పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలి



- 'పరిశ్రమలు-భద్రతా ప్రమాణాల'పై స్టేట్ మానిటరింగ్ కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మునూరు జయరాం, గుడివాడ అమర్ నాధ్

- రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పరిశ్రమల భద్రతపై కమిటీలు

- మూడు నెలల్లో ఇండస్ట్రీయల్ సేఫ్టీపై స్పెషల్ డ్రైవ్

- రాష్ట్రానికి భారీగా వస్తున్న కొత్త పరిశ్రమలు

- పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలి


- భద్రతా ప్రమాణాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలి

- రెడ్ కేటగిరి పరిశ్రమల విషయంలో మరింత అప్రమత్త

- జనావాసాలకు దూరంగా రెడ్ కేటగిరి పరిశ్రమలు ఉండాలి

- ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం కాదు... అసలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి


మంత్రుల కమిటీ ఆదేశాలు


అమరావతి (ప్రజా అమరావతి):


 పరిశ్రమలు-భద్రతా ప్రమాణాలపై సచివాలయంలోని 5వ బ్లాక్ లో బుధవారం స్టేట్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి శ్రీ గుమ్మునూరు జయరాం, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్ నాధ్ లు రాష్ట్రంలో ఇండస్ట్రీయల్ సేఫ్టీ పై అధికారులతో సమీక్షించారు. కాలుష్య నియంత్రణ మండలి, కార్మికశాఖ, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు ప్రభుత్వం  అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ప్రత్యేకంగా ఇండస్ట్రీయల్ సేఫ్టీపై నిర్ధిష్టమైన ఆదేశాలు ఇచ్చారని, దానిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ విభాగాలు, జిల్లా కలెక్టర్ లపై ఉందని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు చైర్మన్ గా ఆయా శాఖల అధికారులతో కూడిన కమిటీలను నియమించడం జరిగిందని అన్నారు. ఈ కమిటీలు నిర్ధిష్ట కాలపరిధిలో అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించాలని కోరారు. 


ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు తోడు రాష్ట్రంలో కొత్తగా పెద్దసంఖ్యలో పరిశ్రమలు రాబోతున్నాయని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా ఏర్పడుతున్న ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమార్స్ లో జరిగిన ప్రమాదంను ఒక హెచ్చరికగా తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టంగా సేఫ్టీ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కోరారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ మూడు నెలల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాల తనిఖీలు పూర్తి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. రెడ్ కేటగిరి పరిశ్రమలకు సమీపంలో జనావాసాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో స్థాపించిన పరిశ్రమల చుట్టూ అర్బనైజేషన్ పెరిగితే ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు. 


 సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి చైర్మన్ ఎకె ఫరిడా, మెంబర్ సెక్రటరీ విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్ తదితరులు పాల్గొన్నారు.

Comments