అమరావతి రైతుల పాదయాత్రకు ముహూర్తం ఖరారు

 *అమరావతి రైతుల పాదయాత్రకు ముహూర్తం ఖరారు*


*ఈ నెల 12న వేకువజామున 5 గంటలకు ప్రారంభం*


*వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు* 


*ఉదయం 9 గంటలకు రథానికి జెండా ఊపి యాత్ర ప్రారంభం*


తొలి రోజు వెంకటపాలెం నుంచి మంగళగిరికి చేరుకోనున్న యాత్ర.


అమరావతి (ప్రజా అమరావతి) : మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఉత్సాహంగా ఉన్న అమరావతి రైతులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా ఈ నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని రైతులు నిర్ణయించారు. శాంతిభద్రతల కారణాలతో అనుమతి ఇచ్చేందుకు డీజీపీ నిరాకరించడంతో పాదయాత్ర డైలమాలో పడింది. అయితే, ఆ తర్వాత హైకోర్టు అనుమతినివ్వడంతో ఉత్సాహంగా ఉన్న రైతులు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం సిద్ధం చేశారు.ఈ నెల 12న వేకువ జామున 5 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ముందుగా వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానికి జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆహ్వానించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులను ఆహ్వానించారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. యాత్ర తొలి రోజు వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేవారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.

Comments