అక్రమ రవాణా చేస్తున్న సిగరెట్లు స్వాధీనం

 అక్రమ రవాణా చేస్తున్న సిగరెట్లు స్వాధీనం


  కాకినాడ, సెప్టెంబర్ 16 (ప్రజా అమరావతి): అగ్గిపెట్ల రవాణా పేరుతో అక్రమంగా తరలిస్తున్న 2.40 కోట్ల రూపాయల విలువగల సిగరెట్లను కాకినాడ  కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం, కస్టమ్ హౌస్  అధికారులు కలిసి స్వాధీనం చేసుకుని వాటిని సెంట్రల్ జీఎస్టీ శాఖకు అప్పచెప్పారు. కాకినాడ కస్టమ్స్ అడిషనల్ కమీషనర్ సాధు నరసింహ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ ఎస్ రఘురామ్ తెలిపిన  వివరాలు ప్రకారం.... బుధవారం విశాఖపట్నం -- విజయవాడ జాతీయ రహదారిలో అక్రమంగా విదేశీ సిగరెట్లు తరలిస్తున్నారనే సమాచారం తమకు వచ్చిందని తెలిపారు. వెంటనే తమ సిబ్బందితో కలిసి బుధవారం కాకినాడ జిల్లా అన్నవరం దగ్గర బెండపూడిలోని రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన లారీని స్వాధీనం చేసుకుని, అందులో సరుకును తనిఖీ చేయగా బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి మన రాష్ట్రం నెల్లూరు జిల్లా వద్ద నాయుడు పేటకు అగ్గిపెట్ల పేరుతో అక్రమంగా సిగరెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.    

   సుమారు 2.40 కోట్ల రూపాయలు విలువ చేసే 400 కార్టన్స్ అనగా 

48 లక్షల స్వదేశీ సిగరెట్లను వాటికి సరిపడిన పన్నులు చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ కేసు తమ పరిధిలోకి రానందున విశాఖపట్నం సెంట్రల్ జీఎస్టీ కార్యాలయం పన్నుల విభాగానికి శుక్రవారం అప్పచెప్పినట్లు వారు తెలిపారు. 

  ఈ దాడుల్లో కస్టమ్స్  సూపరింటెండెంట్లు,  ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Comments