2022-23 సంవత్సరాన్ని బనానా ఇయర్ గా ప్రకటించడం చాలా సంతోషం



నెల్లూరు, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): 2022-23 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ బనానాగా (అరటిసాగు సంవత్సరంగా) డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 గురువారం మధ్యాహ్నం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు వర్చువల్ గా నిర్వహించిన సమావేశానికి నెల్లూరులోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన అరటి సాగుపై ప్రత్యేక పరిశోధనలు చేసేందుకు 2022-23 సంవత్సరాన్ని బనానా ఇయర్ గా ప్రకటించడం చాలా సంతోషం




గా ఉందన్నారు. మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలలో, సామాజిక ఆర్థిక అభివృద్ధిలో అరటికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అరటి ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండగా, మన రాష్ట్రం 58.35 లక్షల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత రెండేళ్లలో మన రాష్ట్రంలో అరటి సాగు విస్తారంగా పెరిగిందని, టిష్యూ కల్చర్, బిందు సేద్యం విధానాలను పాటించడం వల్ల ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో అరటి విస్తీర్ణం, దిగుబడి భారీగా పెరిగిందన్నారు. అరటి సాగు పై రైతుల్లో, విస్తరణ అధికారుల్లో, విద్యార్థులు, పరిశోధకుల్లో, ప్రత్యక్షంగా పరోక్షంగా అరటి పంటలో వాటాదారులకు మరింత అవగాహన కల్పించడానికి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 సంవత్సరాన్ని ఈయర్ ఆఫ్ బనానా గా ప్రకటించడం పట్ల విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.  రాష్ట్రంలో అరటి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతులు పెంచడానికి ఈ సంవత్సర కాలంలో విశ్వ విద్యాలయం వారు చేపట్టే అనేక పరిశోధనలు దోహదపడగలవని మంత్రి ఆకాంక్షించారు. 

 ఈ వర్చువల్ సమావేశంలో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ శ్రీ జానకి రామ్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments