రజక వృత్తిదారులకు రక్షణ చట్ట అమలు చేయాలని ధర్నా
కాకినాడ, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రజకులపై దాడులు జరుగుతున్నాయని అందువల్ల రాష్ట్రంలో రజకుల కోసం ప్రత్యేకమైన రక్షణ చట్టం అమలు చేయాలని, అలాగే 50 ఏళ్లు దాటిన వృత్తిదారులకు పింఛను సదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద జోరు వర్షంలో ధర్నా నిర్వహించారు.
శుక్రవారం ధర్నా వద్ద సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు మాట్లాడుతూ చెరువులపై పూర్తి హక్కులు కల్పించాలని అలాగే ఆయా జిల్లాల్లో సంక్షేమ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుచోట్ల రజకులపై పెత్తందార్ల దోపిడీ అరాచకాలు, రజక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రజకులకు భద్రత కొరవడిన నేపథ్యంలో చిన్నచిన్న పనులు చేసుకుని అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఎదుర్కొంటున్న రజకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోనేటి రాజు డిమాండ్ చేశారు. అంతకుముందు అమరవీరులు చిట్యాల ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణల చిత్రపటాలకు వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కొజ్జవరపు నాగేశ్వరరావు, కె మాణిక్యం, పాలెపు రాంబాబు, కొడమంచిలి అప్పన్న, నూకరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment