స్పందనకు .... స్పందించి..



*స్పందనకు .... స్పందించి..


.*


పార్వతీపురం (ఇజ్జకాయ, గుమ్మలక్ష్మిపురం మండలం), అక్టోబరు 26 (ప్రజా అమరావతి): స్పందనలో అందిన ఆర్జీకి స్పందించారు పంచాయతీరాజ్ పర్యవేక్షణ ఇంజినీర్ డా.ఎం.వి.జి.కృష్ణాజి. బుధవారం స్వయంగా గుమ్మ లక్ష్మీ పురం మండలం ఇజ్జకాయ గ్రామానికి బయలుదేరారు.  దబ్బాలపాడు వరకు కారులో వెళ్లారు. ఇజ్జకాయ వెళ్లాలంటే కారు వెళ్లదు. దబ్బలపాడు నుండి ఇజ్జకాయ వరకు 3.50 కిలోమీటర్లు. వెంటనే అచ్చట ఉన్న ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై గ్రామాన్ని చేరుకున్నారు. రహదారి, గ్రామ పరిస్థితులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్పందనకు ఇజ్జకాయ గిరిజన గ్రామస్తులు కిల్లక రాజు, ప్రభాకర రావు, భీమా రావు బృందం వచ్చి గ్రామానికి దబ్బలపాడు నుండి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇజ్జకాయ రహదారి దరఖాస్తును పంచాయతీరాజ్  పర్యవేక్షణ ఇంజినీర్ కు అందిస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


*రహదారి అవసరం*


"మాకు రహదారి కావాలి. రహదారి లేక అనేక ఇబ్బందులను గ్రామం ఎదుర్కొంటుంది. రహదారి వస్తే సమస్యలు తీరుతాయి" - ఇది ఇజ్జకాయ గ్రామస్తుల విజ్ఞప్తి. సరైన రహదారి సౌకర్యం లేక విలువైన ప్రాణాలు కోల్పోతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రమ దానంతో వేసిన రహదారి రాళ్ళు తేలి దుర్భరంగా తయారయ్యిందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉందని వివరించారు. రేషన్ తీసుకోవాలి అంటే కొండ దిగి బీరుపాడు వెళ్ళాలని, అనారోగ్యం ఉన్న వ్యక్తిని లేదా గర్భిణీలకు ఆసుపత్రికి ప్రసవానికి తీసుకువెళ్లాలన్నా దబ్బలపాడు వరకు డోలి మీద తీసుకు వెళ్లి గుమ్మలక్ష్మి పురంకు వాహనం మీద తీసుకు వెళ్ళాలని వివరించారు. రహదారి సౌకర్యం లేక ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇజ్జకాయ గ్రామంలో 70 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. రహదారి సౌకర్యం కోసం అనేక సార్లు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించారు. చివరగా 2016లో  శ్రమదానంతో గ్రావెల్ రోడ్ నిర్మించుకున్నారు. కొంత మేర రహదారి సౌకర్యం ఏర్పడిందని ఆనందం కలిగింది. ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. తరచూ వర్షాలు పడటంతో రహదారి కొద్ది రోజులలో కొట్టుకుపోయి మరల మామూలుగా మారింది. మరల స్పందనకు దరఖాస్తులు ప్రారంభం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత స్పందనకు మరల దరఖాస్తులు చేయడంతో కలెక్టర్ స్పందించి పరిశీలనకు ఆదేశించారు. మోటారు సైకిల్ పై గ్రామానికి చేరుకున్న ఇంజినీరింగ్ అధికారిని చూసి గ్రామస్తులు ఆనందించారు. ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదని మా రహదారి పరిశీలనకు రావడం సంతోషదాయకమని చెప్పారు. 


 గ్రామస్తులతో డా.ఎం.వి.జి.కృష్ణాజి మాట్లాడుతూ గొయ్యిపాడు నుండి ఇజ్జకాయ రోడ్ మంజూరు అయిందన్నారు. దానిని పూర్తి చేయుటకు ముందుగా చర్యలు తీసుకుంటామని కృష్ణాజి చెప్పారు. దబ్బలపాడు నుండి ఇజ్జకాయ వరకు 3.50 కిలోమీటర్లు మంజూరు ప్రయత్నిస్తామని చెప్పారు. గ్రామాన్ని బాగుచేసుకోవాలనే ఆలోచన ఉందని దానిని పక్కాగా అమలు చేయాలని కృష్ణాజి కోరారు. సామాజిక దృష్టితో గ్రామస్తులు ఉండటాన్ని కొనియాడారు.

Comments