కౌన్సిల్ అత్యవసరం కాని పనులు రద్దు చేయాలి ___ కలెక్టర్ గ్రీవెన్స్కి ఫిర్యాదు

  కౌన్సిల్ అత్యవసరం కాని పనులు రద్దు చేయాలి

___ కలెక్టర్ గ్రీవెన్స్కి ఫిర్యాదు


   కాకినాడ, సెప్టెంబర్ 12 (ప్రజా అమరావతి): కాకినాడ నగర పాలక సంస్థ పదవీ కాలం ఈనెల15వ తేదీతో ముగుస్తున్న దృష్ట్యా ఆఖరి 6నెలల అజెండాలో అత్య వసరం కాని పనులు 

రద్దు చేయాలని కలెక్టర్  గ్రీవెన్స్ 246 నెంబర్ అర్జీలో పౌర సంక్షేమ సంఘం  పిర్యాదు దాఖలు చేసింది. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ మున్సిపల్ చట్టం ప్రకారం చివరి 6 నెలల్లో ప్రభుత్వ పథకాలు, పారిశుద్ధ్యం, త్రాగునీరు మినహా ఇతర పనులు చేపట్టరాదన్న నిబంధన మేరకు అత్యవసరం కాని పనులు నిలుపు చేయాలని, అవసరం లేని ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరారు. 200కోట్ల రూపాయల మేరకు అత్యవసరం కాని పనులు, హవాలా పద్దతిలో  లాభార్జనకు

దోహదమయ్యే తీర్మానాలు చేశారన్నారు. ఇప్పటికే కార్పోరేషన్ వెయ్యి కోట్ల ఆర్థిక మాంద్యంలో వుందని కొత్త కౌన్సిల్ పాలనకు పరిస్తితిని మెరుగుపర్చాలని కోరారు. సురేష్ నగర్, శశికాంత్ నగర్ భూములు ప్రభుత్వ ప్రయోజనాలకి తావు లేకుండా స్వప్రయోజనాలకు ఆశించి నివాస పరిధికి చేర్చడం వెనుక 200కోట్లరూపాయల దోపిడీ వుందన్నారు. 

   ఎన్నికల కమీషన్కు చెందిన ఇవిఎం బాక్సులు భద్రపర్చే గోదాము ప్రక్కన వున్న స్థలంలో జి ప్లస్ టు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి చేపట్టిన తీర్మానం నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా స్థలిని అదే స్థలంలోకి మార్చడానికి వీలులేదని నిబంధనల అడ్డు చెప్పిన అధికారులు అక్కడ ఏ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారన్నారు. 

  కలెక్టరేట్ ప్రక్కన వున్న ముసాఫర్ వీధిని 1999లో అప్పటి ఆర్డిఓ రేఖారాణి హయాంలో కబ్జా నుండి వెలికి తీసి అప్పగించగా రెవెన్యూ భూముల బదిలీ పద్దతిలో అక్కడి ట్రావెలర్స్ బంగళా ముసాఫర్ వీధిని కలెక్టరేట్లోకి కలుపు కోగా లేని మున్సిపల్ స్థలంలో షాపింగ్ నిర్మాణ తీర్మానం ఎలా చేస్తారని ప్రభుత్వం పరిశీలన చేయాలని రమణ రాజు సూచించారు.

Comments