ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

 *ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు*


*•అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు*

*•సాధారణ భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగ కుండా తగు జాగ్రత్తలు*

*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*

                                                                                                                                                                                       అమరావతి, సెప్టెంబరు 16 (ప్రజా అమరావతి):    బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తదుపరి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుండి అక్టోబరు 5 వరకు బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవ ఏర్పాట్లపై రెవిన్యూ, పోలీస్, దేవాదాయ, దర్మాదాయ,  జలవనరులు, పురపాలక శాఖల అధికారులతో సమగ్రంగా చర్చిండం జరిగిందని ఆయన తెలిపారు. పూర్వ అనుభావాలను దృష్టిలో ఉంచుకుని దసరా ఉత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులకు తగు సూచనలు, ఆదేశాలను జారీచేయడం జరిగిందన్నారు. కోవిడ్  కారణంగా గత రెండేళ్ల నుండీ అమ్మవారిని భక్తులు చక్కగా దర్శించుకోలేక పోయారని, అయితే ఈ ఏడాది భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల తాకిడి అనుగుణంగా ఎవరికీ ఎటు వంటి ఇబ్బందులు కలుగ కుండా అమ్మవారిని చక్కగా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ  ఏడాది సాధారణ భక్తులకు ఉచిత దర్శనాలు మినహా ఇతరులు అంతా  టికెట్ కొనుక్కునే అమ్మవారి దర్శనాకి రావాల్సి ఉందన్నారు. వి.ఐ.పి. లెటర్ తీసుకు వచ్చే వారు కూడా  రూ.500/- ల టికెట్టును కొనుక్కోవాల్సి ఉందన్నారు. గతంలో వి.ఐ.పి.లను  కారుల్లో తీసుకురావడం జరిగేదని, అయితే ఈ ఏడాది వీరి కోసం ఘాట్ రోడ్డులో అదనపు లైన్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  స్టేట్ గెస్టు హౌస్, కలెక్టర్ ఆఫీస్, బెరం పార్కు తదితర మూడు ప్రాంతాల్లో పికప్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, ఆయా ప్రాంతాల్లో  రూ.500/- టికెట్లు అమ్మడం జరుగుతుందని, వారిని వాహనాలు ద్వారా తీసుకువచ్చి ఓమ్ సెంటర్లో డ్రాప్ చేయడం జరుగుతుందన్నారు.  రూ.500/- డెడికేటెడ్ క్యూలైన్ లో వారు అమ్మవారి దర్శనాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా రూ.300/-, రూ.100/- టికెట్ కొనుగోలు దారులకు మరో రెండు డెడికేటెడ్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉచిత దర్శనానికి మరో  రెండు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్య మంత్రి తెలిపారు. శరనవరాత్రుల్లో అమ్మవారి అంతరాలయ దర్శనం ఉండదన్నారు. వీలైనన్ని చోట్ల ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ఉన్న  కౌంటర్లను కొనసాగిస్తామన్నారు. అమ్మవారి ప్రసాదంలో ప్రత్యేకత ఉండేలా దాని నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టామని, గతంలో వలే లడ్డూను రూ.15/- లకు విక్రయించడం జరుగుతుందన్నారు. కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దుర్గా ఘాట్ నుండి అన్ని ఘాట్ లను మూసేస్తూ మెష్ తో బారికేడింగ్ చేయడం జరుగుతుందన్నారు. అయితే గతంలో ఉన్న 300 షవర్లకు బదులు 800 షవర్లను, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేశఖండన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తగిన స్థాయిలో క్షురకులను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్య మంత్రి తెలిపారు. సామాన్ల భద్రతకు క్లాక్ రూములను, చెప్పులు స్టాండ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. టి.టి.డి. చెందిన నాలుగు ఎకరాల స్థలంలో భవానీ దీక్షదారులకు  టాయిలెట్లు, ప్యాన్లు, షవర్లు తదితర వసతి సౌకర్యాలు కల్సిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాలంటీర్లకు కూడా క్యూఆర్  కోడ్ తో పాస్లను జారీచేస్తామన్నారు. అదే విధంగా క్యూ లైన్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. 

                                                                                                                                                                               పాత్రికేయుల సమావేశానికి ముందు జరిగిన సమీక్షా సమావేశంలో  ప్రభుత్వ ప్రజా వ్యవహారాల  సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ బోర్డు ఉపాద్యక్షులు మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మున్సిఫల్ కార్పొరేషన్ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, ప్రభుత్వ విఫ్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సి.పి. కాంతి రాణా టాటా, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, మున్సిఫల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.భ్రమరాంబ తదితర అధికారులు పాల్గొన్నారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు .

                                                                                                                                                                                                               

Comments