పేదలకు ఆహార భధ్రత కల్పనలో చురుకుగా పనిచేస్తున్న రాష్ట్ర ఆహార కమిషన్..

 



విజయవాడ (ప్రజా అమరావతి);


*పేదలకు ఆహార భధ్రత కల్పనలో చురుకుగా పనిచేస్తున్న రాష్ట్ర ఆహార కమిషన్..*


*ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం*.

*జాతీయ ఆహార భద్రత చట్టం-2013 పరిధిలోని సంక్షేమ పథకాలపై అవగాహన పోస్టర్ విడుదల*

*ఫిర్యాదులకు వాట్సప్ నెంబర్ 9490551117, టోల్ ఫ్రీ నెంబర్ 155235*

*వివరాలను వెల్లడించిన ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి*.


జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చురుకుగా పనిచేస్తున్నదని ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆహార పథకాలకు సబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా తక్షణం సవరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత చట్టం –2013 పరిధిలోని సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, అధికారులకు అవగాహ నిమిత్తం పోస్టర్ ను విడుదల చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ తీసుకుంటున్న చర్యలను విజయవాడ అశోక్ నగర్ లో ఆహార కమిషన్ కార్యాలయంలో శుక్రవారం మీడియా ప్రతినిధులకు వివరాలను ఆయన వెల్లడించారు. 


ఈ సందర్భంగా ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గా ఈ ఏడాది మార్చి 28న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 15 జిల్లాల్లో 273 ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగిందని, మరో 11 జిల్లాల్లో డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ద్వారా లభించే ప్రయోజనాలు, మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థుల వసతులు, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం(పీఎంఎంవీవై) పథకాల ద్వారా ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వివిధ ఆహార పథకాల ద్వారా అందిస్తున్న లబ్ధి ఎంతమేరకు అందుతున్నది అనేది ఫీల్డ్ విజిట్స్ లో పరిశీలించడానికి జిల్లాల పర్యటన చేస్తున్నామన్నారు. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులున్నా వాట్సాప్ నెంబర్ 949055117 కి గానీ, టోల్ ఫ్రీ నెంబర్ 155235 కి గానీ ఫిర్యాదు చేయాలని.. తక్షణమే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామన్నారు. రేషన్ బియ్యం పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార పంపిణీ, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంతో చిన్న పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తున్నారని, కొంతమంది అవగాహనాలోపంతో ఫ్లాస్టిక్ రైస్ కలుపుతున్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ లభించేవిధంగా బలవర్థకమైన ఆహారం కోసం  50 కేజీల బస్తాలో 500 గ్రామలు కెర్నెల్స్ కలుపుతారని తెలిపారు. రాబోయే మే నుంచి ఫోర్టిఫైడ్ చేసిన బియ్యం ప్రతి జిల్లాలోను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. 

  జాతీయ ఆహార భధ్రత చట్టం-2013 పరిధిలోని సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం వాట్సాప్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్, సోషల్ మీడియా వివరాలతో కూడిన దాదాపు లక్ష స్టిక్కర్ పోస్టర్లను పంపిణీచేస్తామన్నారు. ప్రతి జిల్లాకు 3 వేల చొప్పున జిల్లాలోని ప్రభుత్వ కార్యలయాలు, చౌక ధరల దుకాణాలు, అంగన్ వాడీ కేంద్రాలు, జగనన్న గోరుముద్ద స్కూల్స్, వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల వద్ద ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా మహిళల మొదటి కాన్పుకు మూడు విడతల్లో రూ. 5000/- కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అర్హులు అందరికీ అందేలా ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు అవగాహన కల్పించాలని ఛైర్మన్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి. సురేష్, అకౌంట్స్ ఆఫీసర్ కే.వి.ఎస్. శర్మ, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. వాణి తదితరులు పాల్గొన్నారు.  



Comments