విద్యుత్‌ రంగంలో ఎన్నో మార్పులు


నేలటూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా పర్యటన*


*ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి*.


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, ఈ రోజు నిజంగా ఒక చారిత్రాత్మక నేపధ్యం, థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ మూడో యూనిట్‌ ఈ రోజు జాతికి అంకితం చేయడం మనమంతా గర్వించాల్సిన విషయం. అనేక సందర్భాలలో ఈ ప్రాంతానికి నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజి కోసం ప్రతి ఎన్నికలలో వాగ్ధానం చేయడం, అమలుచేయకపోవడం జరిగింది. చంద్రబాబుకు ఎప్పుడూ ఒక అలవాటు ఉంది, ప్రజలకు మూడు నామాలు పెడతాడు కాబట్టి ఏదైనా మూడు విడతలు అంటారు. ఎన్నికల ముందు మూడు విడతల్లో ప్యాకేజి అని చంద్రబాబు 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తాం, వైఎస్‌ఆర్‌సీపీ వారిని పక్కనపెట్టండి అని వారికి కూడా ఇవ్వలేదు. మేం అధికారంలోకి రాగానే మీరు ఎదురుచూస్తున్న నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజ్‌ తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇస్తామన్నాం, కేవలం 7 పంచాయతీలు ఎంపిక చేస్తే 20 పంచాయతీలు, పోర్టుకు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ ఇస్తామని చెప్పినట్లుగానే, సీఎంగారి చేతుల మీదుగా రూ. 36 కోట్ల నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజి ఇస్తున్నాం. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగింది, మిని ఫిషింగ్‌ హార్బర్‌ వెళ్ళిపోతే ఈ ప్రాంత మత్స్యకారుల గురించి ఆలోచించి రూ. 25 కోట్లతో ఫిషింగ్‌ జెట్టీకి సీఎంగారు శంకుస్ధాపన చేశారు. ఏది అడిగినా కాదనకుండా, ఏది కావాలన్నా లేదు అనని సీఎం మన రాష్ట్రానికి ఉండటం మనకు గర్వకారణం. అదే స్ధానంలో శ్రీ జగన్‌ గారు కాకుండా మరే సీఎం ఉన్నా నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజ్‌ కానీ ఫిషింగ్‌ జెట్టీ కానీ వచ్చే పరిస్ధితి ఉండేది కాదు. చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను అధికారంలోకి వస్తే అధునాతనమైన బాంబులతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పేల్చేస్తాను, వాటి వల్ల కాలుష్యం పెరుగుతుందన్నాడు, కానీ 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తుంటే బాంబులతో పేల్చేయడానికి వస్తున్నాడనుకుంటే కానీ ఆయన నిసిగ్గుగా అన్నింటికీ రిబ్బన్‌ కత్తిరించి నేను సర్‌ప్లస్‌ విద్యుత్‌ ఇస్తున్నానని నిర్లజ్జగా ప్రకటించుకున్నాడు. వాస్తవానికి ఏ ఒక్కటి కూడా అడగాలని లేకపోయినా ఈ రోజు మాత్రం ఇది అడగకతప్పలేదు. ఇక్కడ ఉప్పుకాలవ మీద బ్రిడ్జి రూ. 12 కోట్లు అవుతుంది, అది మంజూరు చేయమని అడుగుతున్నాం, దీంతోపాటు కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ. 9.40 కోట్లు బ్రిడ్జి... రెండు కలిపి రూ. 21.40 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఇప్పటికే గ్రామాలకు అవసరమైన అనేక నిధులు మంజూరు చేశారు. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మకుండా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీ పక్షాన నిలబడినందుకు వారికి ధన్యవాదాలు. మా ప్రాంత ప్రజలు మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్న కోరిక నెరవేరేలా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


*పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భారతదేశంలోనే మొట్టమొదటి సారి 2008లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు ఫౌండేషన్‌ స్టోన్‌ వేసిన దానిని మన సీఎంగారు ప్రారంభించారు. ఈ మూడున్నర ఏళ్ళలో విద్యుత్‌ రంగంలో ఎన్నో మార్పులు



తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏవైతే నష్టాల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగాన్ని వాటన్నింటిని మార్చి ముందుకు తీసుకెళుతున్నారు. 24 గంటలు నిరంతర విద్యుత్‌ నాణ్యమైనది ఇవ్వడం, రైతులకు చెప్పినట్లు నిరంతరాయంగా పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నారు. నాడు చంద్రబాబు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానిని అరికట్టి ఆదా చేయడంతో మన ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవార్డు కూడా వచ్చింది. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్‌ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎంగారు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. 2018–19 లో 50 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగం కాస్తా 2021–22 లో అది 61 వేల మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. భారతదేశంలోనే ఒక లీడ్‌ రాష్ట్రంగా మన సీఎంగారు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఉత్పత్తి ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ ఇచ్చే పరిస్ధితి వస్తుంది. ఈ రోజు ట్రాన్స్‌కో అభివృద్ది కోసం దాదాపు నాలుగువేల కోట్లతో కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడం, కొత్త లైన్లు వేయడం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుచేయడం, చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లు రిపేర్‌ చేయడం కోసం ఈ డబ్బు వెచ్చించి ట్రాన్స్‌కోను ముందుకు తీసుకెళుతున్నారు. చవక విద్యుత్‌ తీసుకొచ్చి ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ మూడేళ్ళలో దాదాపు రూ. 4,925 కోట్లు ఆదా చేయడం జరిగింది. డిస్కంలు ఆదుకునేందుకు రూ. 40 వేల కోట్ల ఆర్ధిక సాయం ఈ మూడేళ్ళలో సీఎంగారు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని ఈ సీఎంగారు ఆలోచన చేస్తే చంద్రబాబు మాత్రం తన హయాంలో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌లు అడ్డగోలుగా చేసుకుని ఈ డిస్కంలకు రూ. 20 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లేలా చేశారు. ఈ రోజు జెన్‌కో ఉత్పత్తి సామర్ధ్యం 7,189 మెగావాట్లు, ధర్మల్‌ క్రింద 5,010 మెగావాట్లు, జలవిద్యుత్‌ 1,774 మెగావాట్లు, సౌర విద్యుత్‌ 405 మెగావాట్లు ఇలా మొత్తం మనకు అవసరమైన 45 శాతం విద్యుత్‌ను జెన్‌కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఈమూడేళ్ళలో సీఎంగారు ప్రతి నెలా కూడా విద్యుత్‌ శాఖపై సమీక్ష జరిపి అన్ని రకాలుగా అండదండగా ఉన్నారు. ఈ విద్యుత్‌ శాఖ కూడా 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో సీఎంగారు ఉన్నారు. మనకు ఎవరూ శత్రువులు లేరు, కానీ ఒక టీవీ 5, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, ఈనాడు, వారికి తోడు దత్తపుత్రుడు కలిసి కుట్రపూరిత వ్యవహారంతో తప్పుడు సమాచారం మీకంతా టీవీల్లో చూపుతూ పత్రికల్లో రాస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయాలన్న ఆలోచనతో రామోజీరావు వయసు మీరినా కూడా అనేక అబద్దాలతో పెద్ద పెద్ద శీర్షికలు రాస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు, కానీ మనం వాస్తవాలు గ్రహించాలి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మనకు మంచి విద్య, వైద్యం అందిందా, మనం ఈ మూడున్నర ఏళ్ళలో ఏ విధంగా అభివృద్ది చెందామో ఆలోచించండి, మీరు ఈ పచ్చ పత్రికలు చదవద్దు, ఈ పచ్చ టీవీలు చూడద్దు, ఈ పచ్చరాతల్ని బహిష్కరించండి అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. సెలవు.

Comments