*ధర్మాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవు : చంద్రబాబు నాయుడు
*
అమరావతి, (ప్రజా అమరావతి) : ధర్మాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవని, ఆ త్యాగాలే అమరావతి రైతులు చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి సంకల్పం వృధాగా పోదన్న ఆయన ఆ సంకల్పమే ధర్మాన్ని గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. కందుల రమేశ్ రచించిన ‘అమరావతి వివాదాలు- వాస్తవాలు’ అనే పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదికపై ఉన్నా అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలన్నది అందరి ఆకాంక్షగా ఉందన్నారు. 5కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి ధీటుగా విశాఖ, కర్నూలు, తిరుపతి కూడా అభివృద్ధి చెందాలన్నదే తెదేపా సిద్ధాంతమని చెప్పారు. ఆనాడు ఏ ఒక్క కులం కోసమో హైదరాబాద్‌ని అభివృద్ధి చేయలేదన్న చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి జరిగాక ప్రజలు బాగుపడ్డారా లేక ఏదైనా ఒక కులం బాగుపడిందా? అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ, వ్యక్తీ శాశ్వతం కాదని, మనం చేసే మంచి పనులే శాశ్వతమని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు ఏం చేసినా అది సమాజంపై ప్రభావం చూపుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి నిలిపివేయాలనే ఆలోచన ఏనాడు రాజశేఖర్ రెడ్డికి రాలేదని ఆ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణే చెప్పారన్నారు. అందరి సహకారంతోనే హైదరాబాద్ మహా నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆనాడు తాను హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాను కాబట్టే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించేవాళ్లూ ఉన్నారని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.*
*హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల అభివృద్ధికి తాను కృషిచేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన అనుభవం చూసే 2014లో ప్రజలు తమ పార్టీకి ఓట్లేసి గెలిపించారన్నారు. అధికార వికేంద్రీకరణ కోసమే అమరావతిని రాజధానిగా ఎంపికచేసుకున్నట్టు తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వివరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగాపాల్గొనగా కన్నా లక్ష్మీనారాయణ (బీజేపీ), రామకృష్ణ (సీపీఐ), తులసిరెడ్డి (కాంగ్రెస్) శ్రీనివాస్‌యాదవ్ (జనసేన), పెద్ద ఎత్తున అమరావతి రైతులు పాల్గొన్నారు.
addComments
Post a Comment