ఉత్తరాంధ్రలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా సత్వర పూర్తికి చర్యలు




ఉత్తరాంధ్రలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా సత్వర పూర్తికి చర్యలు


వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయి    

వంశధార నిర్వాసితులకు అదనపు లబ్దికి 217 కోట్ల రూ.లు మంజూరు

వంశధార-నాగావళి అనుసంధాన పనులు 70శాతం పూర్తి జూన్ లోగా మిగతావిపూర్తి

మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ 38శాతం పనులు పూర్తి-వచ్చే జూన్ ఖరీఫ్ నాటికి మిగతా పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు

మద్దు వలస రెండో దశ పనులు 79శాతం పూర్తి వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి

సర్ధార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టు 83శాతం పనులు పూర్తి

17వేల 411 కోట్ల రూ.లతో డా.బిఆర్ అంబేద్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకానికి ఆమోదం పనులు ప్రారంభం

     రాష్ట్ర జలవనరులశాఖ ఇఎన్సి నారాయణరెడ్డి

అమరావతి,11 అక్టోబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగునీటి రంగం అభివృద్ధికి ఈప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చి వివిధ దశల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సియంగా ఉన్నప్పుడు జలయజ్ణం కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది.అయితే గత ప్రభుత్వం సరైన ప్రణాళికాబద్ధ విధానంలో నిర్వహించక పోవడంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేక పోయాయని పేర్కొన్నారు. ప్రజాధనం భారీగా ఖర్చు చేయడంతోనే ప్రయోజనం లేదని కాని ఖర్చు చేసిన ప్రతి రూపాయి వలన ప్రజలకు చేకూరిన లబ్ది ముఖ్యమని అన్నారు.ఆవిధంగా చూస్తే గత ప్రభుత్వం అధిక మొత్తంలో అనగా సుమారు 1500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చెల్లాచెదురుగా ప్రణాళికా రహితంగా పనులు చేసి ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెట్టి వారి అసమదీయులకు ఆయాచిత లబ్ది చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు.కాని ఈప్రభుత్వం ప్రతి పైసా ప్రజాధనాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వారికి అధిక లబ్దిని కలిగించేందుకు అత్యంత జాగ్రత్తగా ఖర్చు చేసి ప్రతి ప్రాజెక్టు నుండి ఆశించిన ప్రజా ప్రయోజనాలను చేకూరుస్తోందని చెప్పారు.ఆయా ప్రాజెక్టులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సకాలంలో పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

వంశధార రెండో దశ:

వంశధార ప్రాజెక్టు రెండో భాగం రెండో దశకు సంబంధించి ఇప్పటికే 90శాతం పనులు పూర్తయి 27వేల 800 ఎకరాలకు ఇప్పటికే నీటి వసతి లభించిందని నారాయణ రెడ్డి చెప్పారు.శ్రీకాకుళం జిల్లాల్లోని 9మండలాల్లోని 225 గ్రామాలకు ఈప్రాజెక్టుతో లబ్ది  చేకూరు తుందని అన్నారు.అంతేగాక ఈప్రాజెక్టు నుండి 1.2 టియంసిల నీటిని హీర మండలం రిజర్వాయర్ ద్వారా కిడ్నీవ్యాధి పీడిత ఉద్దానం ప్రాంతానికి మంచినీటి సరఫరాకు అవకాశం కలుగుతుందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల ప్రయోజనాలను సరిగ్గా పట్టించుకోనందున వారికి అదనపు ప్రయోజనం కల్పించేందుకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 217 కోట్ల రూ.లను మంజూరు చేశారని చెప్పారు.అంతేగాక ఈపధకం ప్రయోజనాలను త్వరగా పొందేందుకు వీలుగా వంశధార నదిపై గొట్ట బ్యారేజి నుండి ఎత్తిపోతల పధకం ద్వారా హీర మండలం రిజర్వాయర్ కు 12 టియంసిలు నీటిని అందించేందుకు 176 కోట్ల రూ.లు మంజూరు అయ్యాయని వివరించారు.

వంశధార-నాగావళి అనుసంధానం:

దీని ఆయకట్టులోని 18వేల 527 ఎకరాల స్థిరీకరణకు మరియు 4మండలాల్లోని 38 గ్రామాల పరిధిలోని 5వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి జరుగుతోందని ఇంజనీర్-ఇన్-చీఫ్ నారాయణ రెడ్డి చెప్పారు.ఇందుకు గాను ఈప్రభుత్వం వచ్చాక 145 కోట్ల రూ.లకు అనుమతిచ్చిందని ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని మిగతా పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

గజపతినగరం బ్రాంచి కాలువ పనులు:

తోటపల్లి కుడి ప్రధాన కాలువ 97.70 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల మేర కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లోని 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గజపతినగరం బ్రాంచి కాలువ పనులను చేపట్టడం జరిగిందన్నారు.43 శాతం పనులు పూర్తి అయ్యాయని,భూసేకరణలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల మిగిలిన పనులు ముందుకు సాగలేదన్నారు.మిగతా పనుల నిర్వహణకు రూ.137 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, ఈ పనులను కూడా 2024 జూన్ నాటికి పూర్తి చేసి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుందని నారాయణ రెడ్డి మీడియాకు వివరించారు. 

తారకరామతీర్థసాగరం:

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజిని నిర్మించి 2.75 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ మూడు మండలాల్లోని 49 గ్రామాల్లో 16,538 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు  ఈ ప్రాజక్టు పనులను చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.ఇప్పటికే 59 శాతం పనులు పూర్తికాగా మిగతా పనులను కూడా పూర్తి చేసేందుకు రూ.198 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించిందని త్వరలో రివర్సు టెండర్ల ద్వారా గుత్తేదారులకు పనులను అప్పగించడం జరుగుతుందని అన్నారు.ముందస్తుగానే పునరావాస కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో చేసేందుకుఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇఎన్సి నారాయణ రెడ్డి తెలిపారు.

డా.బి.ఆర్.అంబేద్కర్ ఉత్తరాంద్ర సుజల స్రవంతి……

ఉత్తరాంధ్ర  ప్రాంతంలోని విశాఖపట్నం,విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో సాగు,తాగునీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు నీటిని అందించే లక్ష్యంతో  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రూ.7,214 కోట్ల అంచనా వ్యయంతో డా.బి.ఆర్.అంబేద్కర్ ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని తెలిపారు.ఈ ప్రాజక్టు ద్వారా ఆయా జిల్లాలోని 8 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు,విశాఖపట్నం నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు 23.44 టీఎంసిల నీటిని త్రాగునీటికి, పరిశ్రమలకు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశింపబడిందన్నారు.ఈ ప్రాజెక్టు తొలి దశలో రెండు ప్రాకేజీల్లో పనులను చేపట్టేందుకు గత ప్రభుత్వం 2017-18 లో  రూ.2,022 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసి గుత్తేదారుకు పనులు అప్పగించినప్పటికీ, ఎటు వంటి పనులు జరుగలేదన్నారు.2019 లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిందన్నారు.దశాబ్ద కాలంనాటి అంచనా ధరలతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లదని భావించి నూతన అంచనా వ్యయం రూ.17,411 కోట్లకు కేబినెట్ ఆమోదం లభించగా ఫేజ్-2 క్రింద రెండు ప్యాకేజీలను చేపట్టడం జరిగిందన్నారు.పోలవరం ఎడవ ప్రధాన కాలువ 63వ కిలోమీటరు నుండి 102వ కి.మి.పొడవున శ్రీకాకుళం జిల్లా గడిగెడ్డ వరకూ నీటిని తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టడమైందన్నారు.7,500 ఎకరాల భూ సేకరణలో ముందున్నామని, 60 శాతం మేర డిజైన్లకు కూడా అనుమతి లభించిందన్నారు.ఎంతో వేగవంతంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ముందుకు వెళుతున్నాయని ఆయన తెలిపారు.

మద్దువలస రెండోదశ పనులు….

మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.5 టీఎంసీల నీళ్లు అందించాలనే లక్ష్యంతో  రెండో దశ పనులను చేపట్టడం జరిగిందన్నారు.జి.సిగడాం, పొందూరు,లావేరు,ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు.ఇప్పటికే 79 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.మిగిలిన పనులను పాత కాంట్రాక్టరు వివిధ కారణాలతో చేయలేకపోవడం వల్ల రూ.26.9 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందన్నారు.వచ్చే ఖరీఫ్ నాటికి ఈ పనులను అన్నింటినీ పూర్తి చేసే దిశగా చర్యలను చేపట్టడమైందని ఇఎన్సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

తోటపల్లి బ్యారేజి:

విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మించి తద్వారా 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పాటు కొత్తగా 1,31,000 ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు ఈ ప్రాజెక్టు పనులను చేపట్టడం జరిగిందన్నారు.ఈ ప్రాజెక్టు ప్రాధమిక అంచనా  వ్యయం రూ.1127.58 కోట్లతో చేపట్టగా, 83 శాతం పనులను పూర్తి అయ్యాయని చెప్పారు.  మిగతా పనులను రెండు ప్యాకేజిలుగా విభజించి రూ.123.21 కోట్లతో చేపట్టడం జరిగిందని, ఈ ప్రాజెక్టు పనులను  2023 జూన్ నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్:

మహేంద్రతనయ నది మీద చాప్రా గ్రామం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి 1200 క్యూసెక్కుల నీటిని రేగులపాడు రిజర్వాయర్ కు తరలించే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు.2.1 టీఎంసీల నీటి నిల్వచేసే  ఈ ఆఫ్ షోర్  జలాశయం ద్వారా 24,600 ఆయకట్టు భూమికి సాగు అందించడం జరుగుతుందన్నారు.భూసేకరణ మరియు పునరావాస ప్రక్రియల్లో  ఇబ్బందులతో ఈప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు.అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను  అన్నింటిని పరిష్కరించి మిగిలిన పనులను  రూ.854.25 కోట్లతో చేపట్టేందుకు అనుమతిని ఇవ్వడం జరిగిందన్నారు.త్వరలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులను చేపట్టి  2024 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు.

      

Comments