*1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్ కు ఏం సంబంధం?*
*ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు?*
*హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే*
*ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదు...కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుంది.*
*టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*
అమరావతి (ప్రజా అమరావతి); 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనం. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని నీ తండ్రి వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతుంది. వర్సిటీ కి చెందిన 450 కోట్ల నిధులు సైతం బలవంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం....ఏ హక్కుతో పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి...వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు.....వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సిఎం జగన్ తెలుసుకోవాలి. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలి.
addComments
Post a Comment