అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది



 *- అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది* 


 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 

 *- గుడివాడ పట్టణంలో టీమ్ శిష్ట్లా లోహిత్ సంఘీభావం* 



 గుడివాడ, సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి): అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 2.0 దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అభిప్రాయపడ్డారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి నుండి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహా పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలో రెండవ రోజు కూడా కొనసాగింది. శుక్రవారం ఉదయం గుడ్లవల్లేరు మండలం కవుతరం గ్రామం నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. యాత్రకు అడుగడుగునా ఆయా గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్నానికి అంగలూరు గ్రామం మీదుగా బొమ్ములూరు గ్రామానికి చేరుకుంది. లారీ స్టాండ్ లో భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం యాత్ర గుడివాడ పట్టణంలోకి ప్రవేశించింది. పెదకాల్వ సెంటర్లో అమరావతి రైతులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం సభ్యులు పసుపు టీషర్ట్ లతో అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రలో నడిచారు. భీమవరం రైల్వేగేటు మీదుగా కోతిబొమ్మ సెంటర్, బస్టాండ్ సెంటర్, వాసవీచౌక్ సెంటర్, పార్క్ రోడ్డు, మార్కెట్ సెంటర్, మెయిన్ రోడ్డు, నెహ్రూచౌక్ సెంటర్, ఏలూరు రోడ్డు, నాగవరప్పాడు మీదుగా వీకేఆర్, వీఎన్బీ కళాశాలకు యాత్ర చేరుకుంది. వేలాది మంది రైతులు పట్టణ వీధుల్లో జై అమరావతి నినాదాలతో కదం తొక్కారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రజలందరి ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకు వెళ్తుందన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా సూచించిందన్నారు. అయినప్పటికీ మూడు రాజధానుల నిర్ణయానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచేలా అమరావతి రైతులు అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు జరిగే మహా పాదయాత్రలో టీమ్ శిష్ట్లా లోహిత్ బృందం సంఘీభావం తెలుపుతుందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి చేయాలని శిష్టా లోహిత్ విజ్ఞప్తి చేశారు.

Comments