తాడేపల్లి (ప్రజా అమరావతి);
పల్నాడు జిల్లాను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలి...
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్.
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల మేరకు పల్నాడు జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించి, పరిష్కారాలు చూపించి, కొత్త జిల్లాలు ఏర్పడ్డాక అభివృద్ధి పనులు చేపట్టడంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పురోగతికి వేగాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జిల్లా పర్యటనకు వచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. జిల్లాల పర్యటనను పల్నాడు జిల్లాతో ప్రారంభించటం తనకు ఎంతో ఆనందంగా ఉందని వివిధ సూచికల్లో జిల్లా పనితీరు బాగుందని అంటూ ఇంకా పనితీరును మెరుగు పర్చుకుంటే దేశ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి పల్నాడు జిల్లా ఎదుగుతుందని ఆయన అన్నారు.
21- 10-2022 న అంటే శుక్రవారం నాడు పల్నాడు జిల్లాను కమిషనర్ కోన శశిధర్ పర్యటించిన సందర్భంగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పర్యటించి, పరిశీలించిన వివిధ పనులు సంతృప్తి కరంగా ఉన్నాయని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అంతరాలు ఏమైనా ఉన్నాయా..? సమస్యల పరిష్కారానికి సూచనలు ఇవ్వటానికే క్షేత్ర పర్యటన చేపట్టామని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పథకాల్లో దేశంలోనే ప్రధమ స్థాన౦లో రాష్ట్రాన్ని నిలబెట్టడమే ఉద్దేశ్యంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. జొన్నలగడ్డ పంచాయతీలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర౦లో పల్నాడు బ్రాండ్ తో తయారు చేస్తున్న సేంద్రీయ ఎరువులు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని, ఇదే విధంగా జిల్లా మొత్తం సేంద్రీయ ఎరువులు తయారు చేసి దేశంలోనే ఆదర్శ జిల్లాగా పల్నాడును నిలబెట్టాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
ప్రతి మూడు నెలకొకసారి ఇలాంటి పర్యటనలు ఉంటాయని, ప్రతి ఒక్కరు బాధ్యత ఎరిగి పనిచేయాలని, ప్రాధాన్యత కార్యక్రమాలను మరింత బాధ్యతతో చేపట్టాలని, జిల్లాలోని గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని అన్నారు. ప్రతి ఎంపిడీఓ సచివాలయ సందర్శన చేసినప్పుడు వారి నివేదికలను సచివాలయంలో ఉంచాలని, ఉపాధి హామీ పనులకు సంబంధించి డిబిటి, క్లోజింగ్ ఆఫ్ వర్క్స్, పచ్చదనం పెంపు, అమృత్ సరోవర్ పథకాల అమలులో వినియోగిస్తున్న వివిధ యాప్ లు, జిజిఐ, సామాజిక తనిఖీ వంటి పలు అంశాలను కూలంకషంగా చర్చించి, మండలస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.
పంచాయతీరాజ్ అమలు పరుస్తున్న జగనన్న స్వచ్చ సంకల్పం గురించి మాట్లాడుతూ చెత్త సేకరణకు ప్రతి ఇంటికి 2 డస్ట్ బిన్ లను ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే దానికి ఆమోద౦ ఇచ్చారని ఆయన తెలిపారు. ముఖ్యంగా కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని, వాటి జాప్యాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనులైన భవన నిర్మాణాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటన్నిటిని పూర్తి చేయాలని, వర్షాలు తగ్గాక వైయస్సార్ జలకళ పనుల వేగాన్ని పెంచుతామని, ఈ పర్యటన వల్ల అనేక మంచి విషయాలు తెలిసాయని, అలాగే అక్కడక్కడ కొన్ని లోపాలు దృష్టికి వచ్చాయని, ఈ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలోని వివిధ అంశాలకు కమిషనర్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని మరింత మెరుగ్గా ఉపాధి హామీ పథకాన్ని అమలుపరుస్తామని, రాబోయే 35-45 రోజుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో జిల్లాని ఆదర్శవంతంగా నిలబెడతామని, స్పందనలో వచ్చే ప్రతి అంశాన్ని ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని, సమీక్ష సమావేశంలో వచ్చిన సూచనలనుసరించి లక్ష్యాలను సాధించే దిశగా సమిష్టిగా పని చేస్తామని అన్నారు.
ఉపాధి హామీ సంచాలకులు పి చిన్న తాతయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక విప్లవాత్మకమైన శాఖ అని ఈ సమావేశంలో సమీక్షించుకున్న విషయాలన్నింటినీ వ్యూహాత్మకంగా అమలుపరిచి నిధులు దుర్వినియోగం కాకుండా సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలను సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి పల్నాడు జిల్లాలోని మండలాన్ని పర్యటించి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలను పరిశీలించి పరిశీలించిన అంశాలను ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు.
పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా కమిషనర్ కోన శశిధర్ చిలకలూరిపేట మండలం కావూరు గ్రామపంచాయతీ లోని గ్రామ సచివాలయంను సందర్శించి సిబ్బంది లోని ప్రతి ఒక్కరితో మాట్లాడి పనిచేస్తున్న విధానం నిర్వహిస్తున్న రిజిస్టర్ లను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాడు- నేడు కింద ఉపాధి హామీ నిధులను వినియోగించి పనులు చేపట్టి రూపురేఖలు మార్చుకున్న పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడి, బైజూస్ యాప్ ను ఆవిష్కరించారు.
అలాగే కొండ కావూరు గ్రామపంచాయతీలో వైయస్సార్ జలకళ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు రైతులతో మాట్లాడారు. ఉప్పలపాడు గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా 70 ఎకరాలలో మామిడి తోటలు వేయించుకున్న రైతులతో మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను అవలంబించి ఎప్పటికప్పుడు నూతన పంట రకాలను తెలుసుకుంటూ రైతు భరోసా కేంద్రాల ద్వారా లభించే సేవలను వినియోగించుకొని వారి ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బందితో మాట్లాడి పన్నుల వసూలు వివరాలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్థాయిలో ఇంత మంది అధికారులు ఉన్న వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదని, వారి సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కమిషనర్ శశిధర్ అన్నారు. ఇంకా వేతనదారులు, క్షేత్ర సిబ్బంది, మేట్లతో మాట్లాడి పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో పల్నాడు జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, విజయ లాజరస్, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ నాగార్జునసాగర్, పల్నాడు డ్వామా పిడి జోసెఫ్ కుమార్, సీఈవో శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు, డిపిఓ డిఎల్ డిఒలు, ఎంపీడీవోలు, క్లస్టర్ ఏపీడీలు, పంచాయతీరాజ్, ఆర్ డబ్లూఎస్ కు చెందిన ఇంజనీర్లు ఈసీలు ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment