గుడివాడలో యువ నాయత్వం వైపు టీడీపీ అధిష్టానం అడుగులు



 *- గుడివాడలో యువ నాయత్వం వైపు టీడీపీ అధిష్టానం అడుగులు*


 *- కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహం* 

 *- శిష్ట్లా లోహిత్ కు రాష్ట్రస్థాయిలో పదవీ బాధ్యతలు* 

 *- అధినేత చంద్రబాబును మెప్పించిన శిష్ట్లా లోహిత్*



గుడివాడ, అక్టోబర్ 12 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంగా భావించే గుడివాడలో ఈసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం యువ నాయకత్వం వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణాజిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు. నియోజకవర్గాల వారీగా సొంత సర్వేను కూడా నిర్వహించారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ ముఖ్యులతో కూడా చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. మొత్తం 16 నియోజకవర్గాలు ఉండగా వీటిలో 11 నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గుడివాడ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపికను సస్పెన్స్ లో పెట్టింది. 2000వ సంవత్సరంలో గుడివాడ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు. 2004 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి కొడాలి నానికి టీడీపీ సీటును కేటాయించారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నాని ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున పోటీ చేసిన కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. 2004వ సంవత్సరం తర్వాత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ నుండి బయటకు వచ్చి పీఆర్పీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మళ్ళీ టీడీపీలో చేరడం జరిగింది. 2014లో టీడీపీ అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు పోటీ చేసినప్పటికీ ఎమ్మెల్యే కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి టీడీపీ సీటును అధిష్టానం దేవినేని అవినాష్ కు కేటాయించింది. రావికి టీడీపీ సీటు ఇచ్చినా, కొత్త అభ్యర్ధి తరపున రావి ప్రచారం చేసినా గుడివాడలో మాత్రం తెలుగుదేశం పార్టీకి వరుస పరాజయాలు తప్పలేదు. మరోవైపు గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెడుతూ వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టేందుకు ఎప్పటి నుండో చంద్రబాబు పావులు కదుపుతూ వస్తున్నారు. దీనిలో భాగంగానే యువ నాయకత్వం వైపు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గుడివాడ టీడీపీ సీటు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా గుడివాడ పట్టణానికి చెందిన శిష్ట్లా లోహిత్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ పదవులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు అప్పగించారు. ఈ రెండు పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన శిష్ట్లా లోహిత్, చంద్రబాబును మెప్పించగలిగారు. దీంతో చంద్రబాబు జిల్లాల పర్యటనల్లోనూ శిష్ట్లా లోహిత్ పాల్గొంటూ కార్యకర్తల సంక్షేమంపై తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు సద్వినియోగమయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ పర్యటనల్లోనూ శిష్ట్లా లోహిత్ పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ టీడీపీ సీటును ఆశిస్తున్న శిష్ట్లా లోహిత్ ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ అధిష్టానం దృష్టిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకు సీట్లు కేటాయిస్తామని టీడీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో శిష్ట్లా లోహిత్ కు పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు అవసరమైన ప్రోత్సాహాన్ని టీడీపీ అధిష్ఠానం అందిస్తోంది. గుడివాడ టీడీపీ సీటు విషయంలో ఈ అంశాలు శిష్ట్లా లోహిత్ కు కలిసి రానున్నట్టు స్పష్టంగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments