2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మన్, ఈవో పరిశీలన – టిటిడి ఏర్పాట్లపై భక్తుల ఆనందం
తిరుమల, అక్టోబరు 01 (ప్రజా అమరావతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గరుడ వాహనసేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పరిశీలించారు. టిటిడి చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వాహన మండపం, గ్యాలరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి టిటిడి అందిస్తున్న ఆహారం, పాలు, టి, కాఫీ, తాగునీరు అందరికీ అందుతున్నాయా అని ఆరా తీశారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పడమర మాడ వీధిలో ఒక మరుగుదొడ్డిలో నీరు నిలిచిపోయాయని భక్తులు తెలియజేయడంతో వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందిని పిలిపించి సమస్యను పరిష్కరించారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్, భద్రతా సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులందరికీ అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కువ మంది భక్తులకు గరుడ వాహనసేవ దర్శనం కల్పించేందుకు వీలుగా టిటిడి చరిత్రలో తొలిసారి కొన్ని గ్యాలరీల్లో భక్తుల రీఫిల్లింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దీనివల్ల అదనంగా సుమారు 50 వేల మందికి గరుడ వాహన సేవ దర్శనం కల్పించే అవకాశం కలుగుతుందని చెప్పారు.
కాగా, 1600 మంది శ్రీవారి సేవకులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీవారి సేవకుల సేవలను భక్తులు ప్రశంసించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంబిసి ప్రాంతంలోని అన్నారావు కాటేజి, ముళ్లగుంట, ఆస్థానమండపం వద్దగల ఉద్యానవనం, పడమర మాడ వీధిలోని మూలమఠం వెనుక వైపు, వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా గల గోశాల క్వార్టర్స్ వద్ద అదనంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు.
ఛైర్మన్, ఈవో వెంట జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.
addComments
Post a Comment