మాతృభూమి సేవ పట్ల అంకిత భావం, ప్రజా జీవితంలో వారి సుదీర్ఘ ప్రస్థానం, అన్నింటికీ మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న వారి అలుపెరుగని ఉత్సాహం

 

నెల్లూరు (ప్రజా అమరావతి);

శ్రీ వెంకయ్య నాయుడు గారి వ్యక్తిత్వం, మాతృభూమి సేవ పట్ల అంకిత భావం, ప్రజా జీవితంలో వారి సుదీర్ఘ ప్రస్థానం, అన్నింటికీ మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న వారి అలుపెరుగని ఉత్సాహం


ఆదర్శనీయమైనవని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా అన్నారు. 


సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్ లో  జరిగిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఆత్మీయ అభినందన సభలో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఘనంగా సన్మానించారు.  ఈ సంధర్బంగా లోక్ సభ స్పీకర్ శ్రీ ఓంబిర్లా మాట్లాడుతూ, భారతదేశ ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినా   శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు  గారు తమదైన విలక్షణ మార్గంలో ప్రజలకు దగ్గరగానే ఉన్నారుని,  నేటికీ వారి మార్గదర్శకత్వం, సలహాలు, సూచనలను స్వాగతిస్తూ, వారి ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉన్నానన్నారు. నేను  లోక్ సభ స్పీకర్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో వారు అందించిన సలహాలు, సూచనలు మరువలేనీవని, అప్పటి రాజ్యసభ ఛైర్మన్ గా వారు చేసిన సూచనలు, తర్వాతి కాలంలో నాకెంతగానో ఉపయోగపడ్డాయన్నారు. శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు దశాబ్ధాలుగా వేలాది మంది పార్టీ కార్యకర్తల జీవితాలను ప్రభావితం చేసి, వారిని రాజకీయాల్లో ఉన్నతమైన విలువలు కలిగి ఉండే నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ప్రముఖ నాయకుల్లో ఒకరని అన్నారు. 

శ్రీ వెంకయ్యనాయుడు గారి దిశానిర్దేశకత్వంలో సాగుతున్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఎంతో ప్రత్యేకమైనదని, ఉచిత శిక్షణ, ఉచిత భోజన వసతితో సాగే ట్రస్ట్ కార్యకలాపాలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ట్రస్ట్ నిబద్ధత వెనుక అంత్యోదయ మార్గంలో వరుసలో చివరి వ్యక్తి వరకూ సేవలు విస్తరించాలన్న శ్రీ వెంకయ్యనాయుడు గారి దార్శనికత, నిబద్ధత, అంకిత భావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్నారు. ఈరోజు ప్రారంభించిన డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇది రైతులకే కాదు, అన్ని రంగాల్లో యువత ఉపాధి పొందడానికి ఎంతో సహాయ పడుతుందన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగు మందుల పరిమాణాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఇలాంటి సాంకేతిక వినియోగం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని,  రైతులు ఆర్థికంగా మరింత బలపడేందుకు సహాయపడుతుందన్నారు. తద్వారా ఆత్మనిర్భర మార్గంలో అన్నదాతలు పయనించగలరు. ఈ విధంగా అనేక కీలకమైన రంగాల్లో సాధికారతకు పెద్ద పీట వేస్తూ, భారతదేశ అభివృద్ధిలో స్వర్ణభారత్ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. శ్రీ వెంకయ్యనాయుడు గారితో పాటు వారి కుమార్తె శ్రీమతి దీపావెంకట్, కుమారుడు శ్రీ హర్షవర్ధన్, ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులు ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిస్వార్థంగా పాటుపడటం అభినందించదగిన అంశం.

సన్మాన గ్రహీత, భారతదేశ  మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నెల్లూరు ఆత్మీయ అభినందనోత్సవంలో భాగంగా మిత్రులు ఏర్పాటు చేసిన ర్యాలీకి ప్రజల నుంచి లభించిన స్పందన మరువలేనిదని,  నన్ను గుండెల్లో పెట్టుకున్న వారి అభిమానం నిరుపమానమైనదని అన్నారు. నెల్లూరులో రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర మిత్రులు నిర్వహించిన ఆత్మీయ అభినందనోత్సవంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పురప్రముఖులను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులకు అభినందనీయమన్నారు. పార్టీలకతీతంగా  జిల్లా ప్రజలు చూపిన  ఆధరాభిమానం,  అందించిన సహకారం,  తోడ్పాటు వల్లనే నేను ఈ రోజు  ఉన్నతమైన స్థానలో నిలిచానని అన్నారు.  ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించటం, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడమే నన్ను ఉన్నత స్థాయికి చేర్చిందని,  నా ఇన్నేళ్ళ అనుభవం నుంచి నా సూచన ఒక్కటే... ఇతర పార్టీల వారు మన ప్రత్యర్థులే గానీ శత్రువులు కాదు అని భావించాలని శ్రీ వెంకయ్యనాయుడు తెలిపారు.


రాజ్య సభ సభ్యులు  శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిలో దేశానికి సేవ చేసి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాకు విచ్ఛేసిన సింహపురి ముద్దు బిడ్డ, శ్రీ వెంకయ్య నాయుడు గారి "ఆత్మీయ అభినందనోత్సవం" కార్యక్రమంలో గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారితో పాటు కలసి పాల్గొనడం  చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారు,  శ్రీ ఓం బిర్లా గారు అసాధారణ వ్యక్తులు మరియు వారిరువురు రాజ్యసభ మరియు లోక్‌సభకు అధ్యక్షత వహిస్తూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారన్నారు. మహోన్నత వ్యక్తి అయిన శ్రీ వెంకయ్య నాయుడు గారి సన్మానం సందర్భంగా ఇక్కడికి విచ్ఛేసిన శ్రీ ఓం బిర్లా గారికి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.  శ్రీ వెంకయ్య నాయుడు గారు విద్యార్ధి నాయకునిగా, రాజకీయ నాయకునిగా మరియు వక్తగా ప్రాముఖ్యతను పొందారని, వారి అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాలు మరియు రాజకీయ క్రియాశీలత ఆయన రాజకీయ జీవితాన్ని ముందుకు నడిపించాయి మరియు జై ఆంధ్ర ఉద్యమంలో అది నిరూపితమైనది. వెంకయ్య నాయుడు గారి రాజకీయ జీవితం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రారంభమైందని, ఆయన 1978 మరియు 1983లో రెండుసార్లు ఎన్నికయ్యారు. వెంకయ్య నాయుడు గారు 1998, 2004 & 2010లో కర్ణాటక నుండి మూడుసార్లు మరియు 2016లో రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యునిగా , 2002 నుంచి 2004 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని, కేంద్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం & పట్టణ పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి మరియు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి "ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన" వంటి అనేక పథకాలకు ప్రసిద్ధి చెందారని  శ్రీ వేమిరెడ్డి తెలిపారు.  శ్రీ వెంకయ్య నాయుడు గారు చేసిన అనేక మంచి కార్యక్రమాల వెనుక మొత్తం ఆలోచన సమాజంచే చిన్నచూపు చూసే పేద మరియు అణగారిన వర్గాల అవసరాలను తీర్చడం గురించేనని, తదనంతరం మనందరికీ గర్వకారణంగా, శ్రీ వెంకయ్య నాయుడు గారు భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా, 11 ఆగస్టు, 2017న పదవి చేపట్టడం జరిగినది. ఇది మన దేశానికి రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అని శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి అన్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారు స్వాతంత్ర్యం తరువాత జన్మించిన మొదటి భారత ఉపరాష్ట్రపతి అని తెలిపారు. భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు 2017 నుండి 2022 వరకు అత్యంత ప్రశంసనీయమైన రీతిలో తన పదవికి వన్నె తేవడం మనమందరం చూసామన్నారు. రాజ్యసభలో సభ్యులు తమ ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్‌గా, ప్రత్యేకించి పార్లమెంటరీ వ్యవహారాలలో తనకున్న అపార అనుభవంతో సభా కార్యక్రమాలను నిర్వహించిన తీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది మరియు భావి తరాల నాయకులకు ఆయన ఒక బెంచ్ మార్క్‌గా నిలిచారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి సన్మానం గురించి చెప్పినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు సంతోషించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, శ్రీ వెంకయ్య నాయుడు గారి పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారని తెలియజేశారు. మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా పరిశ్రమల రంగంలో ఆంధ్రప్రదేశ్‌ని దేశానికే మోడల్‌గా మార్చేందుకు  చేస్తున్నారని, సంక్షేమం మరియు అభివృద్ధి ని రెండు కళ్ళుగా భావించి ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. నవరత్నాలు, గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్‌లు మరియు వాలంటీర్ల వ్యవస్థ వంటి అతని ఐకానిక్ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసించబడ్డాయి మరియు అనేక ఇతర రాష్ట్రాలు తమ సొంత రాష్ట్రాల్లో అమలు చేయడం కొరకు వాటి గురించి అధ్యయనం చేయడం మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి  గారి కృషి వలన జాతీయ స్థాయిలో గత మూడు సంవత్సరాలుగా "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, అంతే కాకుండా, 2021-22లో 11.43 శాతంతో “స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి” (GSDP) రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. జనవరి నుండి జూలై-2022 వరకు దేశంలో మొత్తం రూ.1,71,285 కోట్ల పెట్టుబడులకు వ్యతిరేకంగా, మన ఆంధ్రప్రదేశ్ రూ.40,361 కోట్ల షేర్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గ్రామీణాభివృద్ధిలో శ్రీ వెంకయ్య నాయుడు గారు సాధించిన విజయాలు, మహాత్మా గాంధీ ఊహించిన విధంగా ప్రజలకు సేవ చేయడానికి అనేక సంస్కరణలను తీసుకువస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో సహా ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. వెంకయ్య నాయుడు గారి మేధో సంపద యావత్ భారతదేశానికి ఉపయోగపడాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మనస్పూర్తిగా కోరుకుంటున్నానని శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. 


ఈ కార్యక్రమంలో   నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి, శాసన మండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి, శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, నెల్లూరు గ్రామీణ, కావలి, సూళ్ళూరుపేట, గూడూరు శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రేయి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, శ్రీ కిలివెటి సంజీవయ్య, శ్రీ వరప్రసాద్ రావు, నుడా ఛైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకా నాథ్, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎపి స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మెత్తుకూరు చిరంజీవి రెడ్డి, ఎపి స్టేట్ ఫైనాన్స్  కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ  మేరుగు మురళి  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి దొంతు శారద,  స్వచ్చా ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పోనకా దేవసేన, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్.  కుర్మానాధ్, నెల్లూరు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీమతి హరిత, ఆర్డీవో  శ్రీ మలోల, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments