క్షేత్ర స్థాయి తనిఖీలో తరగతి గది లో విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



*కలెక్టరు గారు టీచరు అయ్యారు..*


*హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పుతూ..* 


* క్షేత్ర స్థాయి తనిఖీలో తరగతి గది లో విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు




 జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత టీచర్‌గా మారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది.


 శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వేమగిరి గ్రామం లోని  "పేరూరి గంగాధరరావు" హైస్కూల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు పరిశీలనకు విచ్చేశారు.  ఆ సందర్భంలో కలెక్టర్ మాధవీలత పదవ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు  చెప్పారు.  ఆ సందర్భంలో వారి జనరల్ నాలెడ్జి పై పలు ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అనే ప్రశ్నకు సరైన సమాధానం చాలామంది విద్యార్థులు చెప్పలేకపోయారు. ఇరవై ఆరు జిల్లాలుగా మారిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం ఏది అనే ప్రశ్నకు కాకినాడ అనే సమాధానం వచ్చింది. దీంతో ఈ కొత్తగా మారిన జిల్లాల గురించి, వాటి కేంద్రాల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసేలా సూచనలు ఇవ్వాలని పక్కనే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహంకు కలక్టర్ సూచించారు.


 మన జిల్లా తూర్పు గోదావరి జిల్లా అని, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం అని కలెక్టర్ తెలియచేశారు.  విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ ఎంతో అవసరమని ఇంటి దగ్గర ఉన్న సమయంలో పత్రికలు చూడాలని విద్యార్థులకు తెలియజేశారు. ఇంగ్లీషు భోదన గురించి కూడా కలెక్టర్ ఆరా తీశారు. కొందరు విద్యార్థులు ఇంగ్లీషులో చదవడానికి ఇబ్బంది పడడం గమనించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు  గ్లోబలైజేషన్  కు అనుగుణంగా పోటీ పడాలన్నారు. అందుకు ఇంగ్లీషు భాష అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. అందువల్ల మాతృభాష తెలుగుతో పాటు పాఠశాలలో ఇంగ్లీష్ లో కూడా మాట్లాడడం అలవర్చుకోవాలని సూచించారు. మన పొరుగున ఉన్న బెండపూడి హైస్కూలు విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే తీరును ఇక్కడ విద్యార్థులకు ఉదాహరణగా వివరించారు. సుమారు ఇరవై నిమిషాల పాటు ఉపాధ్యాయురాలుగా కలెక్టర్ మాధవీలత విద్యార్థులకు పాఠాలు బోధించి అందర్నీ ఆకట్టుకున్నారు.



Comments