మంగళగిరి వైద్య ఆరోగ్య శాఖ (ప్రజా అమరావతి);
*క్యాన్సర్‌పై విజయమే లక్ష్యం
*
*సీఎం జగనన్న ఆశయాల మేరకు చొరవగా ముందుకు*
*ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని*
*క్యాన్సర్‌కు చికిత్సలో ఏపీ విధానం ఆదర్శనీయం*
*ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ వైద్య సలహాదారు నోరి దత్తాత్రేయుడు*
క్యాన్సర్‌పై పూర్తి స్థాయి విజయం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి విడదల రజినితో ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ వైద్య సలహాదారు, అంతర్జాతీయ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ విలేజ్, వార్డ్ క్లినిక్స్ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ కేసులను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రినింగ్ పై గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామస్థాయిలోనే క్యాన్సర్ రోగానికి సంబంధించి ప్రజలకు విస్తృత స్క్రీనింగ్ చేపడతామని చెప్పారు. క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ చికిత్స కోసం లైనాక్ మెషిన్లు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
*ముందుగా గుర్తిస్తే మేలుః నోరి దత్తాత్రేయుడు*
క్యాన్సర్ లో 33 శాతం వరకు ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే వెంటనే నయం అవుతుందని ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ వైద్య సలహాదారు, అంతర్జాతీయ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మహిళల్లో వచ్చే నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49శాతం ప్రైమరీ స్టేజ్ లోనే గుర్తిస్తే చికిత్సకు పెద్దగా ఖర్చవదని తెలిపారు. పూర్తిగా నయం చేయడానికి కూడా వీలు కలుగుతుందని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తిస్తే రూ.లక్షలోపు ఖర్చుతో 99శాతం నయమయ్యే అవకాశముందని తెలిపారు. అందుకే ఏపీ ప్రభుత్వం ముందే క్యాన్సర్ రోగాన్ని గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ టెస్టులు చేసేలా ముందుకు వెళుతోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ రోగులకు అందిస్తున్న చికిత్సలకు సంబంధించి పూర్తి డేటాను అనలైజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటుచేశామన్నారు. దీనిపై 60 పేజీల డాక్యుమెంటేషన్ తయారుచేశామని తెలిపారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నేషనల్ డేటా బేస్‌తో ఏపీలోని క్యాన్సర్ డేటాను అనుసంధానించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. టాటా ఇన్స్టిట్యూట్ మద్దతుతో తిరుపతిలో గొప్ప క్యాన్సర్ వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోగలిగామని చెప్పారు. మన రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా క్యాన్సర్ చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లడానికి వీలు లేదని, మొత్తం వైద్యం ఇక్కడే అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఏపీలోని ప్రజలు క్యాన్సర్ రోగానికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. క్యాన్సర్ రోగ నివారణకు కావాల్సిన అన్ని పరికరాలను సీఎం జగన్ అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. ఏపీలో క్యాన్సర్ రోగ నిర్ధారణ ప్రాథమిక దశలోనే కనుగొనేలా ప్రత్యేక రోడ్ మాప్ అమలుకాబోతోందని, దీనివల్ల 90 శాతం క్యాన్సర్ పై విజయం సాధించినట్లేనని చెప్పారు.
addComments
Post a Comment