మారుమూల గిరిజన ప్రాంతాలకూ వైద్య సేవల విస్తరణ

 


*మారుమూల గిరిజన ప్రాంతాలకూ వైద్య సేవల విస్తరణ*


*కొత్త గా 108 అంబులెన్స్ లు 20, 

 మొబైల్ మెడికల్ యూనిట్(104)

వాహనాలు 20

 జెండా ఊపి  ప్రారంభించిన మంత్రి

మంత్రి విడదల రజిని*


అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలకూ వైద్యసేవలను విస్తరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య , వైద్య విద్య శాఖా మంత్రి విడదల రజిని చెప్పారు.   గురువారం  మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలో వున్న వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్స్ లు, మొబైల్ మెడికల్ యూనిట్((104) వాహనాలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అందించిన సేవలు ముందుగా గుర్తుకు వస్తాయని, తరువాత ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి తండ్రికన్నా మిన్నగా ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు.  గతంలో నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య సేవలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.  ఈప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 20 అంబులెన్స్ లు (108) , మరో 20 మొబైల్ మెడికల్ యూనిట్ (104) వాహనాలను అందిస్తోందని చెప్పారు. 2020 నాటికి ఉన్న 336 పాత అంబులెన్స్ (108)వాహనాలకు అదనంగా మరో 412 వాహనాలను, వైద్య పరికరాలను ప్రభుత్వం రు.97 కోట్ల వ్యయంతో అందిస్తోందని చెప్పారు.   ఇప్పుడు మొత్తం 748 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో వున్నాయని, వీటితో  రోజుకు దాదాపు 3,200 కేసులు అటెండ్ అవుతూ గణనీయంగా సేవలందిస్తున్నామని వివరించారు.  ఇందులో భాగంగానే గిరిజన ప్రాంతాలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు అక్కడ ప్రస్తుతం వున్న అంబులెన్స్ లతో పాటు అదనంగా  వాహనాలు ప్రారంభించామని చెప్పారు. అదే విధంగా 2020 నుండి ఇప్పటి వరకూ మొత్తం రు.110 కోట్ల వ్యయంతో 656 మొబైల్ మెడికల్ వాహనాలు (104), వైద్య పరికరాలను కొత్తగా కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోజుకు దాదాపు 25,000 మందికి పైగా ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు అందచేస్తూ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె వివరించారు.  ఈ వాహనాలు, అందులోని పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం ఏడాది కాలంలో రు.300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.  నాడు- నేడు పథకంలో ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.16000 కోట్లతో చర్యలు చేపట్టిందని చెప్పారు.  గిరిజన ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కోసం 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.  అదే విధంగా పార్వతీ పురం  మన్యం, పాడేరు ప్రాంతాలలో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో వైద్య కళాశాలలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని  ఆమె చెప్పారు.  ఇందులో భాగంగానే గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రస్తుతం వున్న మొబైల్ మెడికల్ వాహనాలకు (104) అదనంగా మరో 20 కొత్త వాహనాలను కేటాయించామన్నారు. మొత్తం రు.8.14 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ 40 వాహనాలను గిరిజన ప్రాంతాలకు కేటాయించామన్నారు. 2020 సంవత్సరంలో 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాల ద్వారా దాదాపుగా రు.40 కోట్ల విలువైన మందులను ప్రజలకు అందించామని, ప్రస్తుతం ఈ విలువ రు.50 కోట్ల పైమాటేనని ఆమె వివరించారు. త్వరలో ప్రారంభించే ఫ్యామిలీ ఫిజీషియన్  పథకంలో భాగంగా రు.67 కోట్లతో 282 మొబైల్ మెడికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నామని ఆమె చెప్పారు.   ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె నివాస్, ఎపిఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎం మురళీధరరెడ్డి, ఆరోగ్యశ్రీ సిఇఓ హరీందర్ ప్రసాద్, అదనపు సిఇఓ మధుసూధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments