ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం విధి.

 *ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం విధి.


*


*విద్య ద్వారానే జ్ఞానం.*


*విద్య లేని ఆచరణలు స్వీకరించ బడవు.*


*ఇస్లామిక్ డిప్లమో కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనాబ్ అబ్ధుల్ హఫీజ్ ఉమ్రీ*


విజయవాడ (ప్రజా అమరావతి);

ధార్మిక విద్యను నేర్చుకోవడం ప్రతి ఒక్క ముస్లిం పై విధిగావించబడిందని జనాబ్ అబ్ధుల్ హఫీజ్ ఉమ్రీ  అన్నారు. నగరంలోని భవానీపురం సుమయ మస్జీద్ లో ఏడాది పాటు నిర్వహించనున్న ఇస్లామిక్ డిప్లొమో కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో జనాబ్ అబ్ధుల్ హఫీజ్ ఉమ్రీ  ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.  తరచూ మనమంతా ఇస్లాంకు సంబంధించిన ప్రసంగాలు వింటూ ఉంటామని, అయితే వినడంతో పాటు నేర్చుకోవాలన్నారు.  ధార్మిక జ్ఞానాన్ని కలం ద్వారా బంధించాలన్నారు.  అల్లాహ్ మొట్ట మొదట హజ్రత్ ఆదమ్ (అ.సం) సృష్టించి సమస్త వస్తువుల పేర్లను నేర్పించారని గుర్తు చేశారు.  ప్రవక్త (స.అ.సం) పై వహీ అవతరించినప్పుడు సైతం...ఇఖ్రా (పఠించు)  నీ ప్రభువు పేరుతో అంటూ సందేశం వచ్చిందన్నారు. జ్ఞానం ఎంతో ఉన్నతమైనదని, విద్య ద్వారా మాత్రమే జ్ఞానాన్ని ఆర్జించవచ్చునన్నారు. విద్య నేర్చుకోవడం తోపాటు ఆచరించాలని,  విద్యలేని ఆచరణలు అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడవన్నారు. ఇస్లాం మూల విషయాలను తెలుసుకుని ఆచరించనంతవరకు ఏ వ్యక్తి ముస్లిం కాజాలడని చెప్పారు. ధార్మిక విద్య ద్వారానే సంపూర్ణ ముస్లింగా మారగలమన్నారు. ముస్లింలలో చాలామంది  ధార్మిక విద్య నేర్చుకోని కారణంగా  సృష్టికర్తను వదలి సృష్టిపూజ చేస్తున్నారన్నారు. ఖురాన్ హదీసుల జ్ఞానం నేర్చుకోకపోవడం వల్లనే సమాధుల పూజలో మునిగిపోతోన్నారని చెప్పారు. ధర్మ జ్ఞానం నేర్చుకోవడం వల్ల అజ్ఞానం, మూఢనమ్మకాలు దూరం కావడంతో పాటు ఆచరణల  ద్వారా స్వర్గ జీవితం దక్కుతుందన్నారు.  జనాబ్ నజీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ... సాధారణంగా ముస్లింలు ఎవరు ఏమి చెప్పారో వినేందుకు మాత్రమే  సభలకు, సమావేశాలకు  వెళుతోన్నారని,  ధార్మిక పండితులు  చెప్పిన వాటిని ఆచరించడం కోసం వింటున్నా మా? అనే విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెప్పడం- వినడం ఎంతో సునాయాసం అని... ఆచరించడమే ఎంతో కష్టమన్నారు. ప్రసంగాలు కేవలం మనిషిని ఉత్తేజ పరుస్తాయని, అయితే జ్ఞానం మనిషిని పూర్తిగా మార్చివేస్తుందన్నారు. మనలో మార్పు రాలేదంటే జ్ఞానం అర్థం చేసుకోలేదని గ్రహించుకోవాలన్నారు. చేసిన  పొరపాట్లను సరి చేసుకోవాలన్నా ,  తప్పులను  సరిదిద్దుకోవాలన్నా  ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి ఉండాలన్నారు. సైకాలజీ ప్రొఫెసర్ జనాబ్  ముహిబ్బుర్రహ్మాన్ మాట్లాడుతూ... ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి ఆంగ్ల భాష నేర్చుకుంటున్నారని, తల్లిదండ్రులు కూడా ఎంతో వజ్ర సంకల్పంతో వారిని ప్రోత్సహిస్తోన్నారని చెప్పారు. ప్రాపంచికంగా బాగానే సెటిల్ అయినా... ఇది తాత్కాలికమైన జీవితం అనే విషయాన్ని వారు గ్రహించాలన్నారు.  తాత్కాలిక  జీవితం కోసమే ఇంత కష్ట పడుతున్నప్పుడు ... శాశ్వత స్వర్గ జీవితం కోసమై అరబ్బీ భాషలో అవతరించిన ఖురాన్ ను ఎందుకు చదువ లేకపోతోన్నామని ప్రశ్నించారు.  ఖురాన్-హదీసుల పఠనంలో ఏమైనా సందేహాలు వస్తే విద్వాంసులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. నేడు ప్రపంచంలో 50 ముస్లిం దేశాలు ఉన్నాయంటే...అది కేవలం ప్రవక్త (స.అ.సం), సహాబాలు చేసిన ఆనాటి కష్టమని, తల్లిదండ్రులు ఈ విషయాలను పిల్లలకు తెలియజేయాలన్నారు. ముస్లింలకు గ్రంథ జ్ఞానం కచ్చితంగా ఉండాలని లేకుంటే ఊహల్లో తేలుతూ నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు.  విజయవాడ జమాఅతె అహ్లె హదీస్ అమీర్ జనాబ్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ.... నేడు విద్యార్థులు ప్రపంచంలో బ్రతకడానికే చదువులు నేర్చుకుంటున్నారని, తమ చదువులు సభ్య సమాజం కోసం ఉపయోగపడాలనే  తపన ప్రతి ఒక్క విద్యార్థి కలిగి ఉండాలన్నారు. తన చిన్నతనంలో అరబ్బీ నేర్చుకునేందుకు ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడినని, నేడు అల్లాహ్  దయవల్ల ప్రతి   మస్జీదులో డబ్బులు లేకుండా....సకల సౌకర్యాలు కల్పించి మరీ  ఇస్లాం ధర్మ విద్యను నేర్పిస్తోన్నారని గుర్తు చేశారు.  షైతాన్ ధార్మిక విద్య నేర్చుకోవాలనే వారి మనసులను దూరం చేస్తోన్నాడని చెప్పారు. ధార్మిక విద్య  నేర్చుకోవాలనే తాపత్రయం కలిగిన కొందరు ముస్లిం   విద్యార్థులు   శిక్షణా  తరగతులకు హాజరై విజయవంతంగా పూర్తి చేసుకుని  ఆణిముత్యాల్లా బయటకు వస్తోండటం అభినందనీయమన్నారు. జనాబ్ ఇలియాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం  పెద్దలు, విద్యార్థినీ, విద్యార్థులు  పాల్గొన్నారు. 

Comments