*జిల్లా అధికారులు గ్రామాల్లోకి వెళ్లాలి
*
*ప్రభుత్వ పథకాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి*
*ఫ్రైడే డ్రైడే అమలులో చిత్తశుద్ధి అవసరం*
*వెంటనే ఫీవర్ సర్వే తాజాగా చేపట్టాలి*
*15 రోజుల్లోగా సర్వే పూర్తవ్వాలి*
*రోజు వారీ వివరాలు నాకు రావాలి*
*క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులపై చర్యలు*
*ప్రజాప్రతినిధుల వినతలపై తక్షణమే స్పందించండి*
*నిర్మాణం పూర్తయిన యూపీహెచ్‌సీలను వెంటనే స్వాధీనం చేసుకోండి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని*
జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సీజనల్ వ్యాధులపై మంగళగిరి లోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి విడదల రజిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని గమనిస్తూ.. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధి నిర్థారణ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఏది కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేల కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖ కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అన్ని విషజ్వరాలను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందేలా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యాతోపాటు కలరా, డయేరియా లాంటి రోగాల నివారణకు కావాల్సిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రిలో సరిపడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాల్లో డీఎం అండ్ హెచ్‌వోలు, డీసీ హెచ్ ఎస్‌లు తప్పినిసరిగా గ్రామాలు, పట్టణాలకు వెళ్లాలని, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పారు. దీనివల్ల పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, డీహెచ్‌లు, ఏహెచ్‌లలో వైద్య సేవలు మెరుగు అవుతాయని తెలిపారు. పర్యటనలను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండండి..
జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై తక్షణమే స్పందించాలని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ విషయంలో స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని మరింత చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. వెంటనే ఫీవర్ సర్వేను తాజాగా చేపట్టాలని, 15 రోజుల్లోగా ఇది పూర్తికావాలని ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించి ఏ రోజు వివరాలు ఆ రోజు తనకు నేరుగా పంపాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన యూపీహెచ్ సీలను డీఎంఅండ్ హెచ్‌వోలు వెంటనే స్వాధీన పరుచుకోవాలని సూచించారు. ఐఆర్ ఎస్ (ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే) విషయంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, వెంటనే ఐఆ ర్ ఎస్ ను వేగవంతం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఆరోగ్య , కుటుంబ సంక్షేమం కమిషనర్, ఎన్ హెచ్ ఎం ఎండీ నివాస్, డీఎంఈ రాఘవేంద్రరావు, డీహెచ్ డాక్టర్ వి.రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment