నెల్లూరు, సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి); ఈనెల 15 నుండి 26 వ తేదీ వరకు నగరంలో జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని అందరూ సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాల
ని మునిసిపల్ కమిషనర్ శ్రీమతి డి హరిత అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు
గురువారం మధ్యాహ్నం మునిసిపల్ కమిషనర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి 34,338 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వారికి ఎలాంటి లోటు పాట్లు లేకుండా పూర్తి సహకారం అందించే విధంగా ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ప్రతిరోజు 3000 మంది అభ్యర్థులకు ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం సజావుగా బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని తడవకుండా వైద్య, ఆరోగ్య పరీక్షా విభాగాలను, గ్రీవెన్స్ విభాగాలను, ప్రముఖుల ఎన్క్లోజర్లను, అభ్యర్థుల నిరీక్షణ కేంద్రాన్ని, సెల్ ఫోన్లు స్వీకరణ కేంద్రాన్ని, సామాను భద్రపరచు కేంద్రాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలోనూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోనూ సంచార మరుగుదొడ్లను, చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలోనూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనూ పారిశుధ్యం సజావుగా జరిగేలా ఏర్పాటు చేయాలన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు తెలియజేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం లు ఏర్పాటు చేయాలన్నారు. కావలసినన్ని కంప్యూటర్లు అంతర్జాలంతో సమకూర్చాలని సిసి కెమెరాలు, కమాండ్ కంట్రోల్ విభాగాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే అభ్యర్థులకు వైద్య సహాయం అందించేందుకు వీలుగా మూడు షిఫ్టులలో వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, కావలసినన్ని వైద్య సంబంధ మందులు సామాగ్రిని, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫోటోస్టాట్ కేంద్రాన్ని, బార్బర్లను 24 గంటలు పనిచేసే విధంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. నగరంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
అభ్యర్థులకు అరటి పండ్లు బిస్కెట్లు, అల్పాహారము మంచినీరు రాయితీతో అందించే ఏర్పాటు చేయాలన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా గడ్డం లేకుండా రావాలని, సెల్ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంగా తెలియజేయాలన్నారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా నీళ్లలో తడవకుండా వస్తువులు భద్రపరుచుటకు ప్రత్యేక సంచులు తీసుకోరావాలన్నారు. అభ్యర్థులు ఆర్మీ నోటిఫికేషన్ ప్రకారం అన్ని రకాల డాక్యుమెంట్లు ఒరిజినల్ తో సహా రెండు ఫోటోస్టాట్ ప్రతులను, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు.
అదనపు ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా ఈనెల 14వ తేదీ రాత్రి 8 గంటల నుండి ఎంపికలు మొదలవుతాయన్నారు. మొదట అభ్యర్థులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిరీక్షించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఒక్కో ఎంక్లోజర్ లో 300 మంది అభ్యర్థుల చొప్పున 10 ఎంక్లోజర్ లో 3000 మందికి టోకెన్లు ఇచ్చి స్టేడియం లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులకు ఎత్తు కొలతలు కొలిచాక నిర్ణీత కొలతల ప్రకారం ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారి ధృవీకరణ పత్రాలు పరిశీలించి మూడు బ్యాచులుగా విభజించి నిప్పో సెంటర్ నుండి స్టేడియం వరకు ఒక మైలు దూరం పరిగెత్తే పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్ణీత తక్కువ సమయంలో పరిగెత్తిన వారి వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. వారి ధ్రువీకరణ పత్రాలు రికార్డులను పరిశీలించడం జరుగుతుందని వారి వృత్తి నైపుణ్యతను పరీక్షించడం జరుగుతుందని, రాత పరీక్ష ఉంటుందని వివరించారు. స్టేడియం జిమ్ హాల్లో ఎత్తు, చాతి కొలతలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వారు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వైద్య పరీక్షలకు కావలసి ఉంటుందన్నారు. ఇదే విధమైన ప్రక్రియ ప్రతి రోజు జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో సెట్నెల్ సీఈవో శ్రీ పుల్లయ్య, డిఆర్డిఎ, మెప్మా పి.డీ.లు శ్రీ సాంబశివరెడ్డి శ్రీ రవీంద్ర, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీ మురళీకృష్ణ, యన్ ఐ సి డి ఏ ఓ సి శ్రీ సురేష్ కుమార్ మున్సిపల్ ఉప కమిషనర్ శ్రీ చెన్నుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment