నెల్లూరు, సెప్టెంబర్ 10 (ప్రజా అమరావతి): గిరిజన కాలనీల్లో దేవాలయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పం
తో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఉదయం తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామ పంచాయతీ మందబయలు ఎస్టీ కాలనీలో టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని గిరిజన కాలనీల్లో నూతన దేవాలయాలను నిర్మించడం, శిధిలమైన ఆలయాలను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా టిటిడి ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని, ఇప్పటికే జిల్లాలో 60 ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా ఒక్కొక్క ఆలయానికి నెలకు ఐదు వేల రూపాయలను ఇస్తుండగా, మరో 110 ఆలయాలను ఈ పథకం కింద గుర్తించామని, మొత్తం జిల్లాలో 170 ఆలయాలకు దూప దీప నైవేద్యానికి రూ. 5,000 నుంచి రూ 10,000 పెంచి ప్రతి నెలా ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1342 ఆలయాలను ఎంపిక చేయగా 111 ఆలయాలను మొదటి విడతగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంలో గిరిజన కాలనీలను గుర్తించి దేవాలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆలయాలు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి సీఎం అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సంక్రాంతి లోపు మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు.
గడపగడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం
.............. ....................................
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించినప్పుడు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఇటీవల మల్లికార్జున పురంలో పర్యటించినప్పుడు ఎస్టీ కాలనీలో దేవాలయం కావాలని గిరిజనల కోరగా, టీటీడీ సహకారంతో ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టినట్లు చెప్పారు. అలాగే కోనేటి మిట్ట అరుగు నిర్మాణానికి, డ్రైన్లు నిర్మాణానికి రూ 10 లక్షలు, బీసీ కాలనీ, చెంచు లక్ష్మమ్మ గుడి సిసి రోడ్ల నిర్మాణానికి రూ 10 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. జగనన్న లేఅవుట్ లో ఇళ్ల స్థలాల లెవలింగ్ కు ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్లు అందించినట్లు చెప్పారు. మల్లికార్జునపురంలో తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి వివరించారు.
అనంతరం నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు ధ్రువీకరణపత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ కోట సునీల్ కుమార్ స్వామి, కొత్తూరు లలిత ఆశ్రమం పీఠాధిపతి శ్రీ రామాయణం మహేష్ స్వామి, ఎంపీడీవో శ్రీమతి హేమలత, తాసిల్దార్ శ్యామలమ్మ, సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
addComments
Post a Comment