*ఉల్లాసంగా దసరా ఉత్సవాలు
*
పార్వతీపురం, అక్టోబర్ 3 (ప్రజా అమరావతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంగరంగ వైభోగంగా ఆసాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి. ఉత్సవాలు సోమ వారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వినోదాత్మకంగా సాగాయి. జానపద కళారూపాలు ధింసా నృత్యం, తప్పెట గుళ్ళు కోలాటంతో పాటు, ఢీ - రంగం - ఆటా బృందం ఫేం రాజేశ్వరి బృందం లోటస్ డాన్స్, ఫెదర్ డాన్స్, జట్టు సంస్థ శాస్త్రీయ నృత్యాలు, జబర్దస్త్ టీం సభ్యులు రాజమౌళి, తన్మయి, గెడ్డం నవీన్ ల వినోద కార్యక్రమాలు, ఆంధ్ర, రాజస్థాన్, కేరళ తదితర వస్త్ర ధారణ ఫ్యాషన్ షో కార్యక్రమాలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఉత్సవాలలో చిన్నారుల వినోద కార్యక్రమాలు - బంగీ రన్నింగ్, ఆర్చెరి, డార్ట్ గేమ్, గన్ షాట్, బాల్ పూల్, ట్రంపోలైన్, స్లైడింగ్ బౌన్స్ ఏర్పాటుతో చిన్నారుల కేరింతలతో నిండాయి.
నారాయణపురం చేనేత వస్త్ర ప్రదర్శన, పొందూరు ఖాది వస్త్ర ప్రదర్శన, ఐటీడీఏ పరిధిలోని వి డి వి కె ఉత్పత్తులు, డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయశాల, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన, వెలుగు విభాగం ఏర్పాటు చేసిన చెక్క బొమ్మలు, వెదురు బొమ్మలు, సీతంపేట ఐటిడిఏ వారి ఆధ్వర్యంలో సవర ఆర్ట్స్ ప్రదర్శన, మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ఉత్పత్తులు, గోగునారు ఉత్పత్తులు, ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన నర్సరీ, రుచికరమైన తినుబండారాలు, ఆహార పానీయాలు ఆకర్షించాయి. పార్వతీపురం పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించారు. జిల్లాగా ఏర్పడిన అనంతరం మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో ప్రజలు హర్షద్వానాలు చేశారు.
addComments
Post a Comment