*పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన కలెక్టర్
*
పార్వతీపురం/సాలూరు, అక్టోబర్ 12 (ప్రజా అమరావతి): పాఠశాల సందర్శనకు వెళ్లారు... మధ్యాహ్న భోజనం పరిశీలించారు... ఆహార నాణ్యత తనిఖీ చేయాలని నిర్ణయించారు... వెంటనే విద్యార్థులతో పాటు తను ఒక పళ్ళెంలో ఆహారాన్ని తీసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత, విద్యాబోధన వివరాలు తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధ వారం సాలూరు మండలంలో పర్యటించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రం, ఇళ్ళ నిర్మాణాలు తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సాలూరులో మునిసిపల్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులు పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండటంతో అటుగా అడుగులు వేశారు. విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచి చూశారు. విద్యార్థులతో మాట్లాడి చక్కని విద్యను అభ్యసించాలని సూచించారు. ఇష్టంతో చదవాలని అన్నారు. నాడు నేడు క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో రూ.111 కోట్లతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. రెండవ విడతలో ఇతర పెద్ద జిల్లాల కంటే ఎక్కువగా రూ.152 కోట్లతో పనులు మంజూరు చేసామని ఆయన పేర్కొన్నారు. పనుల నిర్వహణలో రాజీ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతలో చేపట్టిన పనులలో పెయింటింగ్ సంతృప్తికరంగా చేయాలని, రెండవ విడత చేపట్టిన తరగతి గదులలో వెలుతురు బాగా ఉండేటట్లు చూడాలని ఆయన ఆదేశించారు. మరుగు దొడ్లను కూడా నిశితంగా పరిశీలించారు.
సాలూరు మండలం పెద్ద బోరబండలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పజెప్పనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. గ్రామ సచివాలయం సమీపంలో మురుగు నీరు నిల్వ ఉండడాన్ని పరిశీలించి వెంటనే పారిశుధ్య చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ను ఆదేశించారు. డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసి గ్రామ సచివాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.
అనంతరం సాలూరు గుమడాం అర్బన్ జగనన్న కాలనీ లే అవుట్ ను పరిశీలించారు. కాలనీల్లో 1508 ఇళ్లు మంజూరు అయిందని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం తెలియజేయగా లబ్ధిదారుల జియో ట్యాగింగ్ , ఇ కె వై సి శత శాతం పూర్తి చేయాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా తాత్కాలిక నీటి సరఫరా ట్యాంక్ లను త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కాలనీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.డి.వి.ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. రఘురాం, తాసిల్దార్ వి.రామస్వామి, పంచాయితీ రాజ్ శాఖ ఏఈ లోకనాధం, ఎంపీడీఓ పార్వతీ, ఉప తాసిల్దార్ సంతోష్, గ్రామ సచివాలయం సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.
addComments
Post a Comment