ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

 

 

 *- ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి


 *- ఎన్టీఆర్ గెల్చిన తర్వాత గుడివాడకు ప్రపంచస్థాయి ఖ్యాతి*

 *- ఇప్పుడు గుడివాడ పేరు చెప్పుకోవాలంటే సిగ్గు పడుతున్నారు* 

 *- చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు ప్రజల అనూహ్య స్పందన* 

 *- వైసీపీకి 2024 లో అధికారం చేజారిపోతుందన్న భయం* 

 *- ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు* 

 *- గుడివాడలో గెలిచి బాబుకు కానుకగా ఇచ్చే రోజులు దగ్గర్లోనే* 



గుడివాడ, ఆగస్టు 25 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జి అన్నారు. ఆదివారం స్థానిక భాస్కర్ థియేటర్లోని కార్యాలయంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి పిన్నమనేని బాబ్జి విలేఖర్లతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, తెలుగు మహిళలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మహిళలు ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారన్నారు. మూడేళ్ళు మంత్రిగా, ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కన్పించడంలేదని తెలుగు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఇంటికి వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులను పంపి తెలుగు మహిళలను బలవంతంగా పోలీస్ స్టేషను తరలించి అరెస్టు చేసి, కేసులు పెట్టారన్నారు. ప్రతికా సమావేశాల్లో కూడా ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి మాత్రమే ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారని, వీరికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో అధికారం ఎక్కడ చేజారిపోతుందోనన్న భయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందన్నారు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని చెప్పుకుంటూ ఆయన కుటుంబ సభ్యులను కించపర్చే విధంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని మాటలను ఎవరూ హర్షించరని చెప్పారు. సభ్యసమాజం కూడా తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కొడాలి నాని మాటల గురించే గుడివాడ నియోజకవర్గంలోని మహిళలంతా చర్చించుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ గెల్చిన తర్వాత గుడివాడకు ప్రపంచస్థాయి ఖ్యాతి లభించిందన్నారు. అలాంటి గుడివాడ పేరు చెప్పుకోవాలంటే సిగ్గు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. లోకేష్ పర్యటనలకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. దీంతో పరామర్శలను కూడా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని అన్నివర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అభివృద్ధి చేయలేకపోయానని చెబుతూ వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని అధికారంలోకి వచ్చి మూడన్నరేళ్లు గడిచాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కన్పించడం లేదన్నారు. ఈ పరిస్థితులను కప్పిపుచ్చుకునేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కించపర్చేలా మాట్లాడడం సరికాదన్నారు. గతంలో భువనేశ్వరిపై నోరుజారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ తర్వాత క్షమాపణలు కోరారని గుర్తుచేశారు. ఎవరి ఆనందం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కొడాలి నాని కించపర్చారో తెలియదు గాని అవి సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కొడాలి నానికి మతిభ్రమించిందా అని మహిళలు భావిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కొడాలి నాని వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, గుడివాడ నియోజకవర్గంలో మార్పు కన్పిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు నేర్పిన సంస్కారం మాకు ఉందని తెలిపారు. గుడివాడను గెల్చుకుని చంద్రబాబుకు కానుకగా ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పిన్నమనేని బాబ్జి అన్నారు.

Comments