దేశంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా కూడా 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారమే జరుగుతుంది.


అవనిగడ్డ, కృష్ణా జిల్లా (ప్రజా అమరావతి);


*22(ఏ)1 కింద ఉన్న నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం.*


*నిషేధిత భూముల జాబితా నుంచి డీ నోటిఫై చేసిన భూముల  క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు అందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:* 


*మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం...*

చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహిడుతుడికి ముందుగా చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


ఈ రోజు దేవుడి దయతో అవనిగడ్డలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడం వలన ఎటువంటి కష్టాలను చూస్తున్నామో మనందరికి తెలుసు. భూయాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. రికార్డుల్లో కూడా ఆ వివరాలు పక్కాగా లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మనమంతా చూస్తున్నాం. దానికి సంబంధించిన బాధితులమే మనమంతా. ఈ వివాదాల వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు, నిరాహారదీక్షలు సైతం చేస్తున్నారు. అయినప్పటికీ సమస్యలు కొలిక్కి రాకపోవడం వల్ల అనేకరకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. 


*గత పాలకులు పట్టించుకోలేదు...*

మానసికవేదన, ఆర్ధికంగా కలుగుతున్న నష్టం మన కళ్లెదుటనే కనిపిస్తున్నా కూడా... గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సమస్యలు రైతులకు ఉండకూడదు, ఇటువంటి సమస్యలు రాకూడదు, అందరికీ మంచి జరగాలి, వారి భూములు వారు అమ్ముకోలేని పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు, అటువంటి ఇబ్బందులు ఉండకూడదని గతపాలకులెవ్వరూ ఆలోచన చేయలేదు.


*వందేళ్ల తర్వాత భూముల రీ–సర్వే...*

ఈ రోజు వంద సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో భూముల రీ సర్వే చేపట్టి ఒక మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నాం.

ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 15వేల మందిని సర్వేయర్లను రిక్రూట్‌ చేశాం. 

కోట్లరూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. ఆధునిక టెక్నాలజీ.. కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను తీసుకొచ్చి, విమానాలను, హెలీకాప్టర్‌లను సైతం ఉపయోగిస్తున్నాం. డ్రోన్లను, రోవర్లను కొనుగోలు చేసి వాటిని కూడా ఉపయోగిస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానానికి సంబధించిన పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసి, ఉపయోగిస్తున్నాం. వంద సంవత్సరాలకు పూర్వం జరిగిన సర్వేకు మరలా రీ–సర్వే చేయించి, హద్దులను మళ్లీ పూర్తిగా మార్కు చేసి, రికార్డులను అన్నింటినీ కూడా పూర్తిగా అప్‌డేట్‌ చేసి, సబ్‌డివిజన్‌లు, మ్యుటేషన్స్‌ అన్ని పక్కాగా చేపట్టి, ఇటువంటి సమస్యలున్న చోట అంటే షరతులు గల పట్టాలు, ఇవే కాకుండా చుక్కలు భూములు, అనాధీనం భూములు ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న అనేక భూములకు ఒక పరిష్కారం చూపాలని ఈ రోజు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు పడటం మొదలైంది.



*రీ– సర్వే మహా యజ్ఞం...*

ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షగా చేస్తున్నాం. గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా రీసర్వే చేసి భూములు, స్తిరాస్ధుల యజమానులకు స్పష్టంగా సరిహద్దులు చూపడంతోపాటు, ఈ మహాయజ్ఞంలో భాగంగా హక్కు పత్రాలను కూడా ఇవ్వబోతున్నాం. 


*నవంబరులో 1500 గ్రామాలలో...*

17వేల పై చిలుకు గ్రామాలకు గాను, నవంబరు నెలలో 1500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి, హద్దులు రీమార్క్‌ చేసి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూహక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెడుతున్నాం. ఇవన్నీ పూర్తి చేసి అక్కడే సబ్‌రి స్ట్రార్‌ కార్యాలయం కూడా మన గ్రామంలో ఉండేటట్టుగా అడుగులు వేస్తున్నాం. కారణం మన గ్రామంలో సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు ఉంటే మన భూములు వేరేవాళ్లు వాళ్ల పేరుమీద మన రికార్డులు మార్చి, తిక్కతిక్క చేష్టలు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. అటువంటి వాటిని మనం వెంటనే అడ్డుకోగలుగుతాం. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు కాబట్టి.... ఒక గొప్ప యజ్ఞంగా నవంబరు మాసం నుంచి ఏకంగా 1500 గ్రామాల్లో మొదలుపెట్టే ఈ కార్యక్రమం ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను యాడ్‌ చేసుకుంటూ వెళ్తూ.. వచ్చే ఏడాది (2023) చివరినాటికి మొత్తం 17వేల పై చిలుకు గ్రామాల్లో పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. 


*వచ్చే ఏడాది ఆఖరుకు సంపూర్ణంగా రీ సర్వే...*

రాష్ట్రంలో జరుగుతున్న ఒక పెద్ద యజ్ఞం వచ్చే ఏడాది చివరి నాటికి సత్ఫలితాలనిచ్చే విధంగా పూర్తవుతుంది. ఈ దిశలో మరో అడుగే ఈ రోజు మనం తీసుకుంటున్న నిర్ణయం. షరతులుగల పట్టా పేరుతో నిషేధిత జాబితాలో అంటే 22 (ఏ) 1 లో ఉన్న ఈ భూముల సమస్యలను పరిష్కరిస్తూ.... రైతులకు క్లియరెన్స్‌ పత్రాలను జారీ చేస్తున్నాం.


*22 వేల మంది రైతులకు హక్కు పత్రాలు...*

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాలలో 22(ఏ) నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపినట్టవుతుంది. దీనివల్ల ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న 22,042 మంది రైతులకు, వారి భూమి మీద వారికి హక్కు కల్పించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజుతో ఆ కార్యక్రమం జరుగుతుందన్న గొప్ప శుభవార్త నా రైతన్నలందరికీ తెలియజేస్తున్నాను. 


వేలాదిమంది రైతులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయి. ఇలాంటి వారంతా ఇక రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేదు, కోర్టులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, 22(ఏ) 1 కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపించడం, వాటిని డీనోటిఫై చేసే గొప్ప నిర్ణయం ఈరోజు జరుగుతుంది. ఈ మేరకు షరతుల గల పట్టా

భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితానుంచి డీనోటిఫై చేస్తూ.. ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం ఇదివరకే జరిగింది.ఈ నిర్ణయం వల్ల ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రమే చూసుకుంటే... 10,019 మంది రైతన్నలకు 15,791 ఎకరాలకు ప్రయోజనం కలిగే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. వీరందిరకీ యాజమాన్య హక్కులు అందుతాయి. మనం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇన్నాళ్లు ఆ భూములను సాగు చేసుకుంటున్న ఆ రైతులకు వాటిపై పూర్తిగా సర్వ హక్కులు లభిస్తాయి. ఇక పై ఆ రైతులు వాళ్ల భూములు అమ్ముకోవచ్చు. వేరొకరు కొనుక్కోవచ్చు. లేదా ఆ రైతన్నలు ఆ భూములను వాళ్ల పిల్లలకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. అన్ని రకాల హక్కులు కూడా ప్రతి రైతన్నకు ఇవాల్టి నుంచి అందుబాటులోకి వస్తాయి.ఈ భూహక్కు కార్యక్రమంలో భాగంగానే వారికి పక్కాగా హక్కు పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 


*ఇక్కడే మరికొన్ని విషయాలను కూడా మీ అందిరితో పంచుకోవాలి.* 


దేశంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా కూడా 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారమే జరుగుతుంది.


నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో 1930 వరకూ షరతుగల భూముల పట్టాల పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరగాయి. వాటిని రకరకాల కేటగిరీ భూములు మెట్ట అని, తరి అని, సాగులో ఉన్న మెట్టభూములు అని, డొంక అని, వంక అని, వాగు అని, గ్రామ కంఠం అని, ప్రభుత్వ భూములు అని.. అనేక రకాల కేటగిరీల్లో 1932 నుంచి 1934 మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్‌మెంట్‌ బుక్స్‌లో చేర్చారు.

పట్టా దారుల భూముల వివరాలను, సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932–34 నుంచి రైతన్నలు వారి తరాలు, వారి పిల్లల తరాలు, తర్వాత వారి మనవళ్ల తరాలు అనుభవిస్తున్నారు.


*గత ప్రభుత్వ నిర్వాకం వల్ల....*

2014లో ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం మన ఖర్మకొద్దీ వచ్చింది. 2016వరకూ రిజిస్ట్రేషన్, టైటిల్‌ డీడ్స్‌ ఇలా అన్నీ ఈ భూములకు సంబంధించిన  లావాదేవీలు కొనసాగాయి. పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వడం వల్ల వారికి పంటరుణాలతో పాటు ఇతర రుణాలు కూడా వారికి గతంలో అందేవి. కానీ 2016 మే నెలలో గత ప్రభుత్వం... జిల్లాల వారీగా ఈ భూములు అన్నింటినీ కూడా నిషేధిత జాబితా 22–ఎ లో చేర్చుతూ... రకరకాల జీవోలు జారీచేశారు.

అప్పటినుంచీ రైతన్నలకు ఇబ్బందులు మొదలయ్యాయి.

అందుకే ఆ భూములు అన్నింటినీ కూడా డీ నోటిఫై చేసి ఆ రైతన్నలకు మేలు చేసే కార్యక్రమం జరుగుతోంది.


*రైతులకు మేలు చేస్తూ...*

2016 మే నెలకు ముందున్న హక్కులను మళ్లీ ఆ రైతన్నలకు పునరుద్ధరిస్తున్నాం. 80 సంవత్సరాలకు పైగా ఆ రైతులకున్న హక్తులను కాలరాస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దుచేస్తూ రైతులకు మేలు చేస్తున్నాం.

22,042 కుటుంబాలకు మంచి చేస్తూ...  35,669 ఎకరాలకు సాగుచేసుకుంటున్న రైతులకు ఈ నిర్ణయం ద్వారా ఈరోజు నుంచి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను.


మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా భూ యాజమాన్య హక్కుల విషయంలో వివాదాలన్నింటికీ ముగింపు పలికి, అనాధీన భూములు, చుక్కల భూములు, ఇనామీ భూములన్నింటికీ పరిష్కారం చూపిస్తూ, ఈ వివాదాలన్నింటికీ ముగింపు పలుకుతూ నిజమైన హక్కుదారులకు మేలు చేస్తున్నాం.



*దేశానికే మోడల్‌గా రీ–సర్వే...*

 దీనికోసం భూముల రిజిస్ట్రేషన్, ల్యాండ్‌ రికార్డుల నిర్వహణలో దేశానికే ఒక మోడల్‌గా చూపించే దిశగా... వంద సంవత్సరాల కిందట జరిగిన సర్వే కార్యక్రమాన్ని మరలా  రీసర్వే  చేయించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వివాదాలకు తావులేకుండా, వాటిన్నింటినీ పరిష్కరిస్తూ... గ్రామస్ధాయిలోనే ప్రజలందరికీ మంచి చేసే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.


మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ భూ లావాదేవీల్లో భూతద్దంతో వెదికినా కూడా ఒక్క పొరపాటు కూడా లేకుండా, సవ్యంగా పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.


*ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు కూడా మీ ముందుంచుతున్నాను.* 

అందరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను.

ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన చెడు ఏంటి? అన్నది ఆలోచన చేయాలి. ఆ రోజైనా, ఈ రోజైనా గిరిజనులకు సైతం ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చింది గతంలో దివంగత నేత వైయస్సార్‌ అయితే, ఇవాళ ఇచ్చింది మీ జగనన్న ప్రభుత్వం. అసైన్డ్‌ గాని, ఆర్వోఎఫ్‌ఆర్‌గాని, ఆలయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్న ప్రభుత్వం.. మన అందరి ప్రభుత్వం. అసైన్డ్‌ భూముల విషయలో గత ప్రభుత్వం వంచిస్తే.. ఈరోజు మంచి చేసింది మన ప్రభుత్వం.


*రైతు మనసు తెలిసిన ప్రభుత్వమిది...*

గత ప్రభుత్వం రైతుల భూములను ఎలా దోచుకోవాలని ఆలోచిస్తే, అవి రైతులకు ఎలా ఇవ్వాలని అని ఆరాటపడుతూ, ఆలోచన చేస్తున్నది మన ప్రభుత్వం.

మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం. పేదవాడి బాగోగులు మనస్సులో పెట్టుకుని అడుగులు వేస్తున్న ప్రభుత్వం. ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను వివక్షలేకుండా, అవినీతిలేకుండా అందిస్తున్న ప్రభుత్వం మనది. 

మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ, భగవద్గీతగానూ భావించి 98శాతం హామీలను 3ఏళ్ల 4 నెలల కాలంలోనే నెరవేర్చిన ప్రభుత్వం మనది.


*గ్రామం రూపురేఖలు మార్చుతున్న ప్రభుత్వమిది...*

 మీ కళ్ల ఎదుటే కనిపిస్తున్న మార్పులను మీ గ్రామంలోనే చూడండి. గ్రామ సచివాలయాలు, అందులో 10 మంది ఉద్యోగులైన మన పిల్లలకు మనకు సేవలు అందిస్తూ.. ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి యాభై ఇళ్లకూ వాలంటీర్‌ కనిపిస్తున్నారు. ప్రతి అడుగులోనూ మనకు మంచిచేస్తూ చేదోడు, వాదోడుగా ఉన్నాడు.

వివక్ష చూపకుండా, లంచాలు అడగకుండా ఒకటోతారీఖను సూర్యోదయం అయిన వెంటనే, అది ఆదివారమైనా, పండుగనాడు అయినా తెల్లవారు జామునే ఇంటికి వస్తాడు. గుడ్‌మార్నింగ్‌ చెప్పి పెన్షన్‌ డబ్బు చేతిలో పెట్టి వెళ్తాడు.

ఒక గొప్ప వ్యవస్థ మన గ్రామంలో కనిపిస్తోంది.


*రైతు భరోసా కేంద్రాలు....*

ఆదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే చాలు.. విత్తనం నుంచి పంట అమ్మకం అవరకూ కూడా రైతులకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తోంది. మన కళ్లెదుటనే పారదర్శకంగా ఇ–క్రాప్‌ విధానం జరుగుతుంది. ప్రతి జాబితా సోషల్‌ ఆడిట్‌కోసం పెడుతున్నారు. విత్తనాల నుంచి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ వరకు కల్తీ లేకుండా గ్రామంలో ప్రతిదీ కూడా మన ఇంటివద్దకే అందిస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో రైతన్నలకు అన్నిరకాలుగా అండదండలు అందిస్తూ కనిపిస్తోంది. 


*విలేజ్‌ క్లినిక్‌...*

మరో నాలుగు అడుగుల ముందుకేస్తే విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. అక్కడ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రాక్టీసనర్‌ అక్కడే ఉంటూ 24 గంటలూ అందుబాటులో ఉంటూ 67 రకాల మందులిస్తూ.. 14 రకాల డయోగ్నిస్టిక్‌ టెస్టులు చేస్తూ.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా పనిచేస్తున్నారు. 


*ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌* 

ఈ నెల్లోనే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిషు మీడియం స్కూళ్లు... కనిపిస్తాయి. నాడు – నేడుతో స్కూళ్ల రూపు రేఖలను మార్చాం. డిజిటల్‌ లైబ్రరీలు కూడా కట్టబోతున్నాం. మన గ్రామాలలో మన పిల్లల కోసం వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మన కళ్ల ఎదుటే గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి. 


*గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాపై ఆలోచన చేయమని అడుగుతున్నాం.*

కాబట్టే మనందరి ప్రభుత్వం తరపున మన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలోనూ మీ ఇంటికి ఈ మేలు చేశామని, సవినయంగా, వినయ పూర్వకంగా చెప్పుకుంటూ గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి అక్క చెల్లెమ్మ ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు. 


ఒకవైపు ఇంతమంచి చేస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతుంటే...   చెప్పుకోవడానికి ఏమీ లేనివాళ్లంతా, ప్రజలకు ఏ మేలూ గతంలో చేయని వారంతా ఈ రోజు ఏం చేస్తున్నారో 

గమనించండి.


*వీధి రౌడీలను మించి....*

వాళ్లు చేసిన మంచేమిటో చెప్పుకోలేరు. ఈ రోజు  వాళ్లని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే  బూతులు తిట్టడంలో ఏ స్థాయిలోకి వెళ్లిపోయారంటే... బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. వీధి రౌడీలు కూడా అటువంటి మాటలు మాట్లాడుతారో లేదో నాకు తెలియదు.

నాయకులుగా పేరు చెప్పుకుంటున్నవారు టీవీల్లో చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది... ఇలాంటి వారు మన నాయకులా? అని అనిపిస్తుంది.


అవ్వాతాతలు గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. దత్తపుత్రుడితో, దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో మనం అంతాకూడా చూస్తున్నాం.


*వీళ్లా నాయకులు....*

మనం ఎవ్వరికీ కూడా అన్యాయం చేయకుండా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా 3 రాజధానులు వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెప్తుంటే, కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందీ? మీరూ చేసుకోండి అని ఏకంగా టీవీల్లో నాయకులుగా చెప్పుకుంటున్నవారు ఈమాదిరిగా మాట్లాడితే.. ఆలోచన చేయమని చెప్తున్నాను.

రేపు పొద్దున మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన కూతుళ్లు పరిస్థితి ఏంటి? మన చెల్లెమ్మల  పరిస్థితి ఏంటి? 

రేపు పొద్దును ప్రతి ఒక్కరూ కూడా నాలుగోళ్లో, ఐదేళ్లో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే... ఒకసారి కాదు, రెండుసార్లుకాదు, మూడుసార్లు, నాలుగుసార్లు అని మొదలుపెడితే, మీరూ చేసుకోండని చెబుతూ పోతే.. వ్యవస్ధ ఏం బతుకుతుంది ?  ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటివారా? మనకు నాయకులు. ఆలోచన చేయండి.

ఇలాంటి వారు మనకు దశదిశ చూపగలరా? అని ఆలోచన చేయమంటున్నా.


*వెన్నపోటుదారులంతా కలిసి....*

ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని వారంతా? వెన్నుపోటు దారులంతా? ఎన్నికల సమయంలో రంగు రంగులతో కూడిన మేనిఫెస్టోలుఇస్తారు. వాగ్దానాలు చేస్తారు.

ఎన్నికలు అయిన తర్వాత వాగ్ధానాలు మర్చిపోతారు. మేనిఫెస్టోని తీసుకుని చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ప్రజలు ప్రశ్నిస్తారేమోనని మేనిఫెస్టోని కనిపించకుండా చేస్తారు.  కనీసం వెబ్‌సైట్లలో కూడా పార్టీ మేనిఫెస్టో కనిపించని విధంగా పరిపాలన చేశారు. 


*ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది యుద్ధం...*

ఇలాంటి వారు దుష్టచతుష్టయంలా ఏర్పడ్డారు.

ఇలాంటి వారు కలిసి, కూటములు కడతారు. కలిసి కూటములు కట్టి.. మీ బిడ్డ మీద యుద్ధంచేస్తారంట?. మన ప్రభుత్వం, మీ ప్రభుత్వంమీద యుద్ధంచేస్తారంట?. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతున్నారంటే.. ఆశ్చర్యం అనిపిస్తుంది.


వివక్ష, లంచాలు లేకుండా నేరుగా 87శాతం ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడూ మంచి చేయని పచ్చరంగు పెత్తందారులకూ నిరంతరం పోరాటం జరుగుతుంది. మరో 18–19 నెలలు పాటు రోజూ  ఇలాంటివన్నీ కనిపిస్తాయి. 


*నాతో నన్ను ఆశీర్వదించే ప్రజలున్నారు....*

నాకు వారి మాదిరిగా ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, ఇలాంటివారు తోడుగా ఉండకపోవచ్చు.

నాకు దేవుడి దయ, దీంతోపాటు మన పాలనలో మంచి జరిగింది అని ఆశీర్వదించే ప్రజలు ఉన్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, ప్రతి అవ్వా, తాత వీరంతా తోడుగా నాకు నిలబడతారన్న నమ్మకం నాకుంది. 

వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, మీడియాను, దత్తపుత్రుడిని, వారి పొత్తులను నమ్ముకుంటే.... నేను దేవుడి దయను నమ్ముకున్నాను. మా అక్కచెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను.


*ఇది మంచికి– మోసానికీ జరుగుతున్న యుద్ధం.*

ఇది పేదవాడికీ – పెత్తందారులకీ మధ్య జరుగుతున్న యుద్ధం. సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలనుకున్నవారికీ, సామాజిక న్యాయంచేస్తున్న వారికీ జరుగుతున్న యుద్ధం.

ఇలాంటి ఈ యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు మరింత ఎక్కువరాబోయే రోజుల్లో కనిపిస్తాయి. మిమ్నల్ని కోరుతున్నాను, మీ అందరితో వేడుకుంటున్నా... వీటిని నమ్మవద్దు. ఈ మోసాలను నమ్మొద్దు. ఈ కుతంత్రాలను నమ్మొద్దు. ఈ పేపర్లను చదవొద్దు.  ఈ టీవీలను చూడొద్దు. 


*మీకు మంచి జరిగింగా లేదా అన్నదే కొలమానం...*

మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగింది అంటే.. జగనన్నకు తోడుగా నిలవండి. 

మీ బిడ్డకు వాళ్లమాదిరిగా హంగులు, ఆర్బాటాలు లేకపోయినా ఇన్ని టీవీలు, పేపర్లు లేకపోయినా.. మీ బిడ్డకు మీ గుండెల్లో స్థానం ఉంటే చాలు. ఇదే మీ బిడ్డ కోరుకుంటాడు. 

దేవుడి దయతో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 


*చివరిగా...*

అవనిగడ్డకు సంబంధించి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ మాట్లాడుతూ కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ సహకారాలు కావాలని అడిగారు. అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు ఖర్చవుతుందని అడిగారు. ఆ నిధులు మంజూరు చేస్తున్నాను. కృష్ణానది కుడి, ఎడమ కరకట్ట, మరియు సముద్రపు కరకట్ట పటిష్టం చేయడానికి దాదాపు రూ.25 కోట్లు ఖర్చవుతుందన్నారు.. అది కూడా మంజూరు చేస్తున్నాను. పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటు చేయాలన్నారు. దానికి రూ.8.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. అవనిగడ్డలో  కంపోస్ట్‌ యార్డు తరలించడానికి మరో రూ.5–10 కోట్లు ఖర్చువుతుందన్నారు. దీనిని కూడా ప్రజలకు మేలు చేయాడనికి మంజూరు చేస్తున్నాను. అవనిగడ్డలో సీసీ డ్రైన్ల ఏర్పాటుకు మరో రూ.10–15 కోట్లు, అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని అడిగారు. దీన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని మంజూరు చేస్తాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments