ఇంజనీర్లే నవ సమాజ నిర్మాతలు
జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
భారతరత్న మోక్షగుండం విశ్వేశయ్యకు ఘన నివాళి
విజయనగరం, సెప్టెంబరు 15 పజా అమరావతి) ః
ఇంజనీర్లే నేటి నవ సమాజ నిర్మాతలని, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వారి కృషి ఫలితంగానే, ప్రస్తుతం మనమంతా సంతోషంగా, సౌకర్య వంతంగా జీవిస్తున్నామని చెప్పారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా, ఇంజనీర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్దనున్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి పలువురు ఇంజనీరింగ్ అధికారులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో, ఇంజనీర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని, జెడ్‌పి ఛైర్మన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన అంకితభావం, దూరదృష్టి నేటి ఇంజనీర్లకు ఆదర్శమన్నారు. విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని, ఇంజనీర్లు సమాజ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇంజనీరు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదని, ఆయనపై ఎన్నో రకాల బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ఇంజనీర్లకు సేవా తత్పరత అవసరమని స్పష్టం చేశారు. తమ అనుభవాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని ఇంజనీర్లకు ఛైర్మన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో పిఆర్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ బి.ఉమాశంకర్, ఆర్ అండ్ బి ఎస్ఇ వికె విజయశ్రీ, ట్రాన్స్‌కో ఎస్ఇ బి.కోటేశ్వర్రావు, జెడ్‌పి డిప్యుటీ సిఇఓ రాజ్‌కుమార్, పలువురు ఇఇలు, డిఇలు, ఏఈలు, ఇంజనీర్స్ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment