*శత శాతం తెలుగు అమలు చేయాలి
*
*అమ్మ భాషను గౌరవించాలి
పార్వతీపురం, సెప్టెంబర్ 15 (ప్రజా అమరావతి): శత శాతం తెలుగు అమలు చేయాలని, అమ్మ భాషను గౌరవించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. అందరూ తెలుగు భాషతో మమేకం కావాలని ఆయన కోరారు. అధికార భాషా సంఘం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు భాష అమలును గురు వారం సమీక్షించింది. సంఘం అధ్యక్షులు లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ మాతృ భూమి, మాతృ భాష, అమ్మ పవిత్రమైన పదాలు అన్నారు. వివిధ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు కాకుండా ఇతర భాషలలో రాయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తెలుగుకు ప్రాచీన భాషా హోదా డా.వై.యస్.ఆర్ హయాంలో వచ్చిందని ఆయన తెలిపారు. ఏదైనా సంస్థ యజమాని తన సంస్థ పేరును తెలిపే నామ ఫలకాన్ని తెలుగులో ప్రదర్శించక పోతే ఆ యజమానికి రూ.50 వేల వరకు జరిమానాకు శిక్షార్హుడన్నారు. యజమాని రెండు సార్లు అదే నేరానికి పాల్పడితే జరిమానాతో పాటు మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష విధించవచ్చని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవ సమయాలలో బాధ్యులైన ప్రభుత్వ శాఖాధిపతి లేదా సంస్థాధిపతి తెలుగులో శిలాఫలకాల తయారు చేయాలని, విఫలమైతే రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చని ఆయన వివరించారు. ఇతర శాఖలతో గాని, ప్రజలతో గాని తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని శాఖాధిపతి లేదా సంస్థాధిపతికి రూ.5 వేల వరకు జరిమానా విధించవచ్చని ఆయన చెప్పారు. అధికార భాషగా తెలుగు అమలును సమీక్షించని శాఖాధిపతికి రూ.5 వేల వరకు జరిమానా విధించ వచ్చని ఆయన చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో జరిపే కార్యకలాపాలలో తెలుగు భాషను ఉపయోగించక పోతే రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చని, తెలుగును పాఠ్యాంశంగా గాని, బోధనా మాధ్యమంగా గాని అమలు చేయని ఏదైనా విద్యా సంస్థాధిపతికి రూ.50 వేలు లేదా 6 నెలలకు మించకుండా జైలు శిక్షను విధించవచ్చని ఆయన చెప్పారు. చట్టాన్ని అమలు చేయడంలో విశేషమైన అధికారాలు భాషా సంఘంకు ఉందని ఆయన తెలిపారు. ఉత్తర్వులు ఆరు నెలల్లో అమలు చేయాలని ఆయన సూచించారు. అధికార భాషను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి అధికారులు ఉత్తమ మార్గమని ఆయన అన్నారు. తమ స్థాయిలో మాతృ భాష అమలులో కృషి చేసి చరిత్రలో నిలవాలని ఆయన సూచించారు. తెలుగును ఆదరించిన రాజులు చరిత్రలో నిలిచారని ఆయన చెప్పారు. తెలుగు అధికార భాషను అమలులో విప్లవాత్మకమైన చర్యలను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని దుకాణాల్లో నామ ఫలకాలు తెలుగులో ఉండే విధంగా కార్మిక శాఖ, జి.ఎస్.టి శాఖలు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. నెల రోజుల్లో అమలు జరగాలని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర అని గురజాడ, గిడుగు రామమూర్తి ఉత్తరాంధ్ర ప్రాంతం వారని ఆయన గుర్తు చేస్తూ అధికార భాషను అమలులో ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయ గౌరీ, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా రవాణా అధికారి ఎం.శశి కుమార్, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, జిల్లా సహకార అధికారి సన్యాసి నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, కళాశాలల నోడల్ అధికారి డా.చిరంజీవి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.డి.గయాజుద్దీన్, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా మత్స్య శాఖ అధికారి వి.తిరుపతయ్య, జిల్లా ఔషద నియంత్రణ అధికారి ఏ.లావణ్య, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీరామమూర్తి, అధికార భాషా సంఘం కార్యదర్శి రామ్ గోపాల్, ప్రాజెక్టు అధికారి డా. సి.సత్యలత, డా.వి. సరోజిని తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment