గ్రామీణ సాధికారత కోసం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి

 

నెల్లూరు, అక్టోబర్ 4, (ప్రజా అమరావతి)


భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్న గాంధీ మహాత్ముని మాటల స్ఫూర్తితో, గ్రామీణ  సాధికారత కోసం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాల్సి


న అవసరం ఉందని, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, ప్రైవేట్ రంగం చొరవ అత్యంత ఆవశ్యకమని గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం, ప్రభగిరి పట్నం వద్ద ఉన్న కిసాన్ క్రాఫ్ట్ సెంటర్ ను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడ యంత్రాలు తయారు చేస్తున్న విధానం మొదలుకుని ప్యాకింగ్ గా బయటకు వచ్చే వరకూ ఉన్న పూర్తి ప్రక్రియను ఆయన పరిశీలించారు. తమ సొంత గ్రామానికి దగ్గర గ్రామీణ సాధికారతకు నిదర్శనంగా చక్కని పరిశ్రమను ఏర్పాటు చేయడం, అందులో స్థానిక గ్రామీణ యువతకు ఉపాధిని కల్పించడం ఆనందదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి అభినందలు తెలియజేశారు. 

తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గ్రామీణ సడఖ్ యోజన గురించి ప్రస్తావించిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, గ్రామీణ ప్రాంతాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి క్రమంలో వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత పెంచాలని సూచించారు. వ్యవసాయం రంగం అభివృద్ధి చెందాలంటే అందులో యాంత్రికీకరణ, సాంకేతికతల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే ఇప్పటికే వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న మానవ వనరుల ఉపాధికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ చొరవ పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కిసాన్ క్రాఫ్ట్ లాంటి సంస్థలు యంత్రాలను తయారు చేయడమే కాకుండా, రైతులకు ఈ దిశగా అవగాహన పెంచాలని, ముఖ్యంగా పురుగుమందులకు ఆస్కారం లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల మీద కూడా రైతుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఓ రైతుబిడ్డగా కిసాన్ క్రాఫ్ట్ సెంటర్ ను పరిశీలించానని, ఇందులో ప్రతి యంత్రం రైతులు అవసరాలకు తగినట్లుగా ఉందన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పొదలకూరులోని ఓ గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు కావడం గ్రామీణ సాధికారతకు నిదర్శనమని తెలిపారు. సంస్థ మరింత చొరవ తీసుకుని ఇతర గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు ఇది తమ సంస్థ అనే నమ్మకం కలిగేలా వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.



ఈ కార్యక్రమంలో  కిసాన్ క్రాఫ్ట్ చైర్మన్ శ్రీ రవీంద్ర అగర్వాల్, డైరెక్టర్ శ్రీమతి సారిక అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ  అంకిత్  చిటాలియా, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ మలోల, జడ్పీ సి.ఈ.ఓ శ్రీ చిరంజీవి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు, తహసీల్దార్ శ్రీ ప్రసాద్, ఎం.పి.డి.ఓ శ్రీ నగేష్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Comments