పేద పిల్లలు, బడుగుల పిల్లలు, గిరిజన పిల్లలు, మైనార్టీల పిల్లలు వీరు తర,తరాలుగా పేదరికాన్ని తమ భుజాల మీద మోసుకుంటూ..

 

అసెంబ్లీ, అమరావతి (ప్రజా అమరావతి);


*విద్యారంగంలో నాడు–నేడుపై శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ.*


*చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....:*


ఇవాళ చాలాముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవైపు స్కూళ్లు, మరోవైపు ఆసుపత్రుల్లో ఏ రకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో లేనిది ఇవాళ ఉన్నది ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? గత పాలనలో ఎందుకు పట్టించుకోలేదు? అన్న అనేకరకమైన ప్రశ్నలకు సమాధానం నాడు–నేడు.


మొట్టమొదటగా విద్యారంగంలో జరిగిన పలుమార్పులు గురించి, నాడు–నేడు గురించి చర్చను ప్రారంభిస్తున్నాను. ప్రపంచం మారుతుంది. చదువులు కూడా మారుతున్నాయి. 

ప్రస్తుతం 2022లో ఉన్నాం. 2040లో చదువులు ఎలా ఉండబోతున్నాయి, వాటికి తగ్గట్టుగా మన పిల్లలను ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ప్రపంచమంతా ప్రణాళికలు వేసుకుంటుంది.  దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలోని మన పిల్లలు ఇంకా ఎక్కువ మంది 1950లో ఉన్న ఆ విద్యావిధానంలో, దశాబ్ధాలుగా పట్టించుకోని స్కూళ్లలో చదువు చదవటం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అని అభిప్రాయపడే అర్ధం కాని పరిస్థితుల్లో ఇవాల్టికి కూడా ఉండిపోతున్నారు. మన అధికారంలోకి రాక మునుపు వరకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 


మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి మా ముందుర ఉన్న ప్రశ్నలివి. వీటిని ఇలాగే వదిలేద్దామా? లేక ప్రభుత్వ బడులలో మార్పులు ఏమైనా తీసుకుని రావాలా ? వద్దా ? అనేటటువంటి రకరకాల ప్రశ్నలు,  అధికారంలోకి రాకమునుపు కనిపించేవి, ఉండేవి.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదుతుకూ అడుగులు పడ్డాయి. 


ప్రభుత్వ బడులని గతంలోలా పాడుబెట్టి, కార్పొరేట్‌ స్కూళ్లకుమేలుచేసే గత పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే బాధనిపిస్తుంది.

మారుతున్న పోటీ ప్రపంచంలో, మన పిల్లలను, మన బడులని బాగు చేసుకుని, ఈ వ్యవస్ధను ఎలా నిలబెట్టాలన్న ఆలోచనతో అడుగులు ముందుకు పడ్డాయి. దీనిమీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. 

విద్యారంగం మీద మనం చేస్తున్న ఈ ఖర్చును తెలియని తనం అని నేను అనను... రాజకీయదురుద్దేశ్యంతోనే ఇలా అంటున్నారని  అనుకోవాల్సి వస్తుంది. అటువంటి దురుద్ధేశ్యంతో ఖర్చు ఎక్కువ పెడుతున్నారని రకరకాలగా మాట్లాడే స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా అటువైపు నుంచి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరందరూ కలిసికట్టుగా చేసే దుష్ప్రచారాల్లో భాగమే ఇది. 


విద్యారంగం మీద, పిల్లల చదువులు మీద మనం పెట్టేది ఒక పెట్టుబడి. రాబోయే సమాజం మీద మంచి పౌరులు తయారు చేసేదాని కోసం మనం పెడుతున్న పెట్టుబడి. మారుతున్న ప్రపంచంలో మన పిల్లలు విజ్ఞానంతో నిలబడేందుకు మనం పెట్టుబడి పెడుతున్నాం. అందుకనే దీన్ని హ్యూమన్‌ కేపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ అని అనాల్సి వస్తోంది. మానవవనురుల మీద మనం పెట్టుబడి పెడుతున్నాం. గవర్నమెంటు బడులలో నాడునేడు ఎందుకు చేయాల్సి వచ్చిందో, మనం అధికారంలోకి రాక మునుపు ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయో ఒక్కసారి  మనం ఆలోచన చేయాలి. అవి కూడాచూద్దాం. 


మనం రాకమునుపు ప్రభుత్వ బడులలో ఇంగ్లిషు మీడియం విద్య, సీబీఎస్‌ఈ సిలబడ్‌ లేకుండా చేసి, ప్రభుత్వ బడులలో సదుపాయాలు లేకుండా చేసి, మిడ్‌ డే మీల్స్‌ కార్యక్రమాన్ని నీరుగార్చి, స్కూల్‌ బుక్స్‌ సైతం నెలల తరబడి జాప్యంతో ఇస్తూ.. స్కూళ్లని నిర్వీర్యం చేసి చివరకు ప్రభుత్వ స్కూళ్లలకు పోవడం వృధా అన్న అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించేలా,వారికి ఆ భావన వచ్చేలా, మొత్తంగా ప్రభుత్వ రంగంలో బడులే లేకుండా చేయాలన్న దుర్భుద్ధి, ఆలోచనలతో గత ప్రభుత్వం తనకు కావాల్సిన కార్పొరేట్‌ స్కూల్స్‌ కొంతమందిని ప్రోత్సహించేందుకు అడుగులు పడ్డాయి.

బడులలో టాయిలెట్లు లేకపోవడం వల్లే ఆడపిల్లలు చదువులకు దూరమవుతున్నారన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ కూడా...

ఏ రోజూ కూడా దాన్ని రిపేరు చేయాలన్న ఆలోచన గతంలో చేయలేదు. బెంచీలు, మాష్టారు కుర్చీలు, ఫ్యాన్లు, మంచినీళ్లు, కాంపౌండ్‌ వాల్స్, చివరకి మంచి బ్లాక్‌ బోర్డులు కూడా లేకుండా, ప్రభుత్వ బడి అంటే అక్కడ ఏమీ ఉండవు, అలా చేయాలి, ప్రజలకు అలాంటి భావన ఇవ్వాలన్న ఆలోచనతో గతంలో అడుగులు ముందుకుపడ్డాయి.


ఇవన్నీ కారణాల వల్ల గతంలో డ్రాపౌట్స్‌ రేటు పెరుగుతున్నప్పటికీ కూడా... ఇలా డ్రాపౌట్స్‌ రేటు పెరుగుతున్నాయి కదా వీటిని మార్చాలన్న ఆలోచన కూడా  జరగని అధ్వాన్న పరిపాలన గత ప్రభుత్వంలో చూశాం. అప్పట్లో స్కూళ్లు ఎలా ఉండేవో, ఇప్పుడు దేవుడి దయతో మంచి ఆలోచనలతో మంచి మార్పులు తీసుకుని వస్తూ.. .స్కూళ్లు ఎలా ఉన్నాయన్నది ఒక్కసారి గమనించినట్లైతే తెలుస్తుంది.

కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాను. చంద్రబాబునాయుడు గారు గత పరిపాలన లో ముఖ్యమంత్రి కాబట్టి...అప్పుడు ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో స్కూల్‌ ఎలా ఉంది. మనం  అధికారంలోకి రాకమునుపు వరకు ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. 


ఎంపీపీ స్కూల్, నారావారిపల్లో నాడు అంటూ గతంలో ఫోటో డిస్‌ప్లే చూపించిన సీఎం. 

ఇదే నారావారిపల్లెలో నేడు స్కూల్‌ ఫోటో (డిస్‌ప్లేలో ఫోటో చూపించిన సీఎం.) 

కారిడార్, వరండా, టాయిలెట్, క్లాస్‌రూం, ఫర్నీచర్, రన్నింగ్‌ వాటర్, కాంపొండ్‌ వాల్, చివరకు పెయింటింగ్స్‌ చూసినా తేడా తెలుస్తుంది.

నారావారిపల్లె పక్కన పెడితే, ఆయన సొంత నియోజకవర్గం కుప్పం తీసుకుని అక్కడ నాడు–నేడు చూద్దాం. కుప్పంలో ప్రభుత్వ హైస్కూల్‌లో నాడు (ఫోటో చూపిస్తూ), నేడు (ఫోటో చూపిస్తూ)... అప్పుడు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయి. నేడు చక్కని టాయిలెట్లు,  ఇంకా మిగిలిన స్కూళ్లు కూడా చూస్తే.... శాంతిపురంలో నాడు–నేడు స్కూళ్లు. ఒక్కసారి గమనిస్తే మార్పు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందో ఫోటోలే చెబుతాయి.


ఇలాంటి మార్పులు ఏవీ చేయకుండా ఎందుకు మన స్కూల్స్‌ను ఇలా గాలికొదిలేశారని మనమంతా ప్రశ్నించాల్సిన అంశం. ఎవరి ప్రయోజనాల కోసం మన ప్రభుత్వబడులను గాలికొదిలేశారు? దెబ్బతీశారు అని కూడా ప్రశ్నించాలి ? ఎందుకిలా జరిగిందని మనమంతా ఆలోచన కూడా చేయాలి ? 

పేద పిల్లలు, బడుగుల పిల్లలు, గిరిజన పిల్లలు, మైనార్టీల పిల్లలు వీరు తర,తరాలుగా పేదరికాన్ని తమ భుజాల మీద మోసుకుంటూ.. చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకుంటూ... అలాగే పేదరికంలో మిగిలిపోతున్న వీరి పరిస్థితుల మీద తిరుగుబాటుగా మన విద్యావిధానంలో మనం మార్పులు తీసుకొచ్చామని సగర్వంగా చెపుతున్నాను.  


బహుశా కొద్ది మినహాయింపులుంటే ఉండవచ్చు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈ  సామాజికవర్గాలు వారు అంతా కూడా స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆర్ధిక, సామాజిక కారణాల వల్ల తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించుకోలేకపోతున్నారు. 


ఒకవైపు అభివృద్ధి, ఇంగ్లిషు మీడియం వైపు అడుగులు వేస్తున్నా... ఇటువైపు మనం అడుగులు వేయలేని పరిస్థితులు, అడుగులు వేయకుండా చేస్తున్న పరిస్థితులు మన దగ్గర కనిపిస్తున్నాయి. వచ్చేతరం పిల్లలకు నాణ్యమైన, అభివృద్ధి వైపు అఢుగులు వేసే విధంగా వారి చదువులు, వారి చేతికి అందేలా చేయగలిగితే ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయి. 

ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.


రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది కేవలం ఒక నినాదంలా కాకుండా... రైట్‌ టు ఇంగ్లిషు ఎడ్యుకేషన్, రైట్‌ టు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఈ రెండు కూడా వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చి, వాళ్లందరినీ కూడా గొప్పగా చదవించే బాధ్యతను మనందరి ప్రభుత్వం తీసుకుంది.  మూడు సంవత్సరాలుగా  మనం అనుసరిస్తున్న విధ్యావిధానం ఇదే అని తెలియజేస్తున్నాను.


విద్యా రంగంలో ఇలాంటి గొప్ప మార్పుల్లో భాగమే మనబడి నాడు–నేడు కార్యక్రమం. దీనిద్వారా ప్రతి ప్రభుత్వ స్కూళ్లలో కూడా 12 రకాల మార్పులు అందరికీ అర్ధం అయ్యేలా, స్పష్టంగా కనిపించేలా ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. 

నాడు–నేడు అంటే ఏమిటి, నాడు–నేడు అయిన తర్వాత ఎలాంటి మార్పులు ఆ బడులలో ప్రస్ఫుటంగా కనిపించాలని చెప్పి స్పష్టంగా నిర్దేశించి ఆదేశాలు ఇచ్చాం.


ప్రతి స్కూళ్లోనూ మంచి టాయిలెట్లు ఉండడం,  మంచి నీటి సరఫరా అంటే క్లీనింగ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అన్నది రెండోది. స్కూళ్లలో చిన్న, పెద్ద రిపేర్లు ఉండే చేయించడం, నాలుగోది విద్యుదీకరణ ట్యూబులు, ఫ్యాన్లు ప్రతి స్కూళ్లోనూ అందుబాటులోకి తీసుకుని రావడం అయితే ఐదోది విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రతి క్లాస్‌రూంలోనూ, స్టాప్‌రూంలోనూ మంచి ఫర్నీచర్‌ కల్పించడం.  ఆరు... గ్రీన్‌ చాక్‌బోర్డుల ఏర్పాటు, ఏడోది స్కూల్‌ బిల్డింగ్‌కు పెయింటింగ్, ఎనిమదివది  ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌ ఏర్పాటు, తొమ్మిది  స్కూల్‌ భవనానికి ప్రహరీ నిర్మాణం, పదోది ప్రతి స్కూల్‌లో కిచెన్‌ నిర్మాణం, పదకొండోది అవసరం మేరకు అదనంగా తరగతి గదుల నిర్మాణంతో పాటు పన్నెండోది నాడు–నేడు అయిన ప్రతి క్లాస్‌రూంలోనూ డిజిటల్‌ లెర్నింగ్‌ క్లాస్‌రూంలను తీసుకుని రావడం అంటే ప్రతి క్లాస్‌రూంను డిజిటలైజ్‌ చేయడం వంటి ఈ 12 రకాల అంశాలు నాడు–నేడుతో  ఇవన్నీ పూర్తి కావాలని దిశానిర్దేశం చేశాం. 


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45వేలకు పైగా ప్రభుత్వ విద్యాసంస్ధలతో పాటు ప్రిప్రైమరీలుగా, ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మారుతున్న అంగన్‌వాడీలను, హాస్టల్స్‌ను  కూడా మనబడి నాడు–నేడు కార్యక్రమంలోకి తీసుకువచ్చాం.


మనబడి నాడు–నేడు ద్వారా మొత్తం 57వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపురేఖలు మారుతున్నాయి.  ఇందు కోసం ప్రభుత్వం అక్షరాలా రూ.16 వేల కోట్ల ఖర్చు చేస్తోంది.

తొలి దశలో భాగంగా 15,715 స్కూళ్లలో రూ.3700 కోట్ల వ్యయంతో సమూల మార్పులు చేశాం. ఇప్పుడు ఆ తొలిదశ నాడు నేడు పూర్తయిన ఆ పాఠశాలల్లోని తరగతి గదుల్లో  డిజిటల్‌  లెర్నింగ్‌ కోసం ఇంటరాక్టివ్‌ ప్యానెల్స్‌ పెడుతున్నాం. డిజిటలైజేషన్లో భాగంగా వచ్చే జూన్‌ నాటికల్లా  ఈ 15,715 స్కూళ్లలో డిజిటలైజేషన్‌ పూర్తవుతుంది. 


నాడు–నేడు మనబడి రెండో దశ కింద మరో 22,344 స్కూళ్లను ఆ పరిధిలోకి తీసుకువచ్చాం. ఇందులో యునిక్‌ స్కూల్స్‌ 16,911 ఉన్నాయి. ఈ స్కూళ్లలో   రూ.8 వేల కోట్ల వ్యయంతో సకల సదుపాయాలు కల్పిస్తూ, సమూల మార్పులు చేస్తున్నాం. నాడు నేడు రెండోదశకు శ్రీకారం చుట్టాం. సదుపాయాలు కల్పించడంతోపాటు వాటి నిర్వహణపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇంత డబ్బులు ఖర్చుపెట్టి మార్పు చేసిన తర్వాత వాటిని సక్రమంగా నిర్వహించకపోతే.. మరలా పాత పరిస్థితికే మరలా వస్తాయి. ప్రతి స్కూళ్లోనూ టాయ్‌లెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్, స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ అని ఏర్పాటు చేసి వీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేశాం. 


*టీఎంఎఫ్‌:*

 టాయిలెట్లు, యూరినల్స్‌ను క్లీన్‌గా ఉంచడంతో పాటు, వాష్‌బేసిన్లు ఇంకా ఇతర సదుపాయాల్లో కూడా పరిశుభ్రత ఉండే విధంగా టీఎంఎఫ్‌ను వినియోగిస్తున్నాం.  స్కూళ్ల నిర్వహణలో ఈ తరహాలో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. దీనికోసం అమ్మఒడిలో మనమిచ్చే రూ.15వేలలో ఒక రూ.1000ను ప్రతి తల్లి, అక్క, చెల్లెమ్మకు చెప్పాం, మన పిల్లలను బడికి పంపించే స్కూళ్లలో మన టాయిలెట్లు బాగాఉంచేందుకు, బాగా లేకపోతే ప్రశ్నించే హక్కు మనకు ఉండేందుకు కేటాయించమని విజ్ఞప్తి చేశాం. ఆ మేరకు గడిచిన రెండేళ్లుగా టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ రూ.448 కోట్లు కేటాయించాం.


టాయిలెట్ల నిర్వహణ, స్కూళ్లు, కాలేజీల్లో పరిశుభ్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44,968 స్కూళ్లు, కాలేజీల్లో 47 వేల మంది ఆయాలను రూ.6 వేల గౌరవ వేతనంతో పాటు... వారికి క్లీనింగ్‌ సామాగ్రి, గ్లోవ్స్‌ ఇస్తూ  నియమించడం జరిగింది. 


*ఎస్‌ఎంఎఫ్‌ (స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌):*

స్కూల్‌ భవన నిర్వహణ కోసం ఈ నిధిని కూడా అమ్మ ఒడి నుంచి అక్కచెల్లెమ్మల సహకారంతో సేకరించడం జరిగింది. ఇంత పెద్దమొత్తంలో డబ్బులు పెట్టి మనం స్కూళ్లను బాగుచేసుకుంటూ ఉన్నాం. మన స్కూళ్లలో చిన్న, చిన్న రిపేర్లు వచ్చినప్పుడే పట్టించుకోకపోతే అవి పెద్దవి అవుతాయి, దీంతో స్కూళ్లు మరలా పాత పరిస్తితులకే వస్తాయి. వీటని మనం ఓన్‌ చేసుకోవాలి అని చెప్పాం.  దీనికోసం మరో రూ.1000 అమ్మఒడి నుంచి దీనికోసం కేటాయింపులు చేసేటట్టుగా విజ్ఞప్తి చేసాం.  ఈ ఏడాది నుంచే ఆ నిధి సేకరిస్తుండగా, మొత్తం రూ.450 కోట్లు జమ చేశాం. ఈ  మొత్తంతో స్కూళ్లలో ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. దీనికోసం ఓ సామెత కూడా ఉంది స్టిచ్చింగ్‌ టైమ్‌ సేవ్స్‌  నైన్‌ అని.. అంటే సయమానికి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించకుండా వదిలేస్తే... అది మరింత పెద్దదవుతుంది అని.  అందుకే అప్పటికప్పుడు మరమ్మతులు చేయడం కోసం ఈ ఫండ్‌ ఉపయోగపడుతుంది. ఈ బాధ్యతను స్కూళ్లలో  పేరెంట్స్‌ కమిటీకి, హెడ్‌ మాష్టారు ఆధ్వర్యంలో నిర్వహించేటట్టు  చర్యలు తీసుకున్నాం.  గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షణ కూడా వీరిది అదనంగా ఉండేటట్టు చేశాం.


*విద్యా రంగంలో మార్పులు–ప్రయోజనాలు:*

జీఈఆర్‌:

మన పిల్లల భవిష్యత్‌ బాగుండాలని విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం.  ముఖ్యంగా మనం అమలు చేస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కింద మనం  రూ.20 వేల వరకు ఇచ్చే వసతిదీవెన పథకాల వల్ల... 18–23 ఏళ్ల మధ్య వయస్సులో కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో–జీఈఆర్‌)ను  గణనీయంగా పెంచాలన్న తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. చిన్న పిల్లాడి నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. 


జీఈఆర్‌ ఎందుకు ముఖ్యం అంటే...  మనమంతా బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) దేశాలతో పోటీ పడతాం. 18 నుంచి 23 సంవత్సరాల వయస్సులో కాలేజీలో ఉన్న వారి సంఖ్య ఆ దేశాలలో చూస్తే.. బ్రెజిల్‌లో అయితే 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం, ఇండియాలో అయితే కేవలం 29 శాతం మాత్రమే.

 దీన్ని 2035 నాటికి మన రాష్ట్రంలో కనీసం 70 శాతం తీసుకుని పోయే విధంగా అడుగులు వేస్తున్నాం.  దాని కోసమే విద్యా రంగంలో పలు పథకాలు అమలు చేస్తున్నాం.


ప్రాధమిక విద్యారంగంలో కూడా ఇదే రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.  అక్కడ జీఈఆర్‌ కేంద్రప్రభుత్వ విద్యాశాఖ, మానవవరుల అభివృద్ధిశాఖ 2018లో విడుదల చేసిన డేటా చూస్తే... ఏపీలో ప్రైమరీ స్కూల్స్‌లో చేరే (2015–16లో ) జీఈఆర్‌ 84.48 శాతం కనిపిస్తోంది. అప్పట్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 36లో ఏపీ 29 రాష్ట్రాలలో అతితక్కువ స్ధానంలో ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. మిగిలిన ఏ రాష్ట్రం 84.48 కంటే తక్కువ లేదు. మనం కేవలం కేంద్రపాలిక ప్రాంతాల కంటే మాత్రమే ఎక్కువగా ఉన్నాం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మనమున్నామని చెప్పే డేటా ఇది.


ఇటువంటి పరిస్థితుల్లో విప్లవాత్మక చర్యలు ఎంత అవసరమో మనందరికీ తేటతెల్లం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం రావడం, నాడు నేడుతో పాటు పేదపిల్లల తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బడులకు మరలా వైభవం తీసుకొచ్చేందుకు మన ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేసింది. అందులో మొదటి అడుగు అమ్మఒడి. 


*అమ్మ ఒడి:*

దేశంలో ఇలాంటి పథకం మరే రాష్ట్రంలోనూ లేదు.

 దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాల్లో పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15వేల ఆర్థిక సహాయం చేస్తూ.. దాన్ని 75 శాతం హాజరుతో ముడిపెట్టి ఆ పిల్లలను తల్లులు బడికి పంపిస్తే.. ప్రతి సంవత్సరం రూ.15వేలు ఇచ్చే పథకం.

 ఈ మూడేళ్లలో 84 లక్షల పిల్లలకు తద్వారా 44.5 లక్షల మంది తల్లులకు మేలు చేశాం. మూడు సంవత్సరాలలో ఇందుకోసం ప్రభుత్వం చేసిన ఖర్చు  మొత్తం రూ.19,617.60 కోట్లు.


*గోరుముద్ద:*

ఈ పథకంలో  రోజుకొక మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టికాహారం అందించే కార్యక్రమం. ఇది రోజుకొక మెనూతో చేస్తూ... వంట చేసే వడ్డించే ఆయాలకు గతంలో రూ.1000 గౌరవవేతనం ఇస్తూ.. దాన్ని కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన పరిస్థితులు, సరుకులు బిల్లులు కూడా 8 నెలలు  పైగా పెండింగ్‌లో పెట్టిని పరిస్థితి. ఆ పరిస్థితి మారాలని అన్నం వండి, వడ్డించే ఆయాలకు రూ.1000ను కాస్తా రూ.3000 కు ఆగష్టు,2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచాం. గోరుముద్ద పథకంలో పిల్లలకు వారానికి 5 కోడిగుడ్లు. మూడు రోజులు చిక్కీ ఇస్తున్నాం. 


గోరుముద్ద పథకంలో గత ప్రభుత్వ హయాంలో రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయడానికి మనసు రాని పరిస్థితి నుంచి మనం... ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీన్ని మానిటర్‌ చేయడానికి ఒక ఐఏఎస్‌ అధికారి తన కింద నలుగురు అధికారులతో పాటు ఒక యంత్రాంగాన్ని క్రియేట్‌ చేసి మానిటరింగ్‌ చేస్తున్నాం. 


*విద్యాకానుక:*

పిల్లలకు వారు స్కూల్‌లో చేరే సమయానికి స్కూల్‌ బ్యాగ్‌తో పాటు, మూడు జతల యూనిఫాం, కుట్టుకూలి, ఒక జత షూష్, రెండు జతల సాక్స్‌లు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్, ఇంగ్లిషు టు తెలుగు ఆక్ష్ ఫర్డ్‌ డిక్షనరీతో పాటు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 


మరోవైపు విద్యాకానుకలో భాగంగా  8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు మొత్తం 5.18 లక్షల ట్యాబ్స్‌ ఈ నవంబరులో ఇవ్వబోతున్నాం. 4.70 లక్షల మంది పిల్లలకు, 50 వేల మంది టీచర్ల అందరికీ ట్యాబ్స్‌ ఇవ్వబోతున్నాం. ట్యాబ్‌ స్పెషిఫికేషన్స్‌తో అమెజాన్, ప్లిప్‌కార్టులలోకి వెళ్లి చూస్తే.. దీని ఖరీదు రూ.16,500 కనిపిస్తోంది. ఇవే ట్యాబ్స్‌ కోసం మనం రివర్స్‌ టెండరింగ్‌తో పాటు మూడేళ్ల పాటు వ్యారంటీ ఇచ్చేటట్టుగా, రీప్లేస్‌మెంట్‌ చేసే విధంగా, ట్యాబ్‌ చెడిపోతే గ్రామ సచివాలయంలో వారం రోజుల్లోగా దాన్ని రీప్లేస్‌ చేసేటట్టుగా చేసి టెండర్లు పిలిస్తే.. రూ.12,840 కు మనకు ఆఫర్‌ వచ్చింది. ప్రతి పిల్లాడికి విద్యాకానుకలో భాగంగా రూ.12,840తో కూడిన ట్యాబ్‌ కూడా ఇస్తున్నాం. దీనికోసం రూ.665 కోట్ల ఖర్చు చేస్తున్నాం. ఎనిమిదో తరగతిలో చేరే మన పిల్లలందరూ కూడా 2025లో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షకు సిద్ధం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమేరకు వీరందరినీ సన్నద్ధం చేసేందుకు ఈ ట్యాబులు ఉపయోగపడతాయి. వీటితో పాటు బైజూస్‌ సంస్ధతో ఒప్పందం చేసుకున్నాం.  మార్కట్‌లో ఈ యాప్‌ను ప్రైవేటుగా కొనుగోలు చేస్తే.. ప్రతి పిల్లాడికి రూ.20 నుంచి రూ.24వేలు అవుతుంది. ఈ యాప్‌ను ఉచితంగా ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లల ట్యాబ్‌లో ఉచితంగా లోడ్‌ చేసి ఇస్తున్నాం.

విద్యాకానుక పథకంలో మొత్తం 47 లక్షల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుండగా, ఇప్పటి వరకు రూ.886.68 కోట్లు ఇందుకోసం ఖర్చు చేయడం జరిగింది.


2018–19లో ప్రభుత్వ బడులలో 37,20,988 మంది పిల్లలు చదువుతుంటే... 2021–22లో ప్రభుత్వ బడులలో పిల్లల సంఖ్య చదివే 44,29,561 మంది. అంటే ప్రభుత్వ బడులలో చదివే పిల్లల్లో ప్రభుత్వం మీద నమ్మకం పెరిగి  37 లక్షల నుంచి 44 లక్షలకు పెరిగారు. 


*విద్యాదీవెన:*

నాలుగో కార్యక్రమం జగనన్న విద్యాదీవెన.

అప్పట్లో నాన్నగారు హయాంలో పూర్తిఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసే కార్యక్రమం చూశాం. ఆయన చనిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్న ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదు. ఆ పథకాన్ని ఎలా నీరుగార్చాలన్న విధంగానే అడుగులు పడ్డాయి. ఆ పరిస్థితులు పూర్తిగా మార్చుతూ...  విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించే ఈ పథకంలో ఇప్పటి వరకు 24.74 లక్షల పిల్లలకు ప్రయోజనం కలగజేస్తూ, అందుకోసం  మొత్తం రూ.8365 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీకు ఆలస్యం లేకుండా క్వార్టర్‌ అయిపోయిన వెంటనే ముందు క్వార్టర్‌ కాలానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇదొక్కటే కాకుండా  గత ప్రభుత్వం ఎగ్గొట్టి పోయిన రూ.1777.49 కోట్లు బకాయిలు  కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. నాన్నగారు ఒక అడుగు వేస్తే... మనం రెండు అడుగులు వేస్తామని చెప్పినట్టుగానే వసతి దీవెన పథకాన్ని కూడా దీనికి యాడ్‌ చేశాం. 


*వసతిదీవెన:*

పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కింద ఇంజనీరింగ్, డిగ్రీ, మెడిసిన్‌ పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు చొప్పున రెండు దఫాల్లో ఇచ్చేటట్టుగా,  ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు ఇస్తూ వసతి దీవెన పథకం అమలు చేస్తున్నాం.  ఈ పథకంలో ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించి 18.77 లక్షల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.3349.57 కోట్లు జమ చేయడం జరిగింది. వసతిదీవెన, విద్యాదీవెన పథకాల కింద మనందరి ప్రభుత్వం ఇప్పటి వరకు మూడేళ్లలో రూ.11,715 కోట్లు వ్యయం చేసింది. వీటితో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సులలో కరిక్యులమ్‌లో కూడా మార్పులు తీసుకువచ్చాం. కరిక్యులమ్‌ కూడా జాబ్‌ఓరియెంటెడ్‌గా ఉండేట్టుగా తీసుకునిరావడంతోపాటు ఇంటర్నెషిప్‌ తప్పనిసరి చేశాం. మైక్రోసాప్ట్, నాస్కామ్, హెచ్‌సీఎల్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలను సర్టిఫికేట్‌ కోర్సులు ఇచ్చేటట్టుగా వాళ్లను కూడా భాగస్వామ్యులను చేశాం. 


ఇలా విద్యా రంగంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక, అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక మన పిల్లల భవిష్యత్‌ పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప బాధ్యత కనిపిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం నాటుతున్న విత్తనాలు మొలకెత్తి, పెరిగి ఫలాలు రావడానికి కాస్తా సమయం పడుతుంది. ఒక్కసారి ఫలాలు వస్తే పూర్తిగా దేశంతో కాదు ప్రపంచంలో పోటీపడే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను.

Comments