్పొరేటర్లు వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు తమ తీపి గుర్తుగా అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు.

Comments